Share News

గొళ్లెం విరగ్గొట్టి..

ABN , Publish Date - May 24 , 2024 | 11:43 PM

స్థానిక రోటరీనగర్‌(ప్రభుత్వ ఐటిఐ రోడ్డు)లో చాప అలివేణి ఇంట్లో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఉన్న తలుపులను విరగ్గొట్టి.. రూ.34లక్షల విలువైన 40తులాల బంగారు ఆభరణాలు, రూ.18వేల నగదును దొంగలు తస్కరించారు.

గొళ్లెం విరగ్గొట్టి..
పరిశీలిస్తున్న క్లూస్‌ టీం

- రోటరీనగర్‌లో భారీ చోరీ

- 40తులాల బంగారం ఆభరణాలు, రూ.18వేలు నగదు అపహరణ

పలాస, మే 24: స్థానిక రోటరీనగర్‌(ప్రభుత్వ ఐటిఐ రోడ్డు)లో చాప అలివేణి ఇంట్లో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఉన్న తలుపులను విరగ్గొట్టి.. రూ.34లక్షల విలువైన 40తులాల బంగారు ఆభరణాలు, రూ.18వేల నగదును దొంగలు తస్కరించారు. దీనిపై ఆమె శుక్రవారం కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అలివేణి పలాస మండల ఎఆర్‌ఈజీ సంస్థలో టెక్నికల్‌ అధికారిగా పనిచేస్తున్నారు. ఈమె భర్త శ్రీనివాసరావు సీఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐగా హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అలివేణి ఒక్కరే స్థానికంగా నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం ఆమె ఇంటికి తాళాలు వేసి వేరే గ్రామానికి వెళ్లారు. అర్ధరాత్రి దాటాక దొంగలు ఆ ఇంటి తాళం పగలుగొట్టారు. ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని బంగారం ఆభరణాలు, నగదు దొంగిలించారు. శుక్రవారం ఉదయం అలివేణి.. తన ఇంటికి చేరుకుని చూడగా తాళాలు విరగ్గొట్టి ఉండడంతో ఆందోళన చెందారు. ఇంటిని పరిశీలించగా బీరువాలో దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.18వేల నగదు మాయమైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి ఎస్‌ఐ పారినాయుడు క్లూస్‌ టీముతో చేరుకొని వివరాలు సేకరించారు. ఆ ఇంటికి వంద అడుగుల దూరంలో ఉన్న ఓ సీసీ పుటేజీలో నిర్లిప్తమైన సమాచారాన్ని కూడా పరిశీలించారు. ఎదురుగా మరో ఇంటికి వేసి ఉన్న తాళాలు కూడా పగులకొట్టేందుకు దొంగలు యత్నించారు. చుట్టుపక్కల అలికిడి కావడంతో దొంగలు ఉడాయించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పారినాయుడు తెలిపారు.

Updated Date - May 24 , 2024 | 11:43 PM