రిమ్స్‌లో అంబులెన్స్‌కు చోటేదీ?
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:56 PM
శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్-రిమ్స్)కి రోజూ వేలాది మంది రోగులు వస్తుంటారు. జిల్లా నలుమూలల నుంచి ప్రాణాపాయస్థితిలో ఉన్న కేసులు, మెరుగైన వైద్యసేవలు అవసరమైన రోగులను నిత్యం ప్రభుత్వ, ప్రైవేటు అంబులెన్స్‌ల ద్వారా ఈ ఆస్పత్రికి తీసుకు వస్తుంటారు.

- ప్రైవేటు వాహనాలతో అడ్డగోలు పార్కింగ్
- చోద్యం చూస్తున్న అధికారులు
అరసవల్లి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్-రిమ్స్)కి రోజూ వేలాది మంది రోగులు వస్తుంటారు. జిల్లా నలుమూలల నుంచి ప్రాణాపాయస్థితిలో ఉన్న కేసులు, మెరుగైన వైద్యసేవలు అవసరమైన రోగులను నిత్యం ప్రభుత్వ, ప్రైవేటు అంబులెన్స్‌ల ద్వారా ఈ ఆస్పత్రికి తీసుకు వస్తుంటారు. ఇటువంటి సీరియస్ కండిషన్‌లో ఉన్నవారికి ప్రతీ నిమిషం చాలా విలువైనదే. రోగి ప్రాణాలు నిలబడాలంటే సకాలంలో ఆస్పత్రికి తీసుకువచ్చి.. వైద్యసేవలు అందజేయాలి. కానీ రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో ఇటువంటి అత్యవసర, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు తీసుకువచ్చే అంబులెన్స్‌లు పార్కింగ్ చేయడానికే చోటు లేని పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి ఎదుట ఆటోలు, ద్విచక్ర వాహనాలు అడ్డగోలుగా పార్కింగ్ చేస్తున్నారు. దీంతో అంబులెన్స్‌లు ఆస్పత్రి వద్దకు నేరుగా చేరుకోవడానికి అవకాశం లేని పరిస్థితి నెలకొంది. ఇలా అయితే ఆస్పత్రిలోకి రోగి ఎలా తీసుకెళ్లగలమని సంబంధిత బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు, ఆస్పత్రి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది నిత్యం ఈ పరిస్థితిని చూస్తున్నా సరే.. పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను సకాలంలో ఆస్పత్రి లోపలకి తీసుకువెళ్లే అవకాశం లేకపోతే.. చికిత్స అందేలోగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రిమ్స్ ఆసుపత్రి వద్ద ట్రాఫిక్/పార్కింగ్ సమస్యను పరిష్కరించి రోగుల ప్రాణాలు కాపాడాలని పలువురు కోరుతున్నారు.