Share News

గుంభనంగా వైసీపీ.. ధీమాతో కూటమి

ABN , Publish Date - May 14 , 2024 | 11:59 PM

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. పోలింగ్‌ 76.80శాతం నమోదైంది. జిల్లాలో శ్రీకాకుళం, ఇచ్ఛా పురం, పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల, ఆమదాల వలస, నరసన్నపేట నియోజకవర్గాల్లో సోమవారం అర్ధరాత్రి వరకూ పోలింగ్‌ కొనసాగింది. ఈ దఫా మహిళా ఓటర్లు భారీగా తరలివచ్చారు.

గుంభనంగా వైసీపీ.. ధీమాతో కూటమి

- గెలుపోటములపై ఎవరికి వారే అంచనాలు

- అభ్యర్థులు విజయంపై జోరుగా పందేలు

- జిల్లాలో పోలింగ్‌ 76.80 శాతం

- ఎచ్చెర్లలో అత్యధికం.. శ్రీకాకుళం అత్యల్పం

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. పోలింగ్‌ 76.80శాతం నమోదైంది. జిల్లాలో శ్రీకాకుళం, ఇచ్ఛా పురం, పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల, ఆమదాల వలస, నరసన్నపేట నియోజకవర్గాల్లో సోమవారం అర్ధరాత్రి వరకూ పోలింగ్‌ కొనసాగింది. ఈ దఫా మహిళా ఓటర్లు భారీగా తరలివచ్చారు. జిల్లాలో 18,75,934 మంది ఓటర్లు ఉన్నారు. ఓటేసినవారు 14,40,885 మంది. పురుష ఓటర్లు 9,29,859 ఉండగా.. 7,01,016 మంది ఓటువేశారు. వీరి పోలింగ్‌ 75.39 శాతం నమోదైంది. మహిళా ఓటర్లు 9,45,945 ఉండగా.. 7,39,852 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి ఓటింగ్‌ శాతం 77.21 శాతంగా ఉంది. ట్రాన్స్‌జెండర్స్‌ 130 మంది ఉండగా 17 మందే ఓటు వేశారు. ఎచ్చెర్ల అసెంబ్లీలో అత్యధికంగా 83.27 శాతం పోలింగ్‌ నమోదైంది. శ్రీకాకుళంలో 70.21 శాతంతో అత్యల్పంగా పోలింగ్‌ జరిగింది. తెలుగుదేశం, జనసే, బీజే పీ కూటమిగా ఏర్పడి ఈ దఫా ఎన్నికల్లో పోటీచేసింది. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెం ట్‌ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థులు, ఎచ్చెర్లలో బీజేపీ అభ్యర్థి పోటీచేశారు. పోలింగ్‌ జరిగాక.. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో 19 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఆమదాలవలసలో..

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం 13,991 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఐదేళ్లలో అభివృద్ధి చేయకపోవడం, వైసీపీలో నాలుగు వర్గాలుగా విడిపోవడం, పలు ఆరోపణలు సీతారాంను చుట్టుముట్టడం.. ముఖ్యంగా శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు పూర్తిచేయించలేక పోవడంతో ప్రజలు వైసీపీపై విసిగిపోయారు. ఇక్కడ టీడీపీ చేపట్టిన ప్రతికార్యక్రమం విజయవంతమైంది. ప్రజలు కూన రవికుమార్‌ వైపు మొగ్గుచూపారన్న సర్వే నివేదికలు వెల్లడవుతున్నాయి. ఈ దఫా మెజార్టీ భారీగా ఉంటుందని కూన రవి అంచనా వేసుకుంటున్నారు.

ఎచ్చెర్ల..

గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ 18,711 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ దఫా బీజేపీ నుంచి నడుకుదిటి ఈశ్వరరావు పోటీచేశారు. ఐదేళ్లలో వైసీపీ హత్యారాజకీయాలు.. కిడ్నాప్‌లు.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్ల ఎన్నికల్లో గంపగుత్తుగా బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు వెంట జనం నడిచారన్న అభిప్రాయం ఉంది. ఇక్కడ అత్యధిక శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ బీజేపీ గెలుపు ఖాయమని, కూటమి అధికారంలోకి వస్తే మంత్రి పదవి వరించవచ్చని చర్చ ఉంది. పోలింగ్‌ రోజే ఎమ్మెల్యే కిరణ్‌ను ఓటర్లు ప్రశ్నించి.. గ్రామాలను ఏం అభివృద్ధి చేశావంటూ నిలదీశారు. దీంతో వైసీపీలో గెలుపు ధీమా కనిపించడం లేదు.

నరసన్నపేట..

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌కు గత ఎన్నికల్లో 19,555 ఓట్ల మెజార్టీ లభించింది. ఇప్పుడు ఎంతమేర ఓట్లతేడాతో ఓటమిపాలవుతారా? అన్నది టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. సొంతపార్టీలో అసంతృప్తి.. హామీలే తప్ప అమలుచేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఓటు రూపంలో వైసీపీపై బదులు తీర్చుకున్నారని సమాచారం. టీడీపీ కేడర్‌ ఆనందంగా ఉంది.

