Share News

రోగులకు డయాలసిస్‌తో సరి

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:09 AM

ఎంతో అట్టహాసంగా గత ఏడాది డిసెంబరు 13 ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం-200 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. కిడ్నీ రోగులకు పెద్ద ఉపకారం చేశామని బిల్డప్‌ ఇచ్చారు.

రోగులకు డయాలసిస్‌తో సరి
పలాస-కాశీబుగ్గలోని కిడ్నీ పరిశోధన కేంద్రం-200 పడకల ఆసుపత్రి భవనాన్ని ప్రారంభిస్తున్న సీఎం జగన్‌ (ఫైల్‌)

- పెద్దాసుపత్రిగా.. కిడ్నీ పరిశోధన కేంద్రం

పలాస, ఏప్రిల్‌ 18: ఎంతో అట్టహాసంగా గత ఏడాది డిసెంబరు 13 ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం-200 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. కిడ్నీ రోగులకు పెద్ద ఉపకారం చేశామని బిల్డప్‌ ఇచ్చారు. వాస్తవానికి సీహెచ్‌సీ కన్నా పెద్దాసుపత్రిగా ప్రస్తుతం అక్కడ రోగులకు సేవలు అందిస్తున్నారంటే నమ్మశక్యం కాదు. పలాస, హరిపురం సీహెచ్‌సీల్లో ఉన్న డయాలసిస్‌ కేంద్రాలు పూర్తిగా బంద్‌ చేసి సంబంధిత పరికరాలు కిడ్నీ పరిశోధన కేంద్రానికి తీసుకెళ్లి సీఎంతో ప్రారంభించేశారు. అదనంగా ఒక సిటీ స్కాన్‌ మాత్రం కొత్తగా తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇక్కడి ఆసుపత్రిలో జనరల్‌ వైద్యానికి సంబంధించిన వైద్యాధికారులు తప్ప.. కిడ్నీ వ్యాధులకు ప్రత్యేక వైద్యులు ఎవరూ అందుబాటులో లేరు. కేవలం సిబ్బంది. ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ సహకారంతోనే నిర్వహిస్తున్నారు. సీఎం జగన్‌.. ఆసుపత్రి ప్రారంభించిన సమయంలో ఫిబ్రవరి-2024 నాటికి కిడ్నీ మార్పిడికి సంబంధించిన చికిత్స కూడా జరగాలని రాష్ట్ర వైద్యాధికారులకు సూచించిన విషయం తెలిసిందే. కాగా.. డయాలసిస్‌ కేంద్రంలో క్రమేపీ బెడ్ల పెంపు, పరిశోధన, 200 పడకల ఆసుపత్రిగా రూపొందిస్తామని సాక్ష్యాత్తు వైద్యాధికారులే స్పష్టం చేస్తుండడం విశేషం.

అతీగతి లేని ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌

పలాస మండలం రేగులపాడు గ్రామం వద్ద 25వేల ఎకరాలకు నిర్దేశించిన ఆఫ్‌షోర్‌ జలాశయాన్ని.. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 2008లో శంకుస్థాపన చేశారు. రూ.123కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించాల్సి ఉంది. పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం, టెక్కలి, మెళియాపుట్టి మండలాలకు చెందిన రైతులకు ఇది నిర్దేశించింది. నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పనులు ఆగిపోయాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దీనికి రూ.550కోట్లు నిధులు మంజూరు చేస్తు పరిపాలన ఆమోదాన్ని తెలిపారు. అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దీన్ని తామే నిర్మిస్తామని చెప్పి సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రూ.850 కోట్ల నిధులకు ఆమోదాన్ని తెలిపారు. ఐదేళ్లలో రూ.కోటి విలువైన పనులు కూడా జరగకపోవడంతో ఆఫ్‌షోర్‌ రిజర్యాయర్‌ నిర్మాణంపై నీలినీడలు అలముకున్నాయి. దీంతో పాటు నిర్వాసితులకు ఇచ్చిన కాలనీలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు గడపాల్సి వస్తోంది. ఆఫ్‌షోర్‌కు ఉదారంగా భూములిస్తే తమకు ఇచ్చిన గౌరవం ఇదేనా? అని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:09 AM