Share News

కడపల గెడ్డకు పోటెత్తిన వరద

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:58 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీ డనం కారణంగా మండలంలో కురిసిన భారీ వర్షాలకు కడపల గెడ్డకు వరద పోటెత్తింది. దీంతో తురకపేట, వాడవలస గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపో యాయి.

 కడపల గెడ్డకు పోటెత్తిన వరద
ఎల్‌ఎన్‌పేట: వాడవలస వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు

- రెండు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ఎల్‌.ఎన్‌.పేట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీ డనం కారణంగా మండలంలో కురిసిన భారీ వర్షాలకు కడపల గెడ్డకు వరద పోటెత్తింది. దీంతో తురకపేట, వాడవలస గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపో యాయి. మిరియాపల్లి, లక్ష్మీనర్సుపేట గ్రామాల మీదుగా లక్ష్మీనర్సుపేట జంక్షన్‌కు చేరుకుని అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు రాక పోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం వంశధారలో వరద పెరుగుతుండడంతో నదీతీర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వాడవలస వద్ద నది గట్టు కోతకు గురైతే గ్రామంలోకి నీరుచొరబడుతుందని ఆ గ్రామస్థు లు ఆందోళన చెందుతున్నారు. వంశధారలో నీటిమట్టం పెరుగుతుండ డంతో బసవరాజుపేట, లక్ష్మీనర్సుపేట, మిరియాపల్లి, వాడవలస, దబ్బ పాడు గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి పి.కిరణ్‌కుమార్‌ పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.

నదీ తీర గ్రామాల్లో దండోరా

జలుమూరు: వంశధార నదిలో వరద ఉధృతి పెరగడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. కొమనాపల్లి, సురవరం, దొంపాక, అంధవరం, పర్లాం, రామకృష్ణాపురం తదితర నదీ తీర గ్రామాల్లో మంగళ వారం సాయంత్రం దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. వరద ఉధృతి తగ్గే వరకు వంశధార నది వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తహసీల్దారు లక్ష్మీనారాయణ, మండల ప్రత్యేకాధికారి నాగలక్ష్మి, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ముంపు పొలాల పరిశీలన

నరసన్నపేట: సుందరాపురం, మామిడివలస, గోపాలపెంట, కంబకాయి తదితర గ్రామాల్లో వరద నీటిలో ఉన్న వరి పొలాలను వ్యవసాయ అధికారులు మంగళవారం పరిశీలించారు. వాటిని రక్షించుకునేందుకు రైతులకు పలు సూచనలు చేశారు. వంశధారలో నీటి మట్టం పెరగడంతో మండల ప్రత్యేకాధికారి, బీసీ సంక్షేమశాఖ అధికారి అనూరాధ నదీతీర గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. మడపాం, బుచ్చిపేట, చేనులవలస, అంబాజీపేట, లుకలాం, కొబగాం, గెడ్డవానిపేట గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.

వర్షాల నష్టంపై వివరాలు అందజేయండి

టెక్కలి: మండలంలో వర్షాలకు జరిగిన నష్టాలపై వెంటనే వివరాలు అందజేయాలని మండల ప్రత్యేకాధికారి ఎం.శైలజ అన్నారు. మంగళవారం మండలపరిషత్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. పంటల ముంపు, చెరువులు, వాగులకు గండ్లు, రోడ్లపైకి నీరు, తాగునీటి పథకాల ఇక్కట్లు, కూలిన గోడలు, ఇళ్లు, పాఠశాలలు, ఐసీడీఎస్‌ భవనాలకు కలిగిన నష్టం వంటి వివరాలు తెలియజేయాలని ఆమె కోరారు. మండలంలో నష్టం పెద్దగా లేదని పలు శాఖల అధికారులు చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీడీవో చింతాడ లక్ష్మీభాయి, వ్యవసాయశాఖ ఏవో రంగారావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

తంపర భూముల పరిశీలన..

సుసరాం(పోలాకి): సుసరాంలో తంపర ముంపు పొలాలను మంగళవారం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మంత్రి నర్సింహమూర్తి పరిశీలించారు. నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలతో పంటలకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌ తెలిపారు. సుసరాం, డీఎల్‌పురం, సత్రవుపేట, ప్రియాగ్రహారం తదితర గ్రామాల్లో రాగోలు వ్యవసాయ శాస్త్రవేత్తలతో పర్యటించి పంట అంచనా నమోదు చేశామన్నారు. మండలంలో 60 ఎకరాల్లో వరిపంట నీటమునిగిందని తెలిపారు.

1

Updated Date - Sep 10 , 2024 | 11:58 PM