Share News

జగనన్నా.. ఒడిశా వెళ్లేదెలా..?

ABN , Publish Date - May 03 , 2024 | 12:16 AM

పలాస-మెళియాపుట్టి ఆర్‌అండ్‌బీ రోడ్డు అధ్వానంగా మారింది. పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ‘జగనన్నా,, ఒడిశాకు రాకపోకలు ఎలా సాగించాల’ని వాహన చోదకులు ప్రశ్నిస్తున్నారు.

జగనన్నా.. ఒడిశా వెళ్లేదెలా..?
మోదుగులపుట్టి వద్ద నిలిచిపోయిన రోడ్డు పనులు

-రాళ్లు తేలి గోతులమయమైన పలాస-మెళియాపుట్టి రోడ్డు

పలాస రూరల్‌: పలాస-మెళియాపుట్టి ఆర్‌అండ్‌బీ రోడ్డు అధ్వానంగా మారింది. పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ‘జగనన్నా,, ఒడిశాకు రాకపోకలు ఎలా సాగించాల’ని వాహన చోదకులు ప్రశ్నిస్తున్నారు. పలాస- మెళియాపుట్టి ఆర్‌అండ్‌బీ రోడ్డు నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఒడిశాలోని పలు ప్రాంతాలకు ఈ మార్గంలోనే రాకపోకలు సాగించాలి. వాస్తవానికి ఒడిశాకు ఆనుకుని పలాస, మెళియాపుట్టి, మందస, నందిగాం, పాతపట్నం తదితర మండలాల్లోని వందలాది గ్రామాలు ఉన్నాయి. వీరికి ఒడిశాలోని పర్లాకిమిడి, బుషికిడి తదితర ప్రాంతాల్లో బంధుత్వాలు ఉండడంతోపాటు వ్యాపార కార్యకలాపాలు జరుగుతుంటాయి. దీంతో పలాస- మెళియాపుట్టి అత్యంత కీలక రహదారిగా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రహదారి గురించి అస్సలు పట్టించుకోలేదు. దీంతో ఎక్కడ చూసినా గోతులమయమై వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రజలు, ప్రతిపక్షాల నాయకులు ఎన్నో ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం ఎన్నికల ముందు ఇటీవల తారురోడ్డు పనులు మొదలు పెట్టింది. అయితే కొన్నిచోట్ల పూర్తి చేయకుండా నిలిపివేసింది. మొదుగులుపుట్టి, రేగులపాడు, టెక్కలిపట్నం వద్ద మధ్యలో రోడ్డు వేయకపోవడంతో రాళ్లు తేలి అధ్వానంగా తయారైంది. దీంతో గమ్యస్థానాలు చేరడానికి అధిక సమయం తీసుకుంటోంది. కల్వర్టులు, ప్రధాన జంక్షన్ల వద్ద రోడ్డును వేయకుండా నిలిపివేయడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Updated Date - May 03 , 2024 | 12:16 AM