Share News

జేసీ ఆదేశాలూ.. బేఖాతరు

ABN , Publish Date - May 27 , 2024 | 11:41 PM

పోరంబోకు స్థలం కనిపిస్తే చాలు... ఆక్రమించడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారింది. శ్రీకాకుళం మండలం తండ్యాంవలసలోని సర్వే నెంబరు-94లో 1.38 ఎకరాల చెరువు గర్భ స్థలాన్ని ఆక్రమించేశారు.

జేసీ ఆదేశాలూ.. బేఖాతరు
ఆక్రమించిన స్థలాన్ని పంటపొలంగా నిరూపించే ప్రయత్నం

- ఆక్రమణ తొలగింపుపై రాజకీయ నీడలు

- 1.38 ఎకరాల పోరంబోకు స్థలం కబ్జా

- పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది

- వైసీపీ నేతకు అండగా అక్రమాలు

- కలెక్టర్‌ దృష్టికి చెరువు గర్భం ఆక్రమణలు

(శ్రీకాకుళం క్రైం)

పోరంబోకు స్థలం కనిపిస్తే చాలు... ఆక్రమించడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారింది. శ్రీకాకుళం మండలం తండ్యాంవలసలోని సర్వే నెంబరు-94లో 1.38 ఎకరాల చెరువు గర్భ స్థలాన్ని ఆక్రమించేశారు. దీనిపై ఈ నెల 24న ‘‘మరో ‘చెర’వు’’ శీర్షికతో ప్రచురితమైన ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఆక్రమణలు తొలగించాలని జేసీ ఆదేశించారు. కాగా ఆ ఆదేశాలు బేఖాతరయ్యాయి. ఈ వ్యవహారంపై రాజకీయ నీడలు అలుముకున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేతకు అండగా కొంతమంది అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

- ఏడాది కాలంగా తండ్యాంవలసలో చెరువు గర్భం ఆక్రమణకు గురవుతూనే ఉంది. కొందరు రెవెన్యూ సిబ్బంది స్థానిక వైసీపీ నేతకు ప్రోత్సాహాన్నిస్తూ.. రికార్డులు తారుమారు చేసి అక్రమాలకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇటీవల స్థానికులు జేసీ ఎం.నవీన్‌కు ఫిర్యాదు చేశారు. జేసీ స్పందిస్తూ.. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు శ్రీకాకుళం తహసీల్దార్‌ బీవీ రాణి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని రెవెన్యూ సిబ్బందికి స్పష్టం చేశారు. ఏడాది కిందట ‘ఇది ప్రభుత్వ స్థలమని.. ఆక్రమణదారులు శిక్షార్హులు’ అని సిబ్బంది హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించి ఆక్రమణకు పాల్పడినా సమాచారం ఇవ్వనందుకు వీఆర్వో, ఆర్‌ఐకి తహసీల్దార్‌ మెమోలు జారీచేశారు. మరోవైపు సెక్రటరీ సుప్రజ.. చెరువు ఆక్రమణలు అడ్డుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కాగా.. ఈ ఆదేశాలను పాటించాల్సిన రెవెన్యూ సిబ్బంది ఆక్రమణదారులకు అండగా నిలిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. చెరువు పూడికతీత పనులు జరుగుతుండగా.. ఆక్రమణకు పాల్పడిన స్థలాన్ని ఆదివారం సాయంత్రం చదును చేస్తుండడం గమనార్హం. ఆ స్థలంలో రైతులు పంటలు పండిస్తున్నారని అధికారులను నమ్మించేందుకు సిబ్బంది ప్రోత్సాహంతో ట్రాక్టరుతో పనులను చేయించడం కొసమెరుపు. ఆక్రమణకు గురైన స్థలంలో ఎటువంటి పనులు చేయకూడదని సెక్రటరీ సుప్రజ, ఈవోపీఆర్డీ ప్రకాష్‌ ఆక్రమణదారులకు నోటీసులిచ్చి హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ రాజకీయ అండతో ఆక్రమణలు కొనసాగడం చర్చనీయాంశమవుతోంది.

- కలెక్టర్‌ దృష్టికి..

రాజకీయ ఒత్తిళ్లతో చెరువు గర్భ భూముల ఆక్రమణలు తొలగించడంలో తహసీల్దారు సైతం వెనుకడుగు వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణలను తొలగించేందుకు భద్రత కల్పించాలని తహసీల్దారు రాణి పోలీసులకు లేఖ రాసినా.. ఓట్ల లెక్కింపు పూర్తయేవరకు కుదరదని పోలీసులు కుంటిసాకులు చెప్పడం కొసమెరుపు. గ్రామస్థుల చొరవతో ఈ ఆక్రమణ వ్యవహారం సోమవారం కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ దృష్టికి వెళ్లింది. ఇంకా ఆక్రమణలు తొలగించలేదా? అని ఆయన ఆశ్యర్యం వ్యక్తం చేయగా.. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్‌ రాణిని వివరణ కోరగా.. ఆక్రమణలు తొలగించాలని రెండు రోజుల కిందటే వీఆర్వో, ఆర్‌ఐకు ఆదేశించామని తెలిపారు.

Updated Date - May 27 , 2024 | 11:41 PM