Share News

‘దంతపురి’పై నిర్లక్ష్యం

ABN , Publish Date - Mar 24 , 2024 | 11:49 PM

జిల్లాలోని ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న దంతపురి క్షేత్రాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఈ క్షేత్రం అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో విలువైన పురావస్తు సంపదకు రక్షణ కరువైంది. ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్‌) రైల్వేస్టేషన్‌ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో దంతపురి క్షేత్రం ఉంది.

‘దంతపురి’పై నిర్లక్ష్యం
శిథిలావస్థలో ఉన్న బుద్ధుని విగ్రహం, పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు

- చారిత్రక సంపదకు రక్షణ కరువు

- కానరాని టూరిస్ట్‌ గైడ్లు

- పట్టించుకోని అధికారులు

(సరుబుజ్జిలి)

జిల్లాలోని ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న దంతపురి క్షేత్రాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఈ క్షేత్రం అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో విలువైన పురావస్తు సంపదకు రక్షణ కరువైంది. ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్‌) రైల్వేస్టేషన్‌ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో దంతపురి క్షేత్రం ఉంది. రొట్టవలస, కొండవలస, పెద్దపాలెం, పాలవలస, రావివలస గ్రామాల మధ్య 175 ఎకరాల్లో విస్తరించి ఉంది. క్రీస్తుపూర్వం 261లో అశోక్‌ చక్రవర్తి చేసిన కళింగయుద్ధం తర్వాత ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. దంతపురి వంశానికి రాజైన కళింగ ఖారవేలుని కాలంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. కళింగ రాజుల రాజధానిగా దంతపురికి విశిష్ట స్థానం ఉంది. రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు 30 సంవత్సరాల కిందట చేపట్టిన తవ్వకాల్లో దంతపురి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడి కోటలో 30 అడుగుల ఎత్తయిన ప్రాకారాలు, కోటకు నలుదిక్కులా ద్వారాలు ఉండేవని తెలిసింది. ఈ తవ్వకాల్లో మూడు స్థూపాలు, గుర్తించలేని పాతతరం విగ్రహాలు, స్నానపు గదులు, నీటి నిల్వజార్లు, ప్లవర్‌వైజ్‌లు, వంటపాత్రలు, దీపాలు, భోజనపు గిన్నెలు, రుబ్బురోళ్లు, ఎముకతో చేసిన దువ్వెనలు, టెర్రకోట వస్తువులు బయటపడ్డాయి.

కనిపించని టూరిస్టు గైడ్లు

దంతపురి సంపద రక్షణ కోసం ప్రభుత్వం ఇద్దరు టూరిస్ట్‌ గైడ్‌లను ఏర్పాటు చేసి ప్రతి నెలా వారికి జీతాలు చెల్లిస్తున్నట్టు సమాచారం. అయితే వారు ఏ రోజూ దంతపురి క్షేత్రంలో కనిపించిన దాఖలాలు లేవు. దీంతో ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. బుద్ధుని వి గ్రహానికి రక్షణ లేకపోవడంతో శిథిలమవుతోంది. విలువైన కోట గట్టును కొంతమంది తవ్వకాలు చేపట్టి ఆక్రమిస్తున్నారు. ఇక్కడ ఏటా బుద్ధ పౌర్ణమి రోజున ఉత్సవాలు నిర్వహించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో ఈ క్షేత్రంలో చేపట్టిన తవ్వకాల్లో విలువైన బంగారు నాణేలు, తీగలు, వస్తువులు బయటపడగా వాటిని కొంతమంది చేజిక్కించుకొని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించిన విషయం తెలిసిందే. ఆరేళ్ల కిందట గుప్త నిధుల కోసం తవ్వకాలు కూడా చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దంతపురి క్షేత్రాన్ని పరిరక్షించాలని పర్యాటకులు కోరుతున్నారు.

Updated Date - Mar 24 , 2024 | 11:50 PM