వంశధార కాలువల ఆధునికీకరణ తప్పనిసరి
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:20 PM
‘ఆయకట్టుకు నీరు అందించాలంటే వంశధార కుడి, ఎడమ కాలువలను తప్పనిసరిగా ఆధునికీకరణ చేయాలి. ఇందుకోసం ప్రభుత్వానికి రూ.900కోట్లతో ప్రతిపాదనలు పంపించామ’ని ఎస్‌ఈ డోల తిరుమలరావు పేర్కొన్నారు.

- ఎస్‌ఈ డోల తిరుమలరావు
హిరమండలం, జూన్ 7: ‘ఆయకట్టుకు నీరు అందించాలంటే వంశధార కుడి, ఎడమ కాలువలను తప్పనిసరిగా ఆధునికీకరణ చేయాలి. ఇందుకోసం ప్రభుత్వానికి రూ.900కోట్లతో ప్రతిపాదనలు పంపించామ’ని ఎస్‌ఈ డోల తిరుమలరావు పేర్కొన్నారు. శుక్రవారం హిరమండలంలోని గొట్టాబ్యారేజీతోపాటు దానికి అనుసంధానంగా ఉన్న కుడి,ఎడమ కాలువల గేట్లను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం కాలువల ఆధునీకరణపై దృష్టి సారిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎడమ కాల్వ ద్వారా 1.48లక్షల ఎకరాలు, కుడి కాలువ ద్వారా 80వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కాలువల నిర్వహణకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రధానంగా ఎడమ కాలువ శిథిలావస్థకు చేరుకుంది. 15 ఏళ్లుగా షట్టర్ల మరమ్మతులు చేపట్టలేదు. ఎక్కడికక్కడ కాలువ గట్లు దెబ్బతిన్నాయి. పూడికలు తొలగించకపోవడంతో నీటిప్రవాహ సామర్థ్యం తగ్గింది. ఈసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వం రావడంతో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది’ అని తిరుమలరావు తెలిపారు. ఈ ఏడాది శివారు భూములకూ సాగునీరందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వర్షాకాలంలో వరద నీటి ప్రభావానికి ఇబ్బందులు లేకుండా బ్యారేజి వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఈఈ ప్రదీప్‌కుమార్, డీఈఈలు హరిప్రసాద్, సురేష్‌బాబు, ధనుంజయ, సత్యనారాయణ పాల్గొన్నారు.