మరమ్మతుకు నోచుకోక.. వినియోగంలో లేక
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:18 PM
మందస మండలంలోని కిల్లోయి, పలాస మండలంలోని హిమగిరిలో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) గోదా ములు మరమ్మతులు లేకపోవడంతో వినియోగించడానికి వీల్లేకుండా తయారయ్యాయి.

పలాస రూరల్/మందస
మందస మండలంలోని కిల్లోయి, పలాస మండలంలోని హిమగిరిలో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) గోదా ములు మరమ్మతులు లేకపోవడంతో వినియోగించడానికి వీల్లేకుండా తయారయ్యాయి. ఆ శాఖ నిర్లక్ష్యం వల్ల భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. గిరిజనుల అభివృద్ధికి ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం పుణ్యమాని సంస్థ నీరుగారుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన గోదాములు కనీస మరమ్మతులకు నోచుకోకపోవంతో గోదాములు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.ఈ గోదాముల నుంచి నిత్యావసర సరుకులను గిరిజనులకు పంపిణీ చేస్తున్నారు. తితలీ తుఫాన్ అనంతరం కిల్లోయి కాలనీలో నిర్మించిన గిరిజన సహకార సంస్థ గోదాముకు సంబంఽధించి పైకప్పు ఎగిరిపోగా, అదనపు పాఠశాల గదిలో సరుకులను ఉంచి పంపిణీ చేసేవారు. ఈ నేప థ్యంలో చుట్టూ పిచ్చిమొక్కలు పెరగడం, పైకప్పు ఎగిరిపోయి ఐదేళ్లైనా పర్యవేక్షణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. హిమగిరిలో గిరిజన సహకార సంస్థ గోదాము చుట్టూ కూడా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. గోడ, స్లాబ్ పెచ్చులూడి శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడి నుంచే నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతున్నా అధికారులు కనీస మరమ్మతులకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని పలువురు గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గోదాములకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని గిరిజనులు కోరుతున్నారు.