శ్రీకాకుళం..

ధర్మాన ప్రసాదరావు 2019లో కేవలం 5777 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జనసేన అభ్యర్థికి 7,557, బీజేపీకి 1,340 ఓట్లు లభించాయి. ఇప్పుడు జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా టీడీపీకి మద్దతు ఇచ్చాయి. టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌ రెండేళ్ల నుంచి సొంతంగా అన్నక్యాంటీన్‌ నిర్వహించడం.. విభిన్నరీతిలో టీడీపీ కార్యక్రమాలు చేసుకుంటూపోవడం.. ప్రజలకు దగ్గరవడంతో విజయం తిరుగులేదన్న సంకేతాలు పాకిపోయాయి.

టెక్కలి..

ఇక్కడ వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ కావడంతో తెలుగుదేశం అభ్యర్థి, మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గెలుపు మరోమారు ఖాయమని వైసీపీ నాయకులే అంచనాకు వచ్చేశారు. అచ్చెన్నకు హ్యాట్రిక్‌గా భారీ మెజార్టీ లభిస్తుందని పక్కాలెక్కలు వేసుకుంటున్నారు. అన్నిగ్రామాల కార్యకర్తలు, సాధారణ ప్రజలు సైతం అచ్చెన్నాయుడు వద్దకు వచ్చిమరీ చెబుతున్నారు. టెక్కలిలో ప్రజల తీర్పు ఏకపక్షమే అని, ఇంతకు మించి విశ్లేషణ కూడా ఉండదని ప్రజల భావన.

పాతపట్నం

తెలుగుదేశం పార్టీకి విపరీతమైన ప్రజాబలం ఉన్న నియోజకవర్గం ఇది. వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేస్తే .. ప్రజలు టీడీపీ అభ్యర్థిని గెలిపించారు. రాష్ట్రంలో టీడీపీకి దక్కిన ఏకైక జడ్పీటీసీ ఇదే. అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా మామిడి గోవిందరావుకు టీడీపీ అవకాశం కల్పించింది. మొదట్లో కాస్తంత గందరగోళమున్నా.... ఆయనకు ప్రజాబలం లభించింది. పైగా వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై ఉన్న అసమ్మతి వర్గమంతా టీడీపీలో చేరి గట్టిగా పనిచేశారు. ఇక్కడ విజయం తమ ఖాతాలోకి ఖాయమని టీడీపీ వర్గాలు చెబతున్నాయి.

పలాస..

వైసీపీ నుంచి సీదిరి అప్పలరాజు 2019 ఎన్నికల్లో గెలుపొందారు. ఐదేళ్లలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేష్‌ను విమర్శించేందుకు ఇచ్చిన ప్రాధాన్యం.. నియోజకవర్గంలో వైసీపీ కేడర్‌ను కాపాడుకునేందుకు ఇవ్వలేదు. దీంతో ఆయన ముఖ్యఅనుచర వర్గమంతా టీడీపీకి జై కొట్టేశారు. సొంత మండలంలో కూడా అప్పలరాజుకు పోలింగ్‌ రోజున నిలదీతలు ఎదురయ్యాయి. టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష ఐదేళ్లు పోరాడటంతో ప్రజలు ఆమెవైపే నిలిచారన్నది టీడీపీ వర్గాల ధీమా.

ఇచ్ఛాపురం..

టీడీపీ కంచుకోటగా ఉండే నియోజకవర్గం ఇచ్ఛాపురం. ఇక్కడ నుంచి పోటీచేసి రెండు దఫాలు గెలిచిన బెందాళం అశోక్‌ మరోమారు హ్యాట్రిక్‌ సాధించేందుకు సిద్ధంగా ఉన్నారన్న ధీమా కనిపిస్తోంది. వైసీపీ నుంచి ఎంతటి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపినా.. ప్రముఖులు ప్రచారం నిర్వహించినా.. ప్రజల మద్దతు తెలుగుదేశానికే అనేరీతిలో పరిస్థితి ఉంది.

వైసీపీ నాయకులు.. పైకి గుంభనంగా..

పదిరోజుల క్రితం వరకు వైసీపీ అభ్యర్థుల్లో ఉన్న ఉత్సాహం.. ఇప్పుడు కనిపించడం లేదు. ప్రతి అభ్యర్థి పైకి గుంభనంగా ఉన్నా అంచనాలు తారుమారవుతాయని భయాందోళన చెందుతున్నారు. నవరత్నాలు మినహా.. అభివృద్ధి చేపట్టలేదన్న భావన వారిలో ఉంది. ఇవేవీ బయటకు కనిపించనీయకుండా.. ఓటుకు నోట్లు పంపిణీ చేశారు. సర్వేలు ఎన్డీఏ కూటమికే అనుకూలంగా ఉండటంతో ఓటర్లు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Updated Date - May 14 , 2024 | 11:59 PM