Share News

అంతా ఆ అధికారి కోసమేనా?

ABN , Publish Date - May 31 , 2024 | 12:04 AM

అది వివాదంలో ఉన్న భూమి అయితే చాలు.. డి.పట్టా, అసైన్డ్‌ భూమి అయినా సరే.. కొందరు బ్రోకర్లు ఇట్టే అక్కడ వాలిపోతున్నారు. అవి రూ.కోట్లు విలువ చేసే భూములైనా రూ.లక్షలకు కొనుగోలు చేస్తున్నారు.

అంతా ఆ అధికారి కోసమేనా?
డి.పట్టా భూముల కొనుగోలు జరిగిన భోగాపురం మండలంలోని బసవపాలెం గ్రామం

అది వివాదంలో ఉన్న భూమి అయితే చాలు.. డి.పట్టా, అసైన్డ్‌ భూమి అయినా సరే.. కొందరు బ్రోకర్లు ఇట్టే అక్కడ వాలిపోతున్నారు. అవి రూ.కోట్లు విలువ చేసే భూములైనా రూ.లక్షలకు కొనుగోలు చేస్తున్నారు. కొంత అడ్వాన్స్‌ ఇచ్చి ఒప్పంద పత్రాలు రాయించుకుంటున్నారు. సమయం చూసుకుని రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకుంటున్నారు. ఇందుకు కొందరు జిల్లా అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఓ ఉన్నతాధికారి మేలు కోసం ఇదంతా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
-(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామంలో ఓ రైతుకు ఎకరా డి.పట్టా భూమి ఉంది. ఇది వంశ పారంపర్యంగా వస్తోంది. అయితే ఆ భూ యజ మాని కుటుంబీకులు కొన్ని దశాబ్దాలుగా అదే గ్రామంలోని కొందరికి అప్పగించి సాగు చేయిస్తు న్నారు. అయితే వారు ఇప్పుడు ఆ భూమి తమదేనని వాదిస్తున్నారు. దీంతో వారివురి మధ్య కొంత కాలంగా తగాదా నడుస్తోంది. అయితే ఏడాది నుంచి భోగాపురం విమానాశ్రయం చుట్టుపక్కల డి.పట్టా భూములను కొనుగోలు చేసే ముఠా తిరుగుతోంది. కొందరు రాష్ట్రస్థాయి పెద్దల కోసం వారు బ్రోకర్లుగా మారి భూములు కొనుగోలు చేస్తున్నారు. డి.పట్టా ఉన్న కొప్పెర్ల గ్రామ రైతును కూడా ఈ బ్రోకర్ల ముఠా సంప్ర దించింది. వివాదం తాము చూసుకుంటా మన్నారు. ఎకరా కోటి రూపాయలు విలువగల భూమిని తక్కువ ధరకే అమ్మకం ఒప్పందం పత్రం రాయించుకున్నారు. అడ్వాన్సుగా కొంత మొత్తాన్ని ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని రిజిస్ట్రేషన్‌ రోజున ఇవ్వాలన్నది ఒప్పందం. ఇంతలో డి.పట్టా భూముల కుంభకోణం డొంక కదిలింది.
ఫ భోగాపురం మండలం బసవపాలెం గ్రామానికి చెందిన ఓ రైతుకు 90 సెంట్ల డి.పట్టా భూమి ఉంది. వర్షాధారం కావటం... పంట దిగుబడులు సక్రమంగా రాని కారణంగా నష్టం వస్తోంది. దీంతో ఆ రైతు సాగు చేయడంలేదు. దీన్ని బ్రోకర్లు గుర్తించారు. డి.పట్టా భూమిని అమ్మితే ఎకరానికి రూ.15 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చి ఒప్పంద పత్రాన్ని రాయించుకున్నారు. రిజిస్ట్రేషన్‌కు భోగాపురం రావాలని భూ యజమానికి కబురు పెట్టారు. ఇంతలో డి.పట్టా భూముల కుంభ కోణం వ్యవహారం తెరపైకి వచ్చింది. తాత్కాలికంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వాయిదా పడింది.
విజయనగరం జిల్లాలో డి.పట్టా భూముల కొను గోలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. జాతీయ రహదారిని అనుకుని ఉండటం.. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం వస్తున్న కారణంగా భూముల రేట్లు కోట్లకు పడగలెత్తుతు న్నాయి. దీనిని గుర్తించిన కొందరు అధికార పెద్దలు డి.పట్టా భూములపై పడ్డారు. ప్రభుత్వంలోని ఓ ఉన్నతస్థాయి అధికారికి మేలు చేకూర్చేందుకు కొందరు దిగువ స్థాయి అధికారులు సైతం చక్కగా అక్రమాలకు చేయూత అందిస్తున్నారు. అలాగే కొంతమంది అధికార పార్టీ నేతలు కూడా డి.