Share News

ఎంపీ స్థానం.. టీడీపీకి పదిలం

ABN , Publish Date - May 31 , 2024 | 11:56 PM

ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల గెలుపోటములపై ఇప్పటికే సర్వేలు చేపట్టి.. లెక్కలు వేసుకుని.. అంచనాకు వచ్చాయి. ఈ క్రమంలో జిల్లాలో ఎంపీ స్థానం.. టీడీపీకి పదిలమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంపీగా రామ్మోహన్‌నాయుడు హ్యాట్రిక్‌ విజయం ఖాయమని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఎంపీ స్థానం.. టీడీపీకి పదిలం

- ముందే ఆశలు వదిలేసుకున్న వైసీపీ

- అభ్యర్థి ఎంపిక నుంచి పోలింగ్‌ వరకూ తప్పిదాలే

- రామ్మోహన్‌నాయుడు హ్యాట్రిక్‌ విజయంపై కూటమి నేతల ధీమా

- బంపర్‌ మెజార్టీ వస్తుందని అంచనా

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల గెలుపోటములపై ఇప్పటికే సర్వేలు చేపట్టి.. లెక్కలు వేసుకుని.. అంచనాకు వచ్చాయి. ఈ క్రమంలో జిల్లాలో ఎంపీ స్థానం.. టీడీపీకి పదిలమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంపీగా రామ్మోహన్‌నాయుడు హ్యాట్రిక్‌ విజయం ఖాయమని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా.. శ్రీకాకుళం ఎంపీ స్థానంపై ముందుగానే వైసీపీ ఆశలు వదులుకుంది. సర్వేలు కూడా కూటమి అభ్యర్థికి అనుకూలంగా ఉండడంతో.. వైసీపీ నాయకులు కనీసస్థాయిలో ఎంపీ సీటుపై లెక్కలు వేసుకోకపోవడం గమనార్హం.

................

సార్వత్రిక ఎన్నికల్లో త్రిముఖ పోరులో శ్రీకాకుళం ఎంపీ స్థానం.. టీడీపీకి పదిలమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్‌నాయుడు, వైసీపీ అభ్యర్థిగా పేరాడ తిలక్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పేడాడ పరమేశ్వరరావు ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో రామ్మోహన్‌నాయుడుకి మూడోసారి విజయం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కుమారుడిగా రామ్మోహన్‌ నాయుడు రాజకీయ ప్రవేశం చేసి.. 2014లో టీడీపీ తరపున శ్రీకాకుళం పార్లమెంట్‌ అభ్యర్థిగా 1,27,692 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యలపై ప్రస్తావిస్తూ.. జిల్లా వాణిని వినిపించడంలోనూ సత్తాచాటారు. ఇతర దేశాల్లో రాష్ట్ర ప్రజలు చిక్కుకుంటే వారిని స్వగ్రామాలకు తీసుకురావడంలో ప్రత్యేక చొరవ చూపేవారు. దీంతో ఎంపీగా రామ్మోహన్‌నాయుడుకి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇటువంటి వ్యక్తిని రాజకీయాలతో సంబంధం లేకుండా పార్లమెంట్‌కు పంపితేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్న భావన జిల్లావాసుల్లో నెలకొంది. అందుకే 2019లో జగన్‌ ఒక్కచాన్స్‌ హవాలోనూ.. టీడీపీ ఎంపీగా రామ్మోహన్‌నాయుడును రెండోసారి గెలిపించారు. గత ఎన్నికల్లో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలవగా.. క్రాస్‌ ఓటింగ్‌ ద్వారా ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాత్రం 6,653ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి కూడా హ్యాట్రిక్‌ గెలుపు ఖాయమని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- వైసీపీకి సన్నగిల్లిన ఆశలు

వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఈసారి పేరాడ తిలక్‌ బరిలో నిలిచారు. అభ్యర్థి ఎంపికలోనే వైసీపీ అదిష్ఠానం సరైన నిర్ణయం తీసుకోలేదని.. కొన్నాళ్లు చర్చ సాగింది. పార్టీలో ఎన్నికల ముందు వరకు ఉన్న కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణికి ఎంపీ టిక్కెట్‌ ఇచ్చి ఉంటే పోటీ తీవ్రత ఉండేదని.. ఇప్పుడు వార్‌ వన్‌సైడ్‌గా పరిస్థితి మారిపోయిందని వైసీపీ నాయకులు.. కార్యకర్తలు సైతం వాపోతున్నారు. వైసీపీ అభిమాని... నామినేటెడ్‌ పోస్టులో ఉన్న ఆ పార్టీకి చెందిన కీలకనాయకుడొకరు ఇదే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వద్ద వెల్లడించారు. ఎంపీ స్థానంపై ఆశలు వదిలేసుకున్నామని.. ఆ సీటు టీడీపీదేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా... వైసీపీ నాయకులు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో సరిగ్గా పోల్‌మేనేజ్‌మెంట్‌ చేసుకోలేకపోయారన్నది నిజం. వైసీపీ అధిష్ఠానం.. ఎమ్పీ నియోజకవర్గంపై చూపిన శ్రద్ధ.. జిల్లాలోని ఆ పార్టీ నాయకులు అంతగా చూపించలేకపోయారు. నగదు పంపిణీ వ్యవహారంలో సొంత లాభం చూసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇక అసెంబ్లీ అభ్యర్థులే అటు ఎంపీ అభ్యర్థి ఓటుకు.. ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి ఓటు పోలయ్యేలా పోల్‌మేనేజ్‌మెంట్‌ అప్పగించేశారు. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థి కన్నా.. తమ గెలుపే ముఖ్యమన్న రీతిలో ఎమ్మెల్యే అభ్యర్థులు వ్యవహరించారని సమాచారం. ఇలా ఎంపీ అభ్యర్థి ఎంపిక నుంచి పోలింగ్‌ వరకు తప్పిదాలే ఉన్నాయని.. అందువల్ల ఆ స్థానం ఓడిపోతున్నామంటూ బహిరంగంగానే వైసీపీ నాయకులు వెల్లడిస్తున్నారు.

- ఓట్ల చీలికతో మరింత నష్టం

2019 ఎన్నికల్లో జగన్‌ హవాలో కూడా ఓట్ల చీలికతో వైసీపీ అభ్యర్థికే భారీ నష్టం చేకూరింది. జనసేన, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులతోపాటుగా ఇండిపెండెంట్‌ అభ్యర్థులు సైతం ఓట్లను చీల్చేశారు. దీంతో అప్పటి వైసీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ 6,653 ఓట్లతో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు అంతకంటే మరింత ఇబ్బందికర పరిస్థితి వైసీపీకి ఏర్పడింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా టెక్కలి నియోజకవర్గానికి చెందిన పేడాడ పరమేశ్వరరావు పోటీలో నిలిచారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా టెక్కలి నుంచి కిల్లి కృపారాణి కాంగ్రెస్‌ నుంచే బరిలో దిగారు. ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల టెక్కలి నియోజకవర్గంలో పర్యటించగా.. వైసీపీ అభిమానులే అధికమంది హాజరయ్యారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఓటమికి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి పరమేశ్వరరావు, అటు టెక్కలి అసెంబ్లీ అభ్యర్థి కృపారాణి గట్టిదెబ్బ కొట్టనున్నారు. కాంగ్రెస్‌ కారణంగా ఓట్ల చీలికతో వైసీపీకి నష్టం పెరగడం ఖాయమని.. అలాగే బీజేపీ, జనసేన పోటీలో లేకపోవడంతో టీడీపీ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడికి 2014 కంటే బంపర్‌ మెజార్టీ లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అన్ని సర్వేల్లో ఇదే విషయం వెల్లడవుతోంది. త్రిముఖ పోటీలో టీడీపీకి లాభం చేకూరుతుండగా.. వైసీపీ తీవ్రనష్టం చవిచూడనుంది.

2019లో పార్లమెంట్‌ స్థానానికి పోలైన ఓట్లు..

--------------------------------------------------------------

అభ్యర్థి పేరు పార్టీ పోలైన ఓట్లు (శాతం)

---------------------------------------------------------------------------

కింజరాపు రామ్మోహన్‌నాయుడు టీడీపీ 5,34,544 (45.91ు)

దువ్వాడ శ్రీనివాస్‌ వైసీపీ 5,27,891 (45.34ు)

మెట్ట రామారావు జనసేన 31,956 (2.74ు)

నోటా నోటా 25,545 (2.19ు)

డోల జగన్‌ కాంగ్రెస్‌ 13,745 (1.18ు)

పేర్ల సాంబమూర్తి బీజేపీ 8,390 (0.72ు)

ఎన్‌.రాజశేఖర్‌ స్వతంత్ర 5,156 (0.44ు)

ఎన్‌.కృష్ణమోహన్‌ స్వతంత్ర 4,836 (0.42ు)

బి.వివేకానంద మహరాజ్‌ స్వతంత్ర 3,818 (0.33ు)

ఎం.సతీష్‌ చక్రవర్తి పిరమిడ్‌ 1,448 (0.12ు)

---------------------------------------------------------------------------

మొత్తం 11,57,329 (74.48ు)

Updated Date - May 31 , 2024 | 11:56 PM