Share News

మా భూములు లాక్కున్నారు

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:34 PM

నాలుగేళ్లుగా వివాదాస్పదంగా మారిన నల్లబొడ్లూరు కొండ వివాదం మరో మలుపు తిరిగింది. కొండపై తమకు చెందిన భూములను కొంతమంది వైసీపీ నాయకులు మాజీమంత్రి సీదిరి అప్పలరాజు పేరు చెప్పి.. బలవంతంగా లాక్కున్నారని ఆరోపిస్తూ ఆదివారం కొండపై రైతులు ఆందోళన చేపట్టారు.

మా భూములు లాక్కున్నారు
నల్లబొడ్లూరు కొండపై ఆందోళన చేస్తున్న రైతులు

- మాజీ మంత్రి సీదిరి ఆధ్వర్యంలో కబ్జా

- నల్లబొడ్లూరు కొండపై రైతుల ఆందోళన

- బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

హరిపురం, జూలై 28: నాలుగేళ్లుగా వివాదాస్పదంగా మారిన నల్లబొడ్లూరు కొండ వివాదం మరో మలుపు తిరిగింది. కొండపై తమకు చెందిన భూములను కొంతమంది వైసీపీ నాయకులు మాజీమంత్రి సీదిరి అప్పలరాజు పేరు చెప్పి.. బలవంతంగా లాక్కున్నారని ఆరోపిస్తూ ఆదివారం కొండపై రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘25 ఏళ్ల కిందట ఈ కొండపై సుమారు పది కుటుంబాలకు 10ఎకరాల స్థలం పట్టాలు అందజేశారు. ఈ స్థలంలో జీడి, మామిడి తోటలు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. నాలుగేళ్ల కిందట వైసీపీ నాయకులు, స్థానిక సర్పంచ్‌, ఎంపీపీ దానయ్య.. అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు పేరుచెప్పి మా భూములు బలవంతంగా లాక్కున్నారు. ఎదురుతిరిగితే భయపెట్టి బెదిరిచారు. గట్టిగా నిలదీస్తే ఇళ్లపట్టాలతోపాటు నష్ట పరిహారం కూడా అందిస్తామని నమ్మబలికారు. తీరాచూస్తే తోటలు తొలగించి కంకర, రాళ్లు అమ్ముకున్నారని, ఈ ప్రాంతం చదును చేసి కబ్బాకు పాల్పడ్డారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి ప్రభుత్వం అందజేసిన పట్టాలు చేతపట్టుకుని ఆందోళనకు దిగారు. ఎన్టీయే కూటమి ప్రభుత్వం, కేంద్ర మంత్రి రామ్మోహననాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తమ భూములు తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. కొండను తవ్వి అక్రమాలకు పాల్పడి రూ.కోట్లు సంపాదించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మావోయిస్టు నేత ఆజాద్‌ తల్లి కాములమ్మ, తులసమ్మ, వాసుదేవు, నీలకంఠం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 11:34 PM