Share News

పూడిలంకకు దారేదీ?

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:12 AM

వజ్రపుకొత్తూరు మండలం పూడిజగన్నాఽథపురం పంచాయతీ పరిధి పూడిలంక గ్రామస్థులకు ఏళ్ల తరబడి రహదారి సమస్య పరిష్కారం కావడం లేదు.

పూడిలంకకు దారేదీ?
ఉప్పుటేరు వరద ఉధృతికి కొట్టుకుపోయిన నడకదారి

- ఏళ్ల తరబడి జలదిగ్బంధంలోనే..

- వర్షాకాలంలో రాకపోకలు బంద్‌

- టీడీపీ హయాంలో కొంతమేర రహదారి పనులు

- ఎన్నికల హామీని నెరవేర్చని వైసీపీ నేతలు

- గ్రామస్థులకు తప్పని ఇబ్బందులు

(వజ్రపుకొత్తూరు)

గ్రామం చుట్టూ ఉప్పుటేరు. రోడ్డు సౌకర్యం లేదు. వర్షం పడితే బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయి.. గ్రామస్థులంతా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. టీడీపీ హయాంలో రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టగా ఎన్నికలు సమీపించడంతో పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. పక్కా రోడ్డు నిర్మిస్తామని వైసీపీ నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చినా.. అధికారంలోకి వచ్చిన దాని ఊసే లేదు. దీంతో తమకు ఏళ్ల తరబడి కష్టాలు తప్పడం లేదంటూ పూడిలంక వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి దారి చూపాలంటూ అధికారులు, పాలకులను వేడుకుంటున్నారు.

..............

వజ్రపుకొత్తూరు మండలం పూడిజగన్నాఽథపురం పంచాయతీ పరిధి పూడిలంక గ్రామస్థులకు ఏళ్ల తరబడి రహదారి సమస్య పరిష్కారం కావడం లేదు. ఈ గ్రామంలో 50కి పైగా ఇళ్లు ఉన్నాయి. 250మంది జనాభా. 100 ఏకరాల పంట పొలాలు ఉన్నాయి. నిత్యం వీరు రకరకాల కూరగాయాలు పండిస్తూ చుట్టుప్రక్కల గ్రామాల్లో విక్రయించి జీవనం సాగిస్తున్నారు. గ్రామం చుట్టూ ఉప్పునీరు పారుతుంది. వర్షాకాలంలో ఉప్పునీరు ఉధృతి పెరిగి గ్రామం జలదిగ్బంధం అవుతుంది. గ్రామస్థులకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అలా కొన్ని రోజులపాటు వారు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. వైద్యం, ఇతర అత్యవసర సేవలు కూడా పొందక అనేక ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. వందల ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా.. నేటికీ రహదారి మోక్షం లభించడం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పల్లివూరు జంక్షన్‌ నుంచి పూడిలంక గ్రామానికి రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అప్పటి ఎమ్మెల్యే గౌతు శివాజీ రూ.1.30 కోట్లు నిధులతో పనులు చేయించారు. ఇంతల్లో సార్వత్రిక ఎన్నికలు రావడంలో రోడ్డు పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. గ్రామానికి పక్కా రోడ్డు నిర్మిస్తామని వైసీపీ నాయకులు ఎన్నికల్లో హామీ ఇచ్చినా నేటికి ఎలాంటి పనులు చేపట్టలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాలిబాట కోతకు గురవడంతో.. ఈ రహదారిపై నడవడం కత్తిమీద సాములా ఉందని వాపోతున్నారు. పొరపాటున కాలు జారితే ఉప్పుటేరులో కొట్టుకుపోవాల్సిందేనని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పక్కా రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

టీడీపీ హయాంలోనే అభివృద్ధి

టీడీపీ హయాంలోనే పూడిలంక గ్రామానికి కొంతమేర అభివృద్ధి చేశారు. గ్రామానికి నడక దారి కోసం అప్పట్లో రూ.10లక్షల నిధులు మంజూరు చేశారు. అత్యవసర సమయంలో నీటిలో రాకపోకల కోసం మరబోటు అందించారు. మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ ఆధ్వర్యంలో రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. గ్రామానికి పక్కా రోడ్డు నిర్మిస్తామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చినా.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కనీసం మధ్యలో నిలిచిన పనులు పూర్తిచేసినా.. రహదారి సమస్య కొంతమేర పరిష్కారమయ్యేది.

- తిమ్మల కృష్ణారావు, మాజీ సర్పంచ్‌

...............

ప్రతిపాదననలు పంపించాం

పల్లివూరు జంక్షన్‌ నుంచి పూడిలంక వరకు రహదారి నిర్మాణానికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైతే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం.

- రామకృష్ణ, డీఈ, పంచాయతీరాజ్‌

Updated Date - Jan 30 , 2024 | 12:12 AM