పల్లెల్లో పాల వెల్లువ
ABN , Publish Date - Sep 23 , 2024 | 12:07 AM
గత వైసీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్ల పాటు ఎలాంటి ప్రోత్సాహకాలు అందించలేదు. పైగా పాల ధరలు తక్కువగా ఉండేవి. దీంతో పాడి పెంపకానికి రైతులు ఆసక్తి చూపించేవారు కాదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపడుతోంది.
- పాడి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం
- పశువుల పెంపకానికి రైతుల ఆసక్తి
- జిల్లాలో పెరిగిన పాల ఉత్పత్తి
- గతం కంటే రెండు లక్షల లీటర్లు అధికం
(మెళియాపుట్టి)
- మెళియాపుట్టి మండలం జంతూరు గ్రామానికి చెందిన నెయ్యల సింహాచలం అనే రైతుకు రెండు ఆవులు ఉన్నాయి. ఈ ఆవులు ప్రతిరోజూ రెండు పూటలా 10 లీటర్ల చొప్పున పాలు ఇస్తున్నాయి. గతంలో ఈ పాలను డెయిరీకి ఇవ్వగా లీటర్ ధర రూ.30 పలికేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ధర పెరిగింది. ప్రస్తుతం సింహాచలం లీటర్ పాలను వెన్నశాతం బట్టి రూ.40 నుంచి రూ.45 వరకు విక్రయిస్తున్నాడు. ప్రతిరోజూ రూ.800 వరకు ఆదాయం వస్తుంది. దీంతో పొలం పనులతో పాటు పాడిపెంపకం ద్వారా మంచి లాభాలు వస్తున్నాయని చెబుతున్నాడు.
............................
- మెళియాపుట్టి మండలం జంతూరు గ్రామానికి చెందిన బందపల్లి గవిరేష్‌కు గతంలో మూడు ఆవులు ఉండేవి. గత వైసీపీ ప్రభుత్వం పాడి అభివృద్ధికి ఎటువంటి నిధులు ఇవ్వలేదు. పైగా పాల ధరలు తక్కువగా ఉండేవి. దీంతో గవిరేష్ తన మూడు ఆవులను అమ్మేశాడు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మినీ గోకులాల నిర్మాణానికి నిధులు ఇవ్వడంతో పాటు పాలు రేట్లు బాగున్నాయి. దీంతో ఆవుల పెంపకానికి గవిరేష్ ఆసక్తి చూపిస్తున్నాడు.
............................
గత వైసీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్ల పాటు ఎలాంటి ప్రోత్సాహకాలు అందించలేదు. పైగా పాల ధరలు తక్కువగా ఉండేవి. దీంతో పాడి పెంపకానికి రైతులు ఆసక్తి చూపించేవారు కాదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. మినీ గోకులాల నిర్మాణానికి, పశుగ్రాసం పెంపకానికి నిధులు మంజూరు చేస్తోంది. పాల ధరలు కూడా పెరగడంతో జిల్లాలోని రైతులు పాడి పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో 60 శాతం రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 798 పశుకేంద్రాల పరిధిలో ఆవులు 4,56,291, గేదెలు 40,477, గొర్రెలు 6,23,641, మేకలు 2,77,268 ఉన్నట్లు గణంకాలు చెబుతున్నాయి. గతంలో ప్రతిరోజూ సుమారు 8 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరిగేది. అయితే, గత మూడు నెలల నుంచి 10 లక్షల లీటర్ల ఉత్పత్తి జరుగుతున్నట్లు పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు.
పాడి పరిశ్రమకు పూర్వవైభవం..
పాడిరైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వం 2018లో మినీ గోకులాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. షెడ్ల నిర్మాణానికి పాడిరైతులకు రాయితీపై నిధులు మంజూరు చేసింది. దీంతో జిల్లాలో చాలామంది రైతులు గోకులాల షెడ్లను నిర్మించుకున్నారు. అయితే, 2019లో అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం మినీ గోకులాల పథకాన్ని నీరు గార్చింది. ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. అంతేకాకుండా అప్పటికే షెడ్ల నిర్మించుకున్న రైతులకు బిల్లులు కూడా ఇవ్వలేదు. గత మూడున్నరేళ్ల పాటు జిల్లాకు చెందిన సీదిరి అప్పలరాజు పశుసంవర్థక శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ పాడిపరిశ్రమ అభివృద్ధికి రూపాయి కూడా కేటాయించలేదు. పైగా రైతులు అమూల్ కంపెనీకి మాత్రమే పాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. మృతి చెందిన పశువులకు సంబంధించి రైతులకు బీమా కూడా అందించేవారు కాదు. దీంతో చాలామంది రైతులు తమ పాడిసంపదను అమ్మేశారు. ఫలితంగా జిల్లాలో పాల దిగుబడి పడిపోయింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాడి పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. దీనిలో భాగంగా మినీ గోకులాల పథకాన్ని పునరుద్ధరించేందుకు పచ్చ జెండా ఊపింది. పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలతో జిల్లాలో అధికంగా 1,050 మినీ గోకులాల నిర్మాణానికి, పశుగ్రాసం పెంపకానికి నిధులు మంజూరు చేసేందుకు అధికారులు చర్యలు చేపడు తున్నారు. పశు పోషకులకు 90 శాతం, కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకందారులకు 70 శాతం రాయితీపై షెడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఉపాధి హామీ పథకం నుంచి నిధుల కేటాయింపు జరుగుతుండడంతో బిల్లుల మంజూరుకు ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో షెడ్ల నిర్మాణానికి రైతులు ముందుకు వస్తున్నారు. అలాగే, దాణా, గ్రాసం కొనుగోలు కోసం పాల సేకరణ ఏజెన్సీలు రైతులకు ఏటీఎం కార్డులు ఇస్తున్నాయి. దీంతో గతంలో పోషణ భారమై అమ్మేసిన ఆవులు, గేదెలను మళ్లీ కొనుగోలు చేసి పెంచుతున్నారు. ఫలితంగా జిల్లాలో పాల ఉత్పత్తి గతం కంటే రెండు లక్షల లీటర్లు పెరిగింది. మొత్తం 10 లక్షల లీటర్ల ఉత్పత్తికి గాను జిల్లా అవసరాలకు సుమారు 6.75లక్షల లీటర్లు పోను మిగిలిన 3.25 లక్షల లీటర్ల పాలను ఇతర జిల్లాలకు ఎగుమతి చేసుకునే స్థాయి పాడిపరిశ్రమ ఎదిగింది.
పాల ఉత్పత్తి పెరుగుతుంది
గతంలో మా కేంద్రం నుంచి ప్రతిరోజూ 100 లీటర్ల పాలు డైయిరీకి పంపితే ప్రస్తుతం 150 లీటర్లు పంపుతున్నాం. రైతులు పాడి పెంపకానికి ఆసక్తి చూపిస్తుండడంతో పాల ఉత్పత్తి పెరుగుతుంది.
-నందో, పాలసేకరణ యజమాని, బందపల్లి, మెళియాపుట్టి