Share News

ప్రచారంలో బంధుగణం

ABN , Publish Date - May 03 , 2024 | 12:19 AM

జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీతో పాటు ఇతర పార్టీల అభ్యర్థుల కుటుంబ సభ్యులు సపరివార సమేతంగా ఎన్నికల ప్రచారాల్లో మునిగి తేలుతున్నారు.

 ప్రచారంలో బంధుగణం

- సకుటుంబ సపరివార సమేతంగా జనంలోకి

- ఇంటింటికీ వెళ్లి ఓట్ల కోసం అభ్యర్థన

(నరసన్నపేట)

జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీతో పాటు ఇతర పార్టీల అభ్యర్థుల కుటుంబ సభ్యులు సపరివార సమేతంగా ఎన్నికల ప్రచారాల్లో మునిగి తేలుతున్నారు. నామినేషన్ల ఉప సంహరణ ఘట్టం ముగిసింది. సార్వత్రిక ఎన్నికల రణరంగంలో పోటీపడే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించారు. జిల్లాలో ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. 73 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలోనూ 13 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జాతీయ కాంగ్రెస్‌, బహుజన సమాజ్‌వాదీ, జాతీయ జనసేన, స్వతంత్ర అభ్యర్థులు ఇలా అనేక మంది బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం, వైసీపీల మధ్యే పోటీ ఉంది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను సమర్పించకముందు నుంచి సుడిగాలి ప్రచారానికి తెరలేపారు. పోలింగ్‌కు మరో 11 రోజులే సమయం ఉంది. ఇందులో ప్రచారానికి తొమ్మిది రోజులే మిగిలింది. ఇంత తక్కువ సమయంలో ఎక్కువ మందిని కలవడం కుదరదు. కుటుంబ సభ్యులంతా ప్రచారం చేయడం వల్ల వృద్ధులు, మహిళలు, యువత ఓట్లను కొల్లగొట్టడానికి ఆస్కారం ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు. అందుకే ఇంటిల్లిపాదీ ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో పాటు అభ్యర్థుల పిల్లలు సాంకేతికంగానూ సహకారం అందిస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత తీసుకుంటున్నారు. తద్వారా వారు కూడా ప్రచారంలో భాగస్వాములయ్యేలా జాగ్రత్త పడుతున్నారు.

- నరసన్నపేట కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి గెలుపు కోసం తన భార్య సుగుణ, కుమార్తె అర్చన, కుమారుడు సునీల్‌, రామ్‌లాల్‌ గ్రామాల్లో ఇంటింటా తిరుగుతున్నారు. గతంలో రమణమూర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, టీడీపీ సూపర్‌ సిక్స్‌ కార్యాక్రమాలను వివరిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇదే నియోజవర్గంలో వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌ తరపున కోడళ్లు శ్రావణి, గీష్మ ఇంటింటా తిరుగుతూ తన మామయ్యను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

- శ్రీకాకుళం నియోజవర్గం ఉమ్మడిపార్టీ అభ్యర్థి గొండు శంకర్‌ తరపున అతని భార్య గొండు స్వాతి గ్రామాల్లో తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు తరపున కుమారుడు రామ్‌మనోహార్‌నాయుడు గ్రామాల్లో పర్యటించి ఓటర్లను కలుస్తున్నారు.

- ఇచ్ఛాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఈయన భార్య నీలోత్పల సైతం ఓటర్లను కలుస్తాన్నారు. వైసీపీ అభ్యర్థి పిరియా విజయకు తోడుగా భర్త సాయిరాజ్‌ ప్రచారం చేపడుతున్నారు. - ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తమ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి రోజుకో చోట ప్రచారం చేపడుతున్నారు. ఎంపీ భార్య సైతం వేరేగా కేడర్‌తో కలసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలా జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల సతీమణులు, కుమారులు, కుమార్తెలు గ్రామాల్లో ప్రజలు దగ్గరకువెళ్లి ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. బంధుగణం సోషల్‌ మీడియా ఆయా నియోజవర్గ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వాయిస్‌ మేసేజ్‌లు పంపిస్తున్నారు. ఓటర్లకు ఫోన్‌లు చేస్తూ ఈసారి ఆయా అభ్యర్థులను గెలిపించాలని నేరుగా కోరుతు న్నారు. గ్రామాల్లో ఉన్న అసంతృప్తి నాయకులను బుజ్జిగించేందుకు బంధుగణం రంగంలోకి దిగుతుంది. ఇతరపార్టీల వైపు వెళ్లకుండా ఈసారి గెలిచేది మనమేనని.. అధికారంలో వస్తే ఏదో విధంగా సంతప్తి చేస్తామని కొందరికి చెబుతూ మరికొందరికి తాయిలాలు ఇస్తున్నారు. గతంలో జరిగినతప్పులు ఈసారి జరగవని.. పార్టీని వీడవద్దంటూ అభ్యర్థుల బంధువులు అసంతృప్తి నాయకులను బుజ్జిగిస్తున్నారు. కొన్ని నియోజవర్గాల్లో అభ్యర్ధులు తనయులు ఉపాధి వేతన దారులు వద్దకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. పట్టణాల్లో దుకాణాలు, లాండ్రీలు, బజ్జీలు వేసేవారు దగ్గర కూడా వెళ్లూతూ ప్రచారం చేపడుతున్నారు. ప్రచారంలోని చిన్నపిల్లలు కనిపిస్తే ఎత్తుకుంటూ వారితో ఫొటోలు తీస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. - శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, పలాస, టెక్కలి, పాతపట్నం, ఇచ్ఛాపురం శానసభ నియోజకవర్గాలు శ్రీకాకుళం పార్లమెంట్‌ పరిధిలోకి, ఎచ్చెర్ల నియోజకవర్గం మాత్రం విజయనగరం పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తుంది. ఎచ్చెర్లలో వచ్చే మెజార్టీని బట్టి విజయనగరం పార్లమెంటు అభ్యర్థి గెలుపు... ఓటములు ఆధారపడి ఉంటాయి. దీంతో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. కుటుంబ సభ్యులను కూడా ప్రచారానికి పంపిస్తున్నారు.

Updated Date - May 03 , 2024 | 12:19 AM