ఆఫ్‌షోర్.. ఆపేస్తారా?
ABN , Publish Date - Oct 19 , 2024 | 11:45 PM
ఆఫ్‌షోర్ ప్రాజెక్టుపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. సుమారు 16 ఏళ్ల కిందట ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నారు.. కానీ పనులు మాత్రం పూర్తికావడం లేదు.
- 25 శాతం పూర్తికాని పనులపై నీలినీడలు
- ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ మెమో జారీ
- వైసీపీ హయాంలో ఏడు శాతమే పనులు
టెక్కలి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ఆఫ్‌షోర్ ప్రాజెక్టుపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. సుమారు 16 ఏళ్ల కిందట ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నారు.. కానీ పనులు మాత్రం పూర్తికావడం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతమేర పనులు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో కేవలం ఏడు శాతం మాత్రమే పనులు చేపట్టింది. కాగా గత ఐదేళ్లలో అగ్రిమెంట్ ప్రకారం 25 శాతం లోపల జరిగిన పనులు ఎందుకు రద్దు చేయకూడదని.. ఇటీవల ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ చావెల్ మెమో జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులు ఆపేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- పలాస మండలం రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌కు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008 ఏప్రిల్ 4న శంకుస్థాపన చేశారు. మెళియాపుట్టి, నందిగాం, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల పరిధిలో 24,600 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రూ.127కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. మెళియాపుట్టి, చాపర సమీపంలో మహేంద్రతనయపై ఫ్లడ్‌ఫ్లో కెనాల్ ఏర్పాటు చేసి సాగునీటిని కాలువల ద్వారా రేగులపాడు రిజర్వాయర్‌కు తరలించాలని నిర్ణయించారు. రిజర్వాయర్ నుంచి వివిధ ప్రాంతాలకు సాగునీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో పనులకు శ్రీకారం చుట్టారు. కాగా శంకుస్థాపన చేసి 16 ఏళ్లు అవుతున్నా.. పనులు పూర్తికాలేదు. 2008 నుంచి 2019 నాటికి 35 శాతం పనులు పూర్తయ్యాయి. 2014-19 మధ్య టీడీపీ హయాంలో కొంతమేర పనులు ముందుకు సాగాయి. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో కేవలం ఏడు శాతం మాత్రమే పనులు చేపట్టారు.
- 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం ఈపీసీల జాప్యమంటూ సాంకేతిక కొర్రీలు వేస్తూ.. అప్పట్లో రాష్ట్రంలో 183 పనులు రద్దు చేసింది. తర్వాత కొత్త ఎస్‌ఎస్‌ఆర్ రేట్లతో రివర్స్ టెండరింగ్ అంటూ 4.24ఎక్సెస్ కోడ్ చేసి సింగిల్‌టెండర్‌గా మిగిలిన సాయిలక్ష్మి కనష్ట్రక్షన్స్‌కు రూ.288కోట్ల టెండర్లతో అప్పగించింది. ఈ సంస్థ కేవలం రూ.20కోట్లు వరకు మాత్రమే పనులు చేసి వదిలేసింది. 2022 తరువాత చేపట్టిన ఆర్‌ఎంసీ హెడ్, బాక్స్ కటింగ్, డైవర్షన్ రోడ్డు వంటి పనులు చేపట్టగా.. ఇందుకు సంబంధించిన రూ.20కోట్ల బిల్లులు చెల్లించలేదు. అలాగే 2008 నుంచి 2019 వరకు ఆఫ్‌షోర్ పనులు చేపట్టిన హిందుజా, ఎస్‌వీసీ సంయుక్తంగా చేపట్టిన పనులకు సుమారు రూ.15.50కోట్లు కాంట్రాక్టర్‌కు బకాయి ఉంది. పనుల్లో జాప్యం కారణంగా ఏటా అంచనా వ్యయం పెరుగుతోంది. ఆఫ్‌షోర్ ప్రాజెక్ట్ పూర్తిచేయాలంటే ఇంకా రూ.499కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.
- తాజాగా గత నెల 29న ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ చావెల్.. వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్రిమెంట్ ప్రకారం 25శాతం లోపల చేపట్టిన పనులు ఎందుకు రద్దు చేయకూడదని మెమో జారీచేశారు. దీంతో ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులు రద్దయినట్టేనా అన్న సందేహం కలుగుతోంది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టి సారిస్తే ఆఫ్‌షోర్ ప్రాజెక్ట్‌కు మోక్షం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
- ఈ విషయమై నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ స్వర్ణకుమార్ వద్ద ప్రస్తావించగా ఆఫ్‌షోర్‌కు సంబంధించి మొత్తంగా 45శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. సాయిలక్ష్మి కనష్ట్రక్షన్స్ రూ.20కోట్లు మేరకే పనులు చేసిందన్నారు. అందుకే సీఈ స్థాయి అధికారి ఈ పనులు రద్దు చేయకుండా పునరుద్ధరించాలని ప్రభుత్వానికి కోరుతున్నట్లు తెలిపారు.