Share News

నామినేషన్ల సందడి

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:17 AM

జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామినేషన్ల సందడి పెరిగింది. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి 4, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 16 నామినేషన్లు దాఖలయ్యాయి.

నామినేషన్ల సందడి
పాతపట్నంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆధ్వర్యంలో నామినేషన్‌ ర్యాలీగా వెళ్తున్న టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు, పార్టీ శ్రేణులు

- రెండో రోజూ ఎంపీ స్థానానికి 4..

- అసెంబ్లీ స్థానాలకు 16 దాఖలు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ పలాస/ ఆమదాలవలస/ పాతపట్నం/ టెక్కలి)

జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామినేషన్ల సందడి పెరిగింది. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి 4, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 16 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం టీడీపీ, వైసీపీ అభ్యర్థులతోపాటుగా ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్‌ దాఖలుచేశారు.

- శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గానికి వైసీపీ నుంచి పేరాడ తిలక్‌ రెండు సెట్ల నామినేషన్‌ వేశారు. తన పేరిట రూ. 51,47,672, భార్యపేరిట రూ. 89,72,658, ఇద్దరి కుటుంబ సభ్యుల పేర్లతో రూ.15.64లక్షల చరాస్తులున్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. స్థిరాస్తుల విషయానికొస్తే.. రూ. 9,34,19,600, భార్య పేరిట రూ. 1,84,73,000 ఉన్నట్టు తెలిపారు. ఇతర ఆస్తులు, రుణాలను వెల్లడించారు. అలాగే జైభారత్‌ నేషనల్‌ పార్టీ నుంచి ఇప్పిలి సీతారాజు, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరపున బొమ్మాళి తిరుపతిరావు నామినేషన్‌ వేశారు.

- అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికొస్తే.. ఇచ్ఛాపురం, నరసన్నపేట నియోజకవర్గాలు మినహా ఇతర నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు. పలాసలో టీడీపీ అభ్యర్థిగా గౌతు శిరీష శుక్రవారం నామినేషన్‌ వేశారు. ఎన్నికల అధికారి భరత్‌నాయక్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. తన పేరుమీద రూ.3,70,48,361, భర్త పేరుమీద రూ. 16,35,17,134.99, కుమార్తె/కుమారుడి పేరుమీద రూ. 83,58,818.65 ఆస్తులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో శిరీష పేర్కొన్నారు. టీడీపీ డమ్మీ అభ్యర్థిగా మాజీమంత్రి, శిరీష తండ్రి గౌతు శ్యామసుందరశివాజి నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే పలాస కాంగ్రెస్‌ అభ్యర్థిగా మజ్జి త్రినాథ్‌బాబు రెండుసెట్ల నామినేషన్‌ వేశారు.

- ఆమదాలవలసలో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌తో పాటు ఆయన సతీమణి, పొందూరు మాజీ ఎంపీపీ కూన ప్రమీల చెరో రెండు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఎం.నవీన్‌కు అందజేశారు. ముహూర్తం ప్రకారం నామినేషన్‌ వేశామని, 23న పార్టీ శ్రేణులు, అభిమానుల సమక్షంలో మరోసారి నామినేషన్‌ వేయనున్నట్టు కూన రవికుమార్‌ ప్రకటించారు.

- పాతపట్నంలో టీడీపీ తరపున మామిడి గోవిందరావు, మామిడి సుదిష్ణ నామినేషన్‌ వేశారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

- టెక్కలిలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నుంచి కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి నామినేషన్లు వేశారు. తనపై ఎటువంటి కేసులు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో కృపారాణి వెల్లడించారు. రూ.1,61,25,000 విలువ చేసే 215 తులాల బంగారం, రూ.3.40లక్షల విలువైన ఐదు కిలోల వెండి, 1,94,56,000 విలువచేసే చరాస్తులు, రూ.3.10 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. విశాఖలో రూ.75లక్షలు విలువచేసే కమర్షియల్‌ బిల్డింగ్‌, టెక్కలి, విశాఖలో స్థిర నివాసాల విలువ రూ.80లక్షలు ఉంటుందని తెలిపారు. తదితర ఆస్తులు, ఇతర అప్పుల వివరాలను వెల్లడించారు.

- శ్రీకాకుళం నుంచి భారత చైతన్య యువజన పార్టీ నుంచి పనిలి ప్రసాద్‌ నామినేషన్‌ వేశారు. ఆమదాలవలస నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీవిప్‌ కూన రవికుమార్‌ రెండు సెట్లు, కూన ప్రమీల రెండు సెట్లు నామినేషన్‌ వేశారు. ఎచ్చెర్ల నుంచి వైసీపీ తరపున గొర్లె కిరణ్‌ కుమార్‌, గొర్లె పరిమళ, బహుజన సమాజ్‌పార్టీ నుంచి గంట్లాన రామారావు నామినేషన్‌ వేశారు.

Updated Date - Apr 20 , 2024 | 12:17 AM