wild animals: వన్యప్రాణులకు రక్షణేదీ?
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:50 PM
wild animals వన్యప్రాణులకు రక్షణ కరువైంది. కొందరి చేతుల్లో అవి బందీ అవుతున్నాయి. కోతులు, పాములు, తాబేళ్లు, అడవిపిల్లులు, అలుగులు తదితర వాటిని కొంతమంది ఆట వస్తువులుగా వినియోగిస్తున్నారు.

విదేశాల నుంచి యథేచ్ఛగా స్మగ్లింగ్
ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా
అధిక ధరకు విక్రయం
ఆట వస్తువులుగా వినియోగిస్తున్న వైనం
పలాస, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి):
ఈ ఏడాది మార్చి 7న ముగ్గురు కోల్‌కతా వాసులు రెండు మౌంటేన్ మంకీస్(ఆఫ్రికా బ్రీడ్ కోతులు)ను వాహనంలో అసోం మీదుగా చెన్నైకు తరలిస్తుండగా ఇచ్ఛాపురం చెక్‌పోస్టు వద్ద కాశీబుగ్గ అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఈ కోతులను అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠా మన దేశానికి తీసుకువచ్చి అసోంలో కోల్‌కతాకు చెందిన బ్రోకర్లకు అప్పగించినట్లు విచారణలో తేలింది. ఆ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేసి.. కోతులను విశాఖపట్నం జంతుప్రదర్శనశాలకు తరలించారు.
గత నెల 12న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు పాములు, తాబేళ్లు, అడవిపిల్లిని స్మగ్లింగ్ చేస్తుండగా ఇచ్ఛాపురం చెక్‌పోస్టు వద్ద కాశీబుగ్గ అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డారు. వారినుంచి మొత్తం 21 వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కట్టుదిట్టమైన భద్రత మధ్య విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలకు తరలించారు.
రెండేళ్ల కిందట పలాసకు చెందిన ముగ్గురు స్మగ్లర్లు మహేంద్రగిరి కొండల్లో అరుదుగా లభించే అలుగులను అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి మూడు అలుగులను స్వాధీనం చేసుకుని అడవిలో విడిచిపెట్టారు.
వన్యప్రాణులకు రక్షణ కరువైంది. కొందరి చేతుల్లో అవి బందీ అవుతున్నాయి. కోతులు, పాములు, తాబేళ్లు, అడవిపిల్లులు, అలుగులు తదితర వాటిని కొంతమంది ఆట వస్తువులుగా వినియోగిస్తున్నారు. వాటిని తమ దగ్గర ఉంచుకోవడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. ఇలాంటి వారి కోసం స్మగ్లర్లు కొన్ని జంతువులను విదేశాల నుంచి, మరికొన్నింటిని స్థానిక అడవుల నుంచి తెస్తున్నారు. వాటిని అక్రమ మార్గంలో రవాణా చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఉగండా దేశంలో అరుదైన మౌంటేన్ మంకీస్(ఆఫ్రికాబ్రీడ్ కోతులు) లభ్యమవుతాయి. ఇవి మనుషులకు ఎటువంటి హాని చేయవు. వీటిని పెంపుడు జంతువులుగా ఇంట్లో పెంచుకునేందుకు అనేకమంది ఇష్టపడుతుంటారు. ఈ కారణంగా అంతర్జాతీయ స్మగ్లర్లు వాటిని మన దేశానికి తీసుకువచ్చి రూ.లక్షలకు అమ్ముతున్నారు. అలాగే, పాములు, తాబేళ్లు, అడవి పిల్లుల పిల్లలను కూడా విదేశాల నుంచి తీసుకువస్తున్నారు. వాటికి రక్షణ కల్పించి పెద్దవి చేస్తున్నారు. మన వాతావరణానికి అలవాటు పడిన తరువాత స్మగ్లర్లు అధిక ధరకు విక్రయిస్తున్నారు. అలాగే అడవి అలుగు(ఇండియన్ పాంగోలిన్)కు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతరించిపోతున్న అరుదైన జీవుల్లో అలుగు కూడా ఒకటి. మన దేశంలో అక్కడక్కడా లభించే అలుగులను జపాన్, సింగపూర్, చైనా వంటి దేశాలకు స్మగ్లర్లు తరలిస్తున్నారు. దీని లేహ్యం, మాంసంలో అరుదైన లక్షణాలు ఉండడంతో వాటిని వండుకొని తినేందుకు విదేశీయులు ఇష్టపడతారనే ప్రచారం ఉంది. అలుగు పెంకులను మందుల తయారీలో వినియోగిస్తారని సమాచారం. దీంతో వేటగాళ్లు వాటిని వేటాడుతుండడంతో కనుమరుగవుతున్నాయి.
చట్టాలను పట్టించుకోని స్మగ్లర్లు..
దేశంలో జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం-1960, వన్యప్రాణుల రక్షణ చట్టం-1972 అమలులో ఉన్నాయి. వీటి ప్రకారం జంతువులు, వన్యప్రాణులను చంపడం, పట్టుకొని వ్యాపారం చేయడం క్రూరత్వం కింద వస్తుంది. వాటిని కొట్టడం, రవాణా చేయడం, పంజరాల్లో ఉంచడం, గొలుసులతో కట్టడం, నిర్బంధంలో పెట్టడం, వినోదం కోసం ఉపయోగించడం నేరం. ధిక్కారానికి పాల్పడితే కనీసం మూడేళ్ల జైలు శిక్ష, లేదా రూ.25వేల జరీమానా విధిస్తారు. లేదా రెండింటినీ కలిపి వేయవచ్చు. చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్, రాష్ట్ర ప్రభుత్వ అధికారి అనుమతులతోనే వాటిని రవాణా చేయాలి. సెక్షన్ 49ప్రకారం లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల కొనుగోలు చేయడం నేరం. కానీ, ఈ చట్టాలను స్మగ్లర్లు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా రవాణా చేస్తూ అక్రమార్జన చేస్తున్నారు. కఠినమైన చట్టాలను అమలు చేస్తేనే తప్ప ఈ అక్రమ రవాణాను అరికట్టలేమని అటవీశాఖ అధికారులే చెబుతున్నారు. కాగా, జిల్లాలో పట్టుబడుతున్న అడవి జంతువులకు స్థానిక అటవీశాఖ అధికారులు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తున్నారు. ఇటీవల మెళియాపుట్టి, కవిటి మండలాల్లో పట్టుబడిన కింగ్‌కోబ్రా, పలాసలో పట్టుబడిన రక్తపింజరి, కొండచిలువలను సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
నిరంతర నిఘాతోనే అడ్డుకట్ట
కఠిన చట్టాలు అమలు చేయడం, నిరంతర నిఘా పెట్టడం ద్వారా కలప, వన్యప్రాణుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇచ్ఛాపురం, పలాస ప్రాంతాల్లో ఇటీవల పట్టుబడిన విదేశీ జంతువులను ప్రత్యేక భద్రత మద్య విశాఖలోని జంతు ప్రదర్శనశాలకు తరలించాం. స్మగ్లర్లపై కేసులు నమోదు చేశాం. స్థానికంగా పట్టుబడిన కొన్ని జంతువులు, సర్పాలను అడవుల్లో విడిచిపెట్టాం.
- మురళీకృష్ణ, అటవీశాఖ అధికారి, కాశీబుగ్గ