Share News

పంచె కట్టులోనూ.. కుంచె పట్టులోనూ!

ABN , Publish Date - Sep 09 , 2024 | 11:27 PM

తెలుగు చిత్ర కళారంగంలో అందాల హరివిల్లుగా వెల్లివిరిసి.. మెరుపు వలే కనుమరుగైన కళాబ్రహ్మ వడ్డాది పాపయ్య (వ.పా). పురస్కారాలు, ప్రశంసల కోసం కొందరు బొమ్మలు గీయగా.. కళ కోసమే తపించి, కళాభిమానుల కోసమే చిత్రాలను గీసిన మహానీయుడు ఆయన.

పంచె కట్టులోనూ.. కుంచె పట్టులోనూ!

- చిత్ర కళ ఆయన సొత్తు

- నేడు వడ్డాది పాపయ్య జయంతి

ఎచ్చెర్ల: తెలుగు చిత్ర కళారంగంలో అందాల హరివిల్లుగా వెల్లివిరిసి.. మెరుపు వలే కనుమరుగైన కళాబ్రహ్మ వడ్డాది పాపయ్య (వ.పా). పురస్కారాలు, ప్రశంసల కోసం కొందరు బొమ్మలు గీయగా.. కళ కోసమే తపించి, కళాభిమానుల కోసమే చిత్రాలను గీసిన మహానీయుడు ఆయన. ఈయన శ్రీకాకుళం నగరంలో 1921 సెపెంబరు 10వ తేదీన జన్మించారు. ఆయన తండ్రి శ్రీరామ్మూర్తి వ్యాయామోపాధ్యాయుడిగా శ్రీకాకుళంలో పనిచేశారు. తండ్రి మార్గదర్శకంలో ఐదో ఏట హనుమంతుడి బొమ్మను గీసి చిత్రకళారంగంపై తన అభిరుచిని చాటారు. భారతీయ పురాణ, ఇతిహాసాలపై విద్యార్థి దశలోనే పట్టుసాధించి ఆ దిశగా తన చిత్రకళా ఆసక్తికి రంగులు, తన భావాలకు కుంచె ద్వారా మెరుగులుదిద్దుకున్నారు. రవివర్మ, దామెర్ల రామారావులను గురువులుగా భావించి పాపయ్య చిత్రకళారంగంలో ముందడుగు వేశారు. ఆయన చిత్రకారుడుగా ఎంత గొప్పవాడో, వ్యక్తిగా అంత నిరాంబరుడు. సాదాసీదా తెల్లపంచె.. అదే రంగు లాల్చీ ధరించి తెలుగుదనం ఉట్టిపడేలా ఉండేవారు. అప్పట్లో ఈయన భారతిలో గీచిన నాగేశ్వరుడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన రతీమన్మథ చిత్రాలు సంచలనం సృష్టించాయి. మంజూష, రేణాణి, అభిసారిక, అవినీతి, నవ్వులు-పువ్వులు పత్రికల్లో ఈయన గీచిన చిత్రాలను చూసిస చక్రపాణి స్వాతి, చందమామ చిత్రకారుడిగా మద్రాసు ఆహ్వానించారు. రాగాలతో రోగాలు నయమవుతాయనే నమ్మే వ.పా శివరంజని, హిందోళ, కన్నడ, శహన, జయజయవంతి, అహిరభైరవ రాగాలకు భావయుక్తమైన చిత్రాలను గీశారు. ఆయన కుంచె నుంచి జాలువారని చిత్రం లేదంటే అతిశయోక్తి లేదు. పురుణ పురుషులు, కావ్య నాయకులు, పల్లె పడుచులు, జాతీయ నాయకులు, వివిధ కాలాలు, రుతువులు, పండుగలు, ఆచార వ్యవహారాలు, జానపద విన్యాసాలు, రాగాలు, నదులు, ఊహా లోకాలు... ఇలా ఒకటేంటి మనిషిలోని, ప్రకృతిలోని అన్ని భావాలు, రూపాలను తన చిత్రాల ద్వారా చూపించారు. అందుకే ఆయన గీచిన చిత్రాల కోసం ఒకనాడు తెలుగు నేలపైన సామాన్యుడి నుంచి మేథావుల వరకూ అర్ధ శతాబ్ధం పాటు ఎదురుచూశారు. నేటికీ అవి సజీవ చిత్రాలుగా నిలుస్తున్నాయి.

ఊపిరినిచ్చిన చిత్రాలు

1940-90 వరకూ తెలుగు నేలపై ప్రచురితమైన పలు పత్రికలు, జర్నల్స్‌కు వ.పా గీచిన చిత్రాలు ఊపిరినిచ్చాయి. ఆయా పత్రికలు ప్రచురించే కథలు, నవలలకు ఆయన గీచిన చిత్రాలు ఎంతో ప్రాచుర్యాన్ని తెచ్చాయి. చిత్రకారుడిగానే కాకుండా కార్టూనిస్ట్‌గా, బొమ్మల కథా రచయితగా బహుముఖ ప్రజ్ఞావంతుడు. 1940 దశకంలో చిన్నారులను ఆకట్టుకోవడానికి ఆయన బాల పత్రికలో గీచిన చిత్రాలు ఎంతో తమాషాగా, ఆహ్లాదంగా ఉండేవి. చిత్రాలతో పాటు యువ, ఆనందవాణి, నవ్వులు పువ్వులు తదితర పత్రికల్లో గీచిన వందలాది కార్టూన్లు తెలుగు వ్యంగ్య చిత్ర కళలకు ఉత్తేజాన్ని నింపాయి. చందమామ, కథా మంజూష తదితర పత్రికల్లో ఎన్నో కథలను రాశారు. శరత్‌చంద్ర నవలలకు ఆయన గీచిన బొమ్మలు నాటి పాఠకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

నిరాడంబర జీవనం

నిరాడంబరత, మానవతకు దగ్గరగా, ప్రచారానికి, ప్రశంసలకు దూరంగా ఉంటూ.. పంచె కట్టులోనూ, కుంచె పట్టులోనూ అసలు సిసలైన తెలుగువానికి నిలువుటద్దంగా నిలిచారు. తన మరణం ముందుగా ఊహించి అంతియ చిత్రం తన అనంతరం వెయ్యడం కోసం కాకుండా, ఉన్నప్పుడే చూసుకునేలా చరమ చిత్రం చిత్రించుకున్న మహాచిత్రకారుడు వ.పా. అది స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమైంది. పత్రికలకు చిత్రాలు అందించే నిమిత్తం మద్రాసులో బజీ జీవితాన్ని గడిపినప్పటికీ.. దాని నుంచి బయటపడి తనకు నచ్చిన జీవనయానంలో భాగంగా అనకాపల్లికి సమీపంలోని కశింకోటకు చేరుకున్నారు. అక్కడే శారదా నది ఒడ్డున వ.పా వనం (010) నిర్మించుకుని తన కుమార్తె కుటుంబంతో కలిసి చివరి రోజులు గడిపారు. 1992 డిసెంబరు 30న వ.పా తుదిశ్వాస విడిస్తే.. ఒక రోజు తర్వాత ఈ లోకానికి ఈ వార్త తెలిసింది.

Updated Date - Sep 09 , 2024 | 11:40 PM