పట్టా భూములపై గద్దల్లా వాలిపోతున్నారు. దీనికి కారణం 20 ఏళ్ల క్రితం అందించిన డి.పట్టా భూములను అమ్ముకునేందుకు వీలుగా పూర్తి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం గతేడాది డిసెంబరు 19న జీవో నెంబరు 596ని జారీ చేయడమే. అయితే ఈ జీవో విడుదలకు ముందే కీలక ప్రజాప్రతి నిధులు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఈ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు బ్రోకర్లను రంగం లోకి దింపినట్లు సమాచారం. కీలక అధికారులు విశాఖ లో మకాం వేసి బ్రోకర్ల ద్వారా డి.పట్టా భూముల కొనుగోలుకు తెగపడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని భూములు వివాదాస్పదంగా ఉన్నా వాటి తాము చూసుకుంటామంటూ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇలా వందలాది ఎకరాల భూములకు అడ్వాన్సులు అందించారు. కొన్ని భూములను బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు కూడా చేసినట్లు సమాచారం.
ఫ పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామం జాతీయ రహదారిని అనుకుని ఉంది. ఇక్కడ భూములు ప్రస్తుతం ఎకరం రూ.4-5 కోట్లు పలుకుతున్నాయి. కానీ డి.పట్టా భూములు కావటంతో రూ.లక్షల్లోనే చెల్లించి బ్రోకర్లు స్వాధీనం చేసుకుంటున్నారు. కొప్పెర్ల, కనిమెట్ట, కనిమెర్ల, చౌడువాడ ప్రాంతాల్లో ఈ వ్యవహారం అధికంగా జరిగినట్లు సమాచారం. అలాగే భోగాపురం మండలం ముంజేరు, బసవపాలేం, పోలిపల్లి గ్రామాల పరిధిల్లోని డి.పట్టా భూములను కూడా బ్రోకర్లు కొనుగోలు చేశారు. చాలావరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేసినట్లు తెలిసింది.
అధికారుల సహకారం..
డి.పట్టా భూములు, అసైన్డ్‌ భూములు 20ఏళ్ల క్రితమే ఇచ్చామని జిల్లా ఉన్నతాధికారులు ప్రీ హోల్డ్‌ చేస్తేనే రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారికి మేలు చేకూర్చేందుకు జిల్లా అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. బ్రోకర్ల ద్వారా కొనుగోలు చేసిన, అడ్వాన్స్‌ ఇచ్చి ఒప్పంద పత్రం ఉన్న భూములను ప్రీ హోల్డ్‌ చేసి (నిషేధిత జాబితా నుంచి తొలగించడం) రిజిస్ట్రేషన్లు అయ్యేలా అధికారులు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 1.20లక్షల ఎకరాల వరకు డి.పట్టా, అసైన్డ్‌ భూములున్నట్లు అంచనా. డి.పట్టా భూముల వివరాలు రెవెన్యూ అధికార యంత్రాంగం వద్ద ఉన్నా వాటిని బయట పెట్టడం లేదు. డి.పట్టా, అసైన్డ్‌ ఎన్ని ఎకరాలు? 20 ఏళ్లు దాటినవి ఎన్ని ఎకరాలు? అన్న వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు. కానీ ఈ వివరాలను కీలక ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు మాత్రం అందిస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితే అందరి గుట్టు బయటపడే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.
ఇటీవల జిల్లాకు ఉన్నతాధికారి..
ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఈ నెలలోనే జిల్లాకు వచ్చారు. అధికార యంత్రాంగం అంతా ఎన్నికల విధుల్లో తలమునకలై ఉంది. ఇటు ప్రజా ప్రతినిధులు కూడా తమ భవితవ్యం ఏమిటి? అన్న టెన్షన్లో ఉన్నారు. ఈ దశలో ఆ అధికారి రహస్యంగా జిల్లాకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. డి.పట్టా భూముల లావాదేవీలను చూసేందుకే వచ్చారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

Updated Date - May 31 , 2024 | 12:04 AM