Share News

తల్లిదండ్రులూ తస్మాత్‌ జాగ్రత్త

ABN , Publish Date - May 29 , 2024 | 11:06 PM

పిల్లలపై అశ్రద్ధ వహించే తల్లిదండ్రులు తస్మాత్‌ జాగ్రత్త. తమ నిర్లక్ష్యం, అజాగ్రత్తతో మైనర్లకు వాహనాలిస్తే కొత్త వాహన చట్టం నిబంధనల మేరకు జైలు శిక్ష తప్పదు.

 తల్లిదండ్రులూ తస్మాత్‌ జాగ్రత్త

- మైనర్లు వాహనం నడిపితే రూ.25 వేల జరిమానా

- మద్యం సేవించి నడిపితే 6 నెలల జైలు

- 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమలు

శ్రీకాకుళం క్రైం, మే 29: పిల్లలపై అశ్రద్ధ వహించే తల్లిదండ్రులు తస్మాత్‌ జాగ్రత్త. తమ నిర్లక్ష్యం, అజాగ్రత్తతో మైనర్లకు వాహనాలిస్తే కొత్త వాహన చట్టం నిబంధనల మేరకు జైలు శిక్ష తప్పదు. అపరాధ రుసుం కూడా భారీగా కట్టాల్సి ఉంటుంది. రహదారి, ట్రాఫిక్‌ నియమ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సవరించిన కొత్త చట్టం జూన్‌ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుందని జిల్లా ఎస్పీ జీఆర్‌ రాధిక తెలిపారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘రహదారి నియమ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలి. లేదంటే భారీ జరిమానా విధించాలి ఉంటుంది. ప్రాణం చాలా విలువైంది. వాహనాల డ్రైవింగ్‌ సమయంలో కొద్ది పాటి నిర్లక్ష్యం వహిస్తే ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తుంది. పోలీసుల కోసం కాకుండా వాహనదారులు వారి ప్రాణాలు కాపాడుకోవడం కోసం హెల్మెట్‌, సీటు బెల్టు ధరించాలి. లైసెన్స్‌ పొందిన తరువాతే వాహనాలు నడపాలి. మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు రూ.25 వేలు జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తాం. మద్యం తాగి వాహనాలు నడిపితే రూ.10 వేలు జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తాం. రోడ్లపై కారుల్లో సురక్షితంగా ప్రయాణించాలంటే సీటు బెల్టు పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనచోదకులు హెల్మెట్‌ ధరించాలి. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పాటించాలి. సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయకూడదు. జూన్‌ ఒకటో తేదీ నుంచి కొత్త వాహన చట్టాన్ని అమలు చేస్తాం.’ అని ఎస్పీ తెలిపారు.

కౌంటింగ్‌ భద్రతా ఏర్పాట్ల పరిశీలన

గుజరాతీపేట: శివానీ ఇంజనీరింగ్‌ కళాశాల (చిలకపాలెం)లో ఓట్ల లెక్కింపు జరగనున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను ఎస్పీ జీఆర్‌ రాధిక బుధవారం పరిశీలించారు. ఏజెంట్లు, పోటీచేసే అభ్యర్థుల ప్రవేశ మార్గాలు, వాహనాల పార్కింగ్‌, కౌంటింగ్‌కు నిర్దేశించిన ప్రదేశాలు తదితర వాటిని ఆమె పరిశీలించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన చర్యలపై పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అదనపు ఎస్పీ జి.ప్రేమ్‌కాజల్‌, డీఎస్పీలు వై.శృతి, ఎల్‌.శేషాద్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:06 PM