ఖరీఫ్.. సందడి
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:40 PM
జిల్లాలో ఖరీఫ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల పది రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. వంశధార, నాగావళి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాలువల ద్వారా నీరు విడిచిపెట్టడంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.

- జిల్లాలో జోరుగా పొలం పనులు
- ఊపందుకున్న ఉబాలు
(నరసన్నపేట/ ఎచ్చెర్ల/ పలాస రూరల్/ ఇచ్ఛాపురం)
జిల్లాలో ఖరీఫ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల పది రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. వంశధార, నాగావళి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాలువల ద్వారా నీరు విడిచిపెట్టడంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. పొలాలకు గట్లు వేస్తూ.. నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 5 లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నట్టు వ్యవసాయాధికారుల అంచనా. ఎక్కువ భాగం వరి సాగు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొన్నిచోట్ల పొలంలో దమ్ము చేపట్టి.. ఉబాలు వేసేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఉదాహరణకు పలాస మండలంలోని తర్లాకోట, కైజోల, కొత్తూరు, సున్నాడ, అల్లుకోల, రెంటికోట, లొద్దబద్ర, సవరగోవిందపురం, దొనగొర, సిరిపురం ప్రాంతాల్లో ఉబాలు పనులు ఊపందుకున్నాయి. ఇక మొట్టు ప్రాంతాలైన రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల తదితర మండలాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. వర్షాలు పడటంతో మొక్కజొన్న పంటలో కలుపు ఏరివేత పనులు చేపడుతున్నారు. అలాగే కూరగాయలు, వేరుశనగ పంట పొలాల్లో కూడా కలుపు తీస్తున్నారు.
కూలీలు దొరక్క అవస్థలు
ఒక్కసారిగా పొలం పనులు ప్రారంభం కావడంతో కూలీలు దొరకక రైతులు అవస్థలు పడుతున్నారు. గట్లు వేసేందుకు రోజుకు ఒక్కొక్కరికీ రూ.600 చొప్పున ఇస్తున్నా.. కూలీల దొరకని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇక దమ్ముకు కూలీలు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. యాంత్రీకరణ నేపథ్యంలో నొల్ల తోలేందుకు తగిన పరిజ్ఞానంగల కూలీలకు డిమాండ్ పెరిగింది. ఆకుతీత, ఊబాలు వేసేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో కూలీలు డబ్బులు వసూలు చేస్తున్నారు. గతంలో ఎకరా పొలంలో ఉబాలు వేసేందుకు రూ.4వేలు ఖర్చయ్యేది. ప్రస్తుతం కూలీల కొరత కారణంగా రూ.7వేల వరకూ వెచ్చించాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పొంచి ఉన్న ప్రమాదాలెన్నో..
ప్రస్తుత వర్షాకాలంలో రైతులకు పలు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రకృతిపరంగా జరిగే ప్రమాదాలతో పాటు ఎరువులు, క్రిమి సంహారక మందులు చల్లేటప్పుడు అప్రమత్తంగా వ్యహరించాల్సి ఉందని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వర్షం కురిసేటప్పుడు ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని, ఆ సమయంలో పొలంలోనూ, చెట్ల కింద ఉండరాదని సూచిస్తున్నారు. పొలాల్లో ఉన్న మోటార్లకు, సార్టర్లకు రక్షణ చర్యలు చేపట్టాలని, లేదంటే విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. చేతులకు గ్లౌజులు వేసుకుంటే విద్యుదాఘాతం నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే పొలాల్లో పాముల సంచారం కూడా ఎక్కువగా ఉంటుందని, కలుపు మొక్కలు తీసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఏదైనా కాటు వేసినట్టు అనిపిస్తే వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి వైద్యం చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
జాగ్రత్తలు అవసరం
ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేసేటప్పుడు రైతులు తగిన జాగ్రత్తలు అవసరం. లేదంటే పొలాల్లోనే అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. పురుగుల మందు పిచికారీ చేసేటప్పుడు చేతులకు గ్లౌజు, కాళ్లకు రబ్బరు బూట్లు, ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి. పిచికారీ చేసిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి. పురుగుల మందుల డబ్బాలను పొలాల్లోనే, ఇంటి వద్దనే వుంచకుండా గోతులు తవ్వి వాటిలో కప్పివేయాలి.
- వై.సురేష్, వ్యవసాయాధికారి, ఎచ్చెర్ల