Share News

రుణాలు ఇవ్వట్లే!

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:39 AM

స్వయం సహాయక సంఘ సభ్యులకు కొత్త రుణాలు అందించడంలో బ్యాంకర్లు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. దరఖాస్తులు చేసి నెలలు గడుస్తున్నా రుణాలు మంజూరు చేయకుండా బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు.

 రుణాలు ఇవ్వట్లే!
జేఆర్‌పురంలో స్వయ సహాయక సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్న సీఎఫ్‌ (ఫైల్‌)

- స్వయం సహాయక సభ్యులకు మంజూరు కాని కొత్త లోన్లు

- బ్యాంకర్లు తీవ్ర నిర్లక్ష్యం

- మూడు నెలలుగా పెండింగ్‌

- ఆందోళనలో మహిళలు

(రణస్థలం)

-రణస్థలం మండలం గోశాం అయ్యప్ప స్వయం సహాయక సంఘ సభ్యులు రూ.23వేలు రుణం బ్యాంకుకు చెల్లించాల్సి ఉంది. అయినప్పటికీ కొత్త రుణం తీసుకొనే అర్హత ఉంది. దీంతో కొత్త రుణం కోసం వెలుగు సిబ్బంది సంఘం ధ్రువపత్రాలతో బ్యాంకుకు గతేడాది డిసెంబరులో దరఖాస్తు చేసుకున్నారు. కానీ, మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకూ కొత్త రుణం అందించలేదు.

-రణస్థలం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన కొందరు మహిళలు నీలమ్మ తల్లి స్వయం సహాయక సంఘంగా ఏర్పడ్డారు. కొత్తగా ఏర్పడిన ఈ సంఘం రుణం కోసం గతేడాది డిసెంబరులో బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారు. గత మూడు నెలలుగా అదిగో ఇదిగో అంటూ బ్యాంకు అధికారులు తిప్పుతున్నారే తప్ప రుణాలు అందించిన దాఖలాలు లేవు.

-జేఆర్‌పురం గ్రామానికి చెందిన భవాని స్వయం సహాయక సంఘం కొత్త రుణం కోసం గతనెల ఫిబ్రవరి రెండో వారంలో దరఖాస్తు చేసుకుంది. అదేనెల 16న సంఘ సభ్యులను బ్యాంకు సిబ్బంది పరిశీలించారు. వారం రోజుల్లో రుణం ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వలేదు.

స్వయం సహాయక సంఘ సభ్యులకు కొత్త రుణాలు అందించడంలో బ్యాంకర్లు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. దరఖాస్తులు చేసి నెలలు గడుస్తున్నా రుణాలు మంజూరు చేయకుండా బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. దీంతో సహాయక సంఘ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 30 మండలాల్లో 1,286 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. వాటి పరిధిలో 49,022 సంఘాల్లో 5.5 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ప్రతీ మండలంలో సంఘాల సంఖ్య ఆధారంగా ముగ్గురు లేదా నలుగురు సీసీలు ఉన్నారు. ప్రతీ సీసీ కింద ఇద్దరు సీఆర్పీలు(ఆడిటర్లు) ఉంటారు. వారు గ్రామాల పరిధిలో సంఘాల పనితీరు, లావాదేవీలు, పొదుపు, అప్పు, అంతర్గత అప్పులు, బ్యాంకు తీర్మాన పుస్తకాల నిర్వహణను పరిశీలిస్తారు. అయితే ఈ ప్రక్రియలో పనితీరు మెరుగుపడినా బ్యాంకర్లు రుణాలకు మోకాలడ్డుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి స్వయం సహాయక సంఘాల లావాదేవీలకు ఏ బ్యాంకు అయినా మొగ్గు చూపుతుంది. దానికి పటిష్టమైన వ్యవస్థ ఉంటుంది. వెలుగు సిబ్బంది బాధ్యులుగా ఉంటారు. రుణాల చెల్లింపులు, రెన్యూవల్స్‌ దాదాపు సక్రమంగా పూర్తవుతాయి. కానీ, కొన్ని బ్యాంకులు మాత్రం ఎందుకో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రణస్థలంలో యూనియన్‌ బ్యాంకు అధికారులు ఇబ్బందిపెడుతుండడంతో కెనరా బ్యాంకు శాఖకు చాలామంది మారిపోయినట్టు వెలుగు అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. ఇదే పరిస్థితి అన్ని మండలాల్లో ఉంది.

రుణాలు అడిగితే కుంటిసాకులు

పేదరిక నిర్మూలన, మహిళా సాధికారితలో భాగంగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటయ్యాయి. గతంలో ఒక్కో మహిళ రూ.30నుంచి పొదుపు చేయగా.. ప్రస్తుతం రూ.100 నుంచి రూ.500 వరకూ చేస్తున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు కూడా గతంలో రూ.10 వేల నుంచి రూ.50 వేలు అందించేవారు. ఇప్పుడు మహిళల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు గాను ఎటువంటి తనఖా లేకుండా నేరుగా ఒక్కో గ్రూపునకు గరిష్ఠంగా రూ.20 లక్షల వరకూ మంజూరు చేస్తున్నాయి. అయితే ఇందులో ఎక్కువ సంఘాలు సకాలంలో రుణాలు చెల్లిస్తున్నాయి. కానీ కొత్త రుణాలు చెల్లించడంలో బ్యాంకర్లు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదేమని బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. సిబ్బంది లేరని కుంటిసాకులతో కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో వేలాది మంది మహిళలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టిసారించాలని స్వయం సహాయక సంఘాల సభ్యులు కోరుతున్నారు.

రణస్థలంలో అంతులేని నిర్లక్ష్యం

రణస్థలం మండలంలో 950 మంది స్వయం సహాయక సభ్యులు కొత్త రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. రణస్థలం మండల కేంద్రంలో ఉన్న యూనియన్‌ బ్యాంకులో సభ్యులు తమ ధ్రువపత్రాలు అందించి మూడు నెలలు గడుస్తున్నా రుణాలు అందించడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండలంలో మరో రెండు గ్రామాల్లో ఉన్న యూనియన్‌ బ్యాంకు శాఖల్లో రుణాల చెల్లింపు ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నా.. మండల కేంద్రంలో మాత్రం అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇదే విషయమై రణస్థలం యూనియన్‌ బ్యాంకు మేనేజర్‌ సంగీతను వివరణ కోరగా.. రుణాలు సక్రమంగానే చెల్లిస్తున్నామని చెప్పుకొచ్చారు. స్వయం సహాయక సంఘాలు ధ్రువపత్రాలు సమర్పిస్తే పిలిచి రుణాలు ఇస్తున్నామన్నారు. అయితే ఫిబ్రవరి నెలకు సంబంధించి ఎంత రుణాలు ఇచ్చారని ప్రశ్నిస్తే.. ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ‘అది మా ఉన్నతాధికారులకు చెబుతాం. మీకు చెప్పాల్సిన అవసరం లేదని’ అన్నారు.

చర్యలు తీసుకుంటాం

అర్హత ఉన్న స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వాల్సిందే. మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించడానికే బ్యాంకులు ఉన్నాయి. రుణాల మంజూరులో ఎవరైనా బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు తెలిస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

ఎండీ తిలక్‌, ఏజీఎం, యూనియన్‌ బ్యాంకు

Updated Date - Mar 11 , 2024 | 12:39 AM