Share News

ప్రకటించారు.. మరిచారు

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:01 AM

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో రైతుబజారు ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఆర్భాట ప్రకటనలే తప్ప హామీ మాత్రం కార్యరూపం దాల్చలేదు. పలాస- కాశీబుగ్గలో రైతుబజారు ఏర్పాటుకు రూ.50లక్షలు కేటాయిస్తామని.. సీఎం జగన్‌ ప్రకటించినా ఇంతవరకూ నిధులు మంజూరు చేయలేదు.

ప్రకటించారు.. మరిచారు
కూరగాయల క్రయవిక్రయదారులతో రద్దీగా ఉన్న కాశీబుగ్గ పాత బస్టాండ్‌ ప్రాంగణం

- పలాస-కాశీబుగ్గలో కలగానే రైతుబజారు

- అమలుకు నోచుకోని సీఎం జగన్‌ ప్రకటన

- రోడ్డుపైనే విక్రయాలతో తప్పని ఇబ్బందులు

రాష్ట్ర వ్యాప్తంగా 100 రైతుబజార్లు ఏర్పాటు చేస్తాం. ఆ జాబితాలో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు కూడా చోటు కల్పించాం. రైతుబజారు ఏర్పాటు కోసం రూ.50 లక్షలు కేటాయిస్తాం.

- ఇదీ 2019 ఆగస్టు 8న శాసనసభలో సీఎం జగన్‌ ప్రకటన

.........................

పలాస-కాశీబుగ్గలో రైతుబజారు ఏర్పాటు చేస్తాం. స్థల పరిశీలన, టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభిస్తాం.

- అదే శాసనసభ వేదికగా మంత్రి సీదిరి అప్పలరాజు ప్రకటన

......................

అదిగో.. ఇదిగో.. అంటూ వైసీపీ పాలనకు ఐదేళ్లు గడిచిపోయాయి. కానీ ఇంతవరకూ రైతుబజారు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో జంట పట్టణ రైతులు, మత్స్యకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రోడ్డుపైనే విక్రయాలు సాగిస్తున్నారు. శాసనసభ వేదికగా సీఎం జగన్‌, మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన ప్రకటనలు.. అమలు కాలేదంటూ ఆరోపిస్తున్నారు.

.................

(కాశీబుగ్గ)

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో రైతుబజారు ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఆర్భాట ప్రకటనలే తప్ప హామీ మాత్రం కార్యరూపం దాల్చలేదు. పలాస- కాశీబుగ్గలో రైతుబజారు ఏర్పాటుకు రూ.50లక్షలు కేటాయిస్తామని.. సీఎం జగన్‌ ప్రకటించినా ఇంతవరకూ నిధులు మంజూరు చేయలేదు. స్థల పరిశీలన, టెండర్ల ప్రక్రియ పూర్తయిందని.. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయని రైతులు, మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబజారు లేకపోవడంతో రోడ్డుపైనే విక్రయాలు సాగిస్తున్నామని వాపోతున్నారు.

టీడీపీ హయాంలో ముందడుగు

టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుబజారు నిర్మాణానికి అడుగులు పడ్డాయి. 2018లో టెలిఫోన్‌ ఎక్స్చేంజి సమీపంలో స్థలాన్ని అధికారులు గుర్తించారు. టెండర్లు కూడా పూర్తిచేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో ఈ స్థలం తమదని కొందరు కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రాగా, ఆ తర్వాత వైసీపీ అఽధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 25శాతంలోపు ఉన్న పనులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రైతుబజారు ఏర్పాటు ముందుకు సాగలేదు. జంట పట్టణాల్లో రైతుబజారుకు అనువైన ప్రాంతాలు ఉన్నా వైసీపీ ప్రభుత్వం గుర్తించడంలో విఫలమయ్యిందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కరోనా వైరస్‌ విజృంభించిన సమయంలో రైతుబజారు విషయంలో వైసీపీ నాయకులు హడావుడి చేశారు. కాశీబుగ్గ మూడురోడ్ల జంక్షన్‌ వద్ద ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో రాజన్న రైతుబజారు పేరుతో భారీ హోర్డింగ్‌ పెట్టి హల్‌చల్‌ చేశారు. ఇది మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలింది. ఆ తర్వాత పద్మనాభపురం ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. ఈ ప్రాంతం జంట పట్టణాలకు దూరంగా ఉంటుందని తేలడంతో ప్రతిపాదన విరమించుకున్నారు. ఆ తరువాత ఎస్టీ హాస్టల్‌ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో రైతుబజారు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ కోర్టు కేసులు ఎదురు కావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. దీంతో జంట పట్టణాల్లో రైతుబజారు లేకుండా పోయింది.

బస్టాండ్‌ ప్రాంగణంలో..

ప్రస్తుతం రైతుబజారు లేకపోవడంతో పాతబస్టాండ్‌ ప్రాంగణంలో కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. ఒక వైపు మైదానం, మరోవైపు ఉద్దానం, ఇంకోవైపు తీర ప్రాంతం ఉండడంతో రైతులు వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్యకారులు చేపలను తెచ్చి ఇక్కడే విక్రయిస్తున్నారు. గిరిజనులు సైతం అటవీ ఉత్పత్తులు ఇక్కడే అమ్ముతున్నారు. బస్టాండ్‌ ప్రాంగణంలో కూరగాయల దుకాణాల వల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిపోయే వాహనాలు కూడా నిలిపేందుకు అగచాట్లు తప్పడంలేదు. కొందరు జంట పట్టణాల్లో రహదారులపై షాపులు ఏర్పాటు చేసి విక్రయిస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతోంది.

ట్రాఫిక్‌కు ఇబ్బందులు

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో రైతుబజారు ఏర్పాటు చేయకపోవడం అన్యాయం. రోడ్లపైనే కూరగాయల విక్రయిస్తుండడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక్కడ రైతుబజారు ఏర్పాటు కేవలం కూటమి తోనే సాధ్యమవుతుందని నియోజకవర్గ ప్రజలు గ్రహించాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మించి, రైతుల సమస్యను పరిష్కరించాలి.

-డాక్టర్‌ వి.దుర్గారావు, పలాస నియోజకవర్గ జనసేన సమన్వయకర్త

................

రైతులను ఆదుకోవాలి

రైతులు రోడ్లపై కూరగాయలను విక్రయించుకోవాల్సి వస్తోంది. దీంతో దళారులు ఎంతకు అడిగితే అంతకు పంటను విక్రయించుకుంటున్నారు. రైతుబజారు ఉంటే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. కొనుగోలు దారులకు గిట్టుబాటు అవుతుంది. సామాన్య, మఽధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు లభిస్తాయి. రైతుబజారు ఏర్పాటుచేసి ఆదుకోవాలి.

- చాపర వేణుగోపాల్‌, కాశీబుగ్గ సీపీఐ నాయకుడు

Updated Date - Apr 28 , 2024 | 12:01 AM