Share News

డబ్బు.. డబ్బు.. డబ్బు

ABN , Publish Date - May 12 , 2024 | 12:19 AM

సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నిబంధనల మేరకు శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి అన్నిపార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. అధికారపార్టీ నేతలు ప్రలోభాలకు సిద్ధమయ్యారు.

డబ్బు.. డబ్బు.. డబ్బు

- ప్రలోభాలు ముమ్మరం చేసిన అధికారపార్టీ

- భారీగా మద్యం చేరవేతకు పావులు

- ఓటర్లకు గాలం వేస్తున్న వైసీపీ నేతలు

- ముగిసిన ఎన్నికల ప్రచార సందడి

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నిబంధనల మేరకు శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి అన్నిపార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. అధికారపార్టీ నేతలు ప్రలోభాలకు సిద్ధమయ్యారు. జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంట్‌తో పాటు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆఖరిరోజున శనివారం ఉదయం నుంచీ సాయంత్రం వరకు టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ నేతలు ముమ్మర ప్రచారం చేశారు. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండడంతో.. ఓటర్లను మరింత ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఓటర్లకు డబ్బులు, మద్యం పంపకాలు చేపడుతున్నారు. ఇప్పటికే వలస ఓటర్లను స్వగ్రామాలకు రప్పించేలా ఏర్పాట్లు పూర్తిచేశారు. డబ్బు, మద్యం పంపిణీలో వైసీపీ నేతలు ముందంజలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో సంక్షేమ పథకాలు తప్ప.. ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టలేదు. రోడ్లు బాగుచేయలేదు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టలేదు. ఇచ్చిన వాగ్దానాలు సక్రమంగా నెరవేర్చలేదు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌తోపాటు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. విద్యుత్‌ చార్జీలు ఏడుసార్లు, ఆర్టీసీ బస్సుచార్జీలు మూడుసార్లు పెంచారు. ఇలా అన్నింటా భారం మోపడంతో అన్నివర్గాల ప్రజలు వైసీపీ పాలనపై అసంతృప్తితో ఉన్నారు. కాగా.. అసంతృప్త ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేసేందుకు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి..

- పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో డబ్బును మంచినీళ్ల మాదిరి ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ వైసీపీలోనే కొంతమంది అసంతృప్తి వాదులు ఉన్నారు. వారికి తాయిలాలు అందించి.. అసంతృప్తి చల్లార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి.

- ఇచ్ఛాపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇచ్ఛాపురంలో ఇంతవవరకూ వైసీపీ గెలిచిన దాఖలాలు లేవు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి పిరియా విజయ గెలుపు కోసం పార్టీ అధినేత ప్రత్యేక దృష్టి సారించారు. రూ.20కోట్ల మేర పార్టీ ఫండ్‌ ఇచ్చి.. ఓటర్లకు పంపిణీ చేయాలని ఆదేశించినట్టు సమాచారం. కాగా.. ఈ డబ్బును సరిగా పంపిణీ చేయడం లేదని వైసీపీ ద్వితీయశ్రేణి నాయకులు ఆరోపిస్తున్నారు.

- పలాసలో కోవర్టుల ద్వారా టీడీపీ అభ్యర్థిపై దుష్ప్రచారం చేసేందుకు వైసీపీ నాయకులు యత్నించారు. కానీ విఫలమయ్యారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు.. ముందస్తుగా డబ్బులు పంపిణీ చేశారు. ప్రత్యర్థులపై మరింత నిఘా పెట్టారు. సొంతపార్టీలోనే అప్పలరాజుకు అసమ్మతి పెరగడంతో.. డబ్బులు పంపిణీ చేసినా.. ఫలితముండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- టెక్కలిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని ఓడించాలంటే డబ్బుతోనే ఓట్లను కొనుగోలు చేయాలని వైసీపీ యోచించింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీను పోటీ చేస్తుండడంతో అచ్చెన్న గెలుపు మరింత సునాయసమని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఎలాగైనా అచ్చెన్నను ఓడించేందు వైసీపీ.. ఇప్పటికే రూ.25 కోట్లు పార్టీ ద్వారా, మరో రూ.20కోట్లు పోర్టు కాంట్రాక్టర్‌ ద్వారా సమకూర్చినట్టు సమాచారం. కానీ రోజురోజుకి వైసీపీని వీడి నాయకులు టీడీపీలో చేరిపోతున్నారు. డబ్బులు పంపిణీ చేసేందుకు కూడా అనుచరులు లేరనే సమాచారం.

- ఆమదాలవలసలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం గెలుపుకోసం పార్టీ అధిష్ఠానం రూ.20 కోట్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ వైసీపీకి చెందిన నాయకుడొకరు ఇండిపెండెంట్‌గా పోటీలో నిల్చుని వైసీపీ ఓట్లకు గాలం వేస్తున్నారు. డబ్బుల పంపిణీలో వెనుకంజలో ఉన్నట్లు తెలిసింది.

- శ్రీకాకుళంలో వార్‌ వన్‌సైడ్‌ మాదిరిగా టీడీపీకి అవకాశం లభించింది. 2019 ఎన్నికల్లో అతితక్కువ ఓట్లతో వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గట్టెక్కారు. ప్రస్తుతం మళ్లీ ఆయనే బరిలో దిగగా.. అధిష్ఠానం నుంచి ఏవిధమైన ఆర్థిక సహకారం అందించలేదని విశ్వసనీయసమాచారం. టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌కు అంతటా జన నీరాజనం పడుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కూడా పెరిగాయి. దీంతో ధర్మాన ఆచితూచి డబ్బులు ఖర్చుచేయాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నారు.

- నరసన్నపేటలో వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌.. సొంతపార్టీ నేతల నుంచే అంతర్గత యుద్ధం ఎదుర్కొంటున్నారు. పార్టీ అధిష్ఠానం నుంచి రూ.కోట్లు చేరినా.. పంపిణీ విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది.

- ఎచ్చెర్లలో పరిస్థితి ఇతర నియోజకవర్గాల కంటే భిన్నంగా ఉంది. ఇక్కడ కూటమి తరపున బీజేపీ అభ్యర్థి ఎన్‌ఈఆర్‌ పోటీ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్‌.. కులం కార్డు వాడుతూ.. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ తనను మరోసారి గెలిపించాలని కోరుతున్నారు. ఈ ఐదేళ్లలో ఎటువంటి ప్రయోజనం చేకూర్చకపోవడంతో ఆయా సామాజికవర్గాల ఓటర్లు బీజేపీ అభ్యర్థికే మద్దతు తెలుపుతున్నట్టు తెగేసి చెబుతున్నారు.

Updated Date - May 12 , 2024 | 12:19 AM