Share News

మంత్రి అప్పలరాజు కొండలు మింగారు

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:51 AM

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకొని స్థానిక మంత్రి సీదిరి అప్పలరాజు కొండలు, కాలువలు మింగారని.. రానున్న ఎన్నికల్లో వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

 మంత్రి అప్పలరాజు కొండలు మింగారు
టీడీపీ చేరిన మహిళలతో ఎంపీ రామ్మోహన్‌, శిరీష

- వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పండి

- ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు

- టీడీపీలో 250 కుటుంబాలు చేరిక

పలాస, డిసెంబరు 31: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకొని స్థానిక మంత్రి సీదిరి అప్పలరాజు కొండలు, కాలువలు మింగారని.. రానున్న ఎన్నికల్లో వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శనివారం రాత్రి పలాస 31వ వార్డులో వైసీపీ నుంచి 150 కుటుంబాలు, మండలంలోని లొత్తూరు పంచాయతీ నుంచి 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారందరికీ ఎంపీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. సొంత చెల్లిని సాగనంపిన ముఖ్యమంత్రి ఆడబిడ్డలను ఆదుకుంటామని వాగ్దానాలు చేస్తున్నారని, ప్రజలు ఆయన మాటలు నమ్మే స్థితిలో లేరని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఆయన్ను నమ్మి ప్రజలు ఒక్కచాన్స్‌ ఇస్తే వారికి బోడిగుండు చేశారని, చివరకు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. దొంగలు రాష్ట్రాన్ని ఏలితే ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, రూ.80 ఉన్న మద్యం క్వార్టర్‌ బాటిల్‌ రూ.300 వరకూ పెంచారని, మత్తుకోసం మందు తాగితే ప్రజలు మెంటలైపోతున్నారని ఉదహరించారు. చంద్రబాబు హయాంలో ప్రజలకు అన్నీ పండగలకు కానుకలు ఇచ్చేవారని, ప్రస్తుతం కానుకలు ఎత్తేసి నిత్యావసరాల ధరలు అమాంతంగా పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం సీఎం ఎస్సీ, ఎస్టీలను ఓట్లు కోసమే వినియోగించుకుంటున్నారని, సబ్‌ప్లాన్‌ నిధులన్నీ పక్కదారి పట్టించారని విమర్శించారు. రాష్ట్రంలో అంగన్‌వాడీలు, మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కితే నిమ్మకునీరెత్తినట్లు సీఎం వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఒక్కసీటు ఇవ్వకుండా అడ్డుకోవాలని ఆయన కోరారు. పలాసలో గౌతు శిరీషకు ప్రజలు ఆశ్వీరదించాలని, మహిళగా అనేక కార్యక్రమాలు ఆమె చేయగలరని, భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లా డుతూ.. మంత్రి అప్పలరాజు ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. తమ కార్యక్రమాలకు రాకుండా అడ్డుకున్నా వేలాదిగా తరలిరావడంతో ఆయనకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఆయనకు ప్రజలు మరో రెండు నెలల్లో గుడ్‌బై చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు మాట్లాడుతూ.. ప్రజలకు భయపెడితే చూస్తు ఊరుకోమని స్పష్టం చేశారు. టీడీపీ కార్యక్రమాలకు హాజరైతే సంక్షేమ పథకాలు కట్‌ చేస్తామని వైసీపీ నాయకులు బెదిరించడాన్ని తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీరుకట్ల విఠల్‌రావు, లొడగల కామేశ్వరరావుయాదవ్‌, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, మల్లా శ్రీనివాస్‌, కొరికాన శంకర్‌, గోపి, గురిటి సూర్యనారాయణ, రామకృష్ణ, సత్యం, చంద్రరావ, అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 12:51 AM