బావి వివాదంలో పంచాయతీకి అనుకూలంగా తీర్పు
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:32 AM
మండల కేంద్రం వెంకటేశ్వర కాలనీలోని ఓ బావి, స్థలం వివాదం లో పంచాయతీకి అనుకూలంగా పొందూరు కోర్టు తీర్పు చెప్పినట్టు ఈవో ఎస్.రమే ష్ తెలిపారు.
పొందూరు: మండల కేంద్రం వెంకటేశ్వర కాలనీలోని ఓ బావి, స్థలం వివాదం లో పంచాయతీకి అనుకూలంగా పొందూరు కోర్టు తీర్పు చెప్పినట్టు ఈవో ఎస్.రమే ష్ తెలిపారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడారు. 2016 ఆగస్టు 15న అదే కాలనీకి చెందిన వావిలపల్లి సుజాత.. పంచాయతీ స్థలాన్ని ఆక్రమించడంతో పాటు ఆ స్థలంలో ఉన్న బావిని కొంతమంది సాయంతో పూడ్చి వేయించారు. దీంతో కాలనీవాసుల ఫిర్యాదు మేరకు పంచాయతీ సిబ్బంది ఆక్రమ ణను అడ్డుకున్నారు. దీనిపై ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదనలు జరిగాయి. చిరికి ఆ స్థలం పంచాయతీకి చెందినదిగా గుర్తించిన న్యాయాధికారి పంచాయతీకి అనుకూలంగా శుక్రవారం తీర్పు ఇచ్చారు. కోర్టు ఖర్చులతో పాటు అప్పటి పంచాయతీ ఈవోకు రూ.3 వేలు చెల్లించాలని సుజాతను న్యాయాధికారి బి.జోత్స్న ఆదేశించారు. కాగా ఇదే కేసులో కాలనీకి చెందిన కొంతమందిపై సుజాత వేసిన కేసులను న్యాయాధికారి కొట్టివేసినట్టు ఈవో తెలిపారు. పంచాయతీ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తప్పవని టీడీపీ మండల అధ్యక్షుడు రామ్మోహన్ తెలిపారు. ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.