Share News

కూటమి.. క్లీన్‌స్వీప్‌

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:40 AM

సార్వత్రిక ఎన్నికల్లో జిల్లావాసులు అనూహ్య తీర్పునిచ్చారు. ఎన్డీయే కూటమి నేతలను భారీ మెజార్టీతో గెలిపించారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన స్పీకర్‌, మంత్రులను సైతం మట్టికరిపించారు. జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంట్‌తోపాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎంపీ స్థానంతోపాటు.. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, ఒక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు.

కూటమి.. క్లీన్‌స్వీప్‌
కోటబొమ్మాళిలో అచ్చెన్నాయుడుకు గజమాలతో సన్మానం..

- వైసీపీని సాగనంపిన సిక్కోలు ప్రజలు

- జిల్లాలో అన్ని స్థానాలూ ఎన్టీఏ కైవసం

- స్పీకర్‌, మంత్రులు సైతం ఓటమిపాలు

- సంబరాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ శ్రేణులు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

‘వైనాట్‌ 175’ అంటూ ఊదరగొట్టిన జగన్మోహన్‌రెడ్డిని.. వైసీపీ నాయకులను జిల్లా ప్రజలు ఛీ కొట్టేశారు. అరాచకపాలనకు.. ఓట్లతో బుద్ధి చెప్పేశారు. జిల్లాలో వైసీపీ ఖాతా కూడా తెరచుకోని విధంగా తీర్పునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో స్పీకర్‌, మంత్రులను సైతం ఓడిస్తూ.. క్లీన్‌స్వీప్‌ చేస్తూ.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి జై కొట్టారు. దీంతో బిత్తరపోవడం వైసీపీ వంతైంది. కూటమి విజయంతో జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి.

.......................

సార్వత్రిక ఎన్నికల్లో జిల్లావాసులు అనూహ్య తీర్పునిచ్చారు. ఎన్డీయే కూటమి నేతలను భారీ మెజార్టీతో గెలిపించారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన స్పీకర్‌, మంత్రులను సైతం మట్టికరిపించారు. జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంట్‌తోపాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎంపీ స్థానంతోపాటు.. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, ఒక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. నేతలంతా 24వేల నుంచి.. 52వేల ఓట్ల వరకూ బంపర్‌ మెజార్టీ సాధించారు. దీంతో విధ్వంసపాలనకు తెర దిగిందంటూ జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కక్షలు, కేసులు, దాడులతో వైసీపీ పాలనతో విసిగిపోయామని.. అందుకే స్వేచ్ఛ కోసం కూటమి గెలిపించుకున్నామని చెబుతున్నారు. మరోవైపు ఊహించని స్థాయిలో విజయం దక్కడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

ఫ చంద్రబాబునాయుడ్ని, నారా లోకేష్‌ను, పవన్‌కల్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించడంలో పోటీపడి ముందువరుసలో నిల్చిన వారిలో జిల్లా వైసీపీ నాయకులు కూడా చేరిపోయారు. స్పీకర్‌గా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసి.. తమ్మినేని సీతారాం తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఆయన తీరుతోనే ఆ పదవికి కళంకం తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో ప్రధాన రోడ్డును సైతం బాగుచేసుకోలేకపోవడంతో తమ్మినేనిని ఓటర్లు ఇంటికి సాగనంపారు. 35వేల ఓట్లతేడాతో మేనల్లుడు, టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌ చేతిలో ఘోరపరాజయం పాలయ్యారు.

- మరో ఉద్దండ నేత ధర్మాన ప్రసాదరావు... రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి.. సొంత వ్యవహరాలకే ప్రాధాన్యమిచ్చారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై మరింత విశ్లేషణ ఇచ్చుకుని.. జగన్‌ను ఆకాశానికి ఎత్తి.. చంద్రబాబును తిడుతూ కాలం గడిపేశారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన గొండు శంకర్‌ చేతిలో ఏకంగా 52,521 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

- పలాస నుంచి నోటుదురుసు మంత్రిగా పేరుగాంచిన సీదిరి అప్పలరాజుకు కర్రు కాల్చివాత పెట్టేశారు ఓటర్లు. ఏకపక్షంగా టీడీపీకి ఓట్లువేసి ఇంతవరకు ఆయన అందించిన అవినీతి పాలనకు ఛీకొట్టేశారు. టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష భారీ మెజార్టీతో గెలుపొందారు.

- టెక్కలి వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌.. విర్రవీగిపోయి.. టీడీపీ, జనసేన నాయకులపైనా దాడులు చేయించి.. కేసులుపెట్టించి.. విక్రతానందం పొందారు. ఈయనకు అధికారం ఇస్తే ఎవరికైనా ప్రమాదమేనని ప్రజలందరూ గమనించారు. టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడుకు బంపర్‌ మెజార్టీతో ఆరోసారి గెలిపించారు. ఇప్పుడు దువ్వాడ ఒడిశాకు పారిపోతారా... విదేశాలకు వెళ్లిపోతారా? అన్నదే చర్చనడుస్తోంది.

- ఎచ్చెర్ల, పాతపట్నం ఎమ్మెల్యేల అవినీతి బాగోతంతో ముందు నుంచి విసిగిపోయిన ప్రజలు.. వాళ్లను సాగనంపేశారు. కొత్తవారైనా ఎచ్చెర్లలో బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావును, పాతపట్నంలో టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు. పాతపట్నంలో 20 ఏళ్ల తర్వాత టీడీపీ జండా ఎగరడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

- నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌కు గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ ఏమైపోయిందోకానీ.. ఇప్పుడు ఉల్టాగా తను అనుకున్న ఓటర్లు కూడా మాయమయ్యారు. టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి జై కొట్టేశారు.

- టెక్కలి నుంచి అచ్చెన్నతోపాటు ఇచ్ఛాపురం నుంచి టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్‌ కూడా హ్యాట్రిక్‌ సాధించారు.

శ్రీకాకుళం జిల్లాలో విజేతలు వీరే...

==================================

అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి పేరు పార్టీ ఓట్ల మెజార్టీ

==============================================================

పలాస గౌతు శిరీష టీడీపీ 40,350

శ్రీకాకుళం గొండు శంకర్‌ టీడీపీ 52,521

నరసన్నపేట బగ్గు రమణమూర్తి టీడీపీ 29,371

ఆమదాలవలస కూన రవికుమార్‌ టీడీపీ 35032

టెక్కలి కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ 34,435

ఎచ్చెర్ల నడుకుదిటి ఈశ్వరరావు బీజేపీ 28,247

పాతపట్నం మామిడి గోవిందరావు టీడీపీ 24,774

ఇచ్ఛాపురం బెందాళం అశోక్‌ టీడీపీ 37,623

================================================

Updated Date - Jun 05 , 2024 | 12:40 AM