ఆడుదాం ఆంధ్ర పోటీల్లో డిష్యూం.. డిష్యూం..
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:12 AM
మండల కేంద్రం నరసన్నపేట డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో క్రీడాకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

- సత్యవరం, కరగాం క్రీడాకారుల మధ్య ఘర్షణ
నరసన్నపేట, జనవరి 11: మండల కేంద్రం నరసన్నపేట డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో క్రీడాకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ పోటీల్లో భాగంగా సత్యవరం రూరల్, కరగాం సచివాలయాల క్రీడాకారుల మధ్య కబడ్డీ జరిగింది. సత్యవరం రూరల్ క్రీడాకారుడు కూతకు వెళ్లాడు. అయితే, పాయింట్లు తీసుకువచ్చిన విషయంపై ఇరుజట్ల క్రీడాకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటమాట పెరిగి కోర్టులోనే తోపులాటకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సింహాచలం ఆధ్వర్యంలో పోలీసులు క్రీడా మైదానానికి చేరుకుని క్రీడాకారులకు సర్ది చెప్పారు. చెరోజట్టుకు ఐదు కూతలు ఇచ్చి దగ్గర ఉండి పోటీలను నిర్వహించారు. దీంతో వివాదం సద్దుమనిగింది.
విరిగిన బాలిక కాలు
జి.సిగడాం: ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పాలఖండ్యాంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్న జి.సిగడానికి చెందిన నడుపూరు సుకన్య అనే విద్యార్థిని కుడి కాలు విరిగిపోయింది. వెంటనే ఆమెను రాజాంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కాలుకు శస్త్ర చికిత్స చేయాలని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సుకన్య జి.సిగడాం జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుంది.