ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి
ABN , Publish Date - Jul 13 , 2024 | 11:31 PM
జిల్లాకు కొత్త ఎస్పీ రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఎస్పీ జీఆర్ రాధికను బదిలీ చేసింది. కొత్త ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డిని నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది.
- జీఆర్ రాధికకు బదిలీ
శ్రీకాకుళం క్రైం, జూలై 13: జిల్లాకు కొత్త ఎస్పీ రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఎస్పీ జీఆర్ రాధికను బదిలీ చేసింది. కొత్త ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డిని నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. మహేశ్వరరెడ్డిది కడప ప్రాంతం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. పోలీసు శాఖపై మక్కువతో ఐపీఎస్ అయ్యారు. 2019 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన.. తొలిసారిగా విశాఖపట్నం గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. తర్వాత చింతూరు ఏఎస్పీగా రెండున్నరేళ్లు విధులు నిర్వర్తించారు. అనంతరం రంపచోడవరం ఓఎస్‌డీగా పనిచేశారు. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా విధులు నిర్వహించారు. తప్పు చేస్తే అధికార పార్టీ నేతలైనా ఉపేక్షించని నైజంతో పోలీసు శాఖలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. ఓఎస్డీ నుంచి ఎస్పీగా పదోన్నతి పొందుతూ.. జిల్లాకు రానున్నారు. కాగా.. జీఆర్ రాధిక 2022 ఏప్రిల్ 3న జిల్లాలో తొలి మహిళా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆమె సీఐడీ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆమెకు బదిలీ కాగా.. పోస్టింగ్ లభించలేదు. డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీచేశారు.