Share News

జగన్‌కు ఓటు అడిగే నైతిక హక్కులేదు

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:12 AM

‘సీఎం జగన్‌.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయి. వైసీపీ పాలనలో ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేరలేదు. అందుకే రాష్ట్ర ప్రజలకు ఓటు అడిగే నైతిక హక్కు సీఎం జగన్మోహన్‌రెడ్డికి లేదు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

జగన్‌కు ఓటు అడిగే నైతిక హక్కులేదు
అచ్చెన్నాయుడుతో కరచాలనం చేస్తున్న మహిళలు

- వారి హామీలు గాలిలో కలిశాయి

- వచ్చే ఎన్నికల్లో వైసీపీని సాగనంపుదాం

- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

టెక్కలి/నందిగాం, జనవరి 29: ‘సీఎం జగన్‌.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయి. వైసీపీ పాలనలో ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేరలేదు. అందుకే రాష్ట్ర ప్రజలకు ఓటు అడిగే నైతిక హక్కు సీఎం జగన్మోహన్‌రెడ్డికి లేదు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సోమవారం నందిగాం మండలం మర్లపాడు, కవిటిఅగ్రహారం గ్రామాల్లో ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ’ కార్యక్రమాలను నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి అచ్చెన్న.. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను, టీడీపీ ఎన్నికల మెనిఫెస్టోను వివరించారు. ‘2019లో ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి అన్ని వర్గాలను ముంచేశారు. దేశంలో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పేరు చెబితే ప్రజలు అసహ్యించే పరిస్థితికి. తీసుకువచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి వందేళ్లు వెనక్కి వెళ్లిపోయింది. మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చి.. చివరకు ఆయనే మద్యం తయారుచేయిస్తున్నారు. నాసిరకం మద్యం తాగి రాష్ట్రంలో 30వేల మంది చనిపోయారు. ఐదేళ్లలో తొమ్మిదిసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారు. నాలుగున్నరేళ్లలో రూ.14లక్షల కోట్లు ఖర్చు చేశామని, అందులో రూ.2లక్షల కోట్లు బటన్‌ నొక్కి ప్రజలకు అందజేశామని చెబుతున్నారు. మిగిలిన రూ.12లక్షల కోట్లు ఏమయ్యాయి?’ అని అచ్చెన్న ప్రశ్నించారు. స్థానిక సంస్థలు, పంచాయతీలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వైసీపీని సాగనంపాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో 160 స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్‌, మళ్ల బాలకృష్ణ, పోలాకి చంద్రశేఖర్‌, కొల్లి హరిబాబు, కొన్ని ప్రసాద్‌, మహేష్‌, మదన్‌గౌడ్‌, జీరు మోహనరావు, బంగారు బారికి, శివ, జనసేన నాయకులు చిరంజీవి, పల్ల బాలకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:12 AM