Share News

కలెక్టర్‌గా మంజీర్‌ జిలానీ సమాన్‌

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:35 PM

జిల్లాకు కొత్త కలెక్టర్‌ వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సీజన్‌ సమీపిస్తున్న వేళ.. బదిలీల సందడి మొదలైంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 21మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కలెక్టర్‌గా మంజీర్‌ జిలానీ సమాన్‌
కలెక్టర్‌ మంజీర్‌ జిలానీ సమాన్‌, శ్రీకాకుళం కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా

- జిల్లాలో బదిలీల సందడి

- మునిసిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ విభాగానికి.. శ్రీకేష్‌ బి.లఠ్కర్‌

- శ్రీకాకుళం కార్పొరేషన్‌ కమిషనర్‌గా తమీమ్‌ అన్సారియా

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

జిల్లాకు కొత్త కలెక్టర్‌ వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సీజన్‌ సమీపిస్తున్న వేళ.. బదిలీల సందడి మొదలైంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 21మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాకు కొత్త కలెక్టర్‌గా మంజీర్‌ జిలానీ సమాన్‌ను నియమించింది. ప్రస్తుత కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ను మునిసిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ విభాగానికి డైరెక్టర్‌గా బదిలీ చేసింది. మంజీర్‌ జిలానీ సమాన్‌.. 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం నంద్యాల జిల్లా కలెక్టర్‌గా వ్యవహరిస్తూ బదిలీపై ఇక్కడ రానున్నారు. ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.

- శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు బదిలీ అయ్యారు. ఈయనను ఎక్కడకు బదిలీ చేశారన్నదీ ప్రస్తుతం వెల్లడికాలేదు. ఆయన స్థానంలో మునిసిపల్‌ అడ్మిని స్ట్రేషన్‌లో విధులు నిర్వహిస్తూ వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్‌ అధికారిణి తమీమ్‌ అన్సారియా ను నియమించారు. ఈమె 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి. జిల్లాకు కొత్త కలెక్టర్‌గా రానున్న మంజీర్‌ జిలానీ సమాన్‌ సతీమణి కూడా. గతంలో శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్‌గా కూడా వ్యవహరించారు. స్పౌజ్‌ కోటా కింద జిల్లాకు కమిషనర్‌గా రాను న్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో ఐఏఎస్‌ అధికారిణి శోభ శ్రీకాకుళం నగరపాలక సంస్థకు కమిషనర్‌గా ఉండేవారు. ఆమె బదిలీ అయిన తర్వాత ఐఏఎస్‌ అధికారులను నియమించలేదు. ఎనిమిదేళ్ల తర్వాత కార్పొరేషన్‌కు ఐఏఎస్‌ అధికారిని నియమించారు.

- ఇప్పటికే పలు శాఖల్లో కదలికలు

ఇప్పటికే పలు శాఖల్లో అధికారులు బదిలీ అయ్యారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రేమప్రసన్నవాణిని రాజమహేంద్రవరం మునిసిపల్‌ కార్పొరేషన్‌కు అదనపు కమి షనర్‌గా బదిలీ చేసింది. అలాగే జిల్లాపరిషత్‌ పరిధిలో 21 మంది మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులకు బదిలీలు అయ్యాయి. విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి ఇక్కడకు.. ఇక్కడ నుంచి ఆ జిల్లాలకు ఎంపీడీవోలు బదిలీలు అయ్యారు. కొద్దిరోజుల వ్యవధిలో తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, జిల్లాలో ఇతర శాఖలు, పోలీసుల్లో బదిలీలు జరిగే అవకాశముంది.

Updated Date - Jan 28 , 2024 | 11:35 PM