Share News

జగన్‌ను ఓడిస్తేనే గ్రామ వ్యవస్థల మనుగడ

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:50 PM

‘జగన్మోహన్‌రెడ్డి దుర్మార్గ పాలనలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. గ్రామాల్లో కనీసస్థాయి అభివృద్ధి లేదు. అందుకే జగన్‌ను ఓడిద్దాం.. గ్రామ వ్యవస్థలను కాపాడుకుందాం’ అని పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు పిలుపునిచ్చారు.

జగన్‌ను ఓడిస్తేనే గ్రామ వ్యవస్థల మనుగడ
కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న సర్పంచ్‌లు

- పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌

- ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సర్పంచ్‌ల నిరసన ధర్నా

అరసవల్లి, ఫిబ్రవరి 29: ‘జగన్మోహన్‌రెడ్డి దుర్మార్గ పాలనలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. గ్రామాల్లో కనీసస్థాయి అభివృద్ధి లేదు. అందుకే జగన్‌ను ఓడిద్దాం.. గ్రామ వ్యవస్థలను కాపాడుకుందాం’ అని పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌ వద్ద సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్‌ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. కార్యాలయం ప్రధాన గేటు వద్ద మండుటెండలో కింద కూర్చుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘జగన్‌ పాలనలో సచివాలయ వ్యవస్థను తెచ్చి.. పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులను కాజేశారు. గ్రామాల్లో అభివృద్ధి కాదు కదా.. కనీసం వీధి దీపాలు వేయడానికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి కల్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. నాలుగేళ్లుగా పోరాడుతున్నా.. ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పనిచేయాలని కోరారు.

- సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని, జగన్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని తెలిపారు. జగన్‌రెడ్డి అరాచకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని కోరారు. జగన్‌ ఓటమితోనే పంచాయతీల మనుగడ సాధ్యమని స్పష్టం చేశారు.

- సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్‌ మాట్లాడుతూ సర్పంచ్‌లను దిష్టిబొమ్మలుగా మార్చి, పంచాయతీ నిధులను కాజేసిన జగన్‌రెడ్డిని ఓడించడానికి అందరూ కంకణ బద్ధులం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల బాధలు జగన్‌రెడ్డికి పట్టవని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ ఓటమితోనే పంచాయతీల పునరుజ్జీవనం వస్తుందన్నారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి సర్పంచ్‌ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ చాంబర్‌ ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనెపు రామకృష్ణం నాయుడు, వై.వినోద్‌రాజు, వానపల్లి ముత్యాలరావు, ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచాయితీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు చుక్క ధనుంజయ యాదవ్‌, రాష్ట్ర నాయకులు భానోజినాయుడు, రౌతు శ్రీనివాసరావు, అప్పలనాయుడు, గోవిందరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 11:50 PM