Share News

సాగునీటి ప్రాజెక్టు సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:19 AM

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు సంఘాల ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా, ప్రశాంతంగా ముగిశాయి. శ్రీకాకుళంలోని ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ ఎన్నికలను వంశధార ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరు పర్యవేక్షించారు.

సాగునీటి ప్రాజెక్టు సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం
చైర్మన్‌, వైస్‌చైర్మన్లకు నియామక పత్రాలు అందజేస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట, చిత్రంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌, కూటమి నేతలు

- రైతులకు సకాలంలో నీరందించేదుకు కృషి చేయాలి

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట, ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి/ శ్రీకాకుళం అర్బన్‌, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు సంఘాల ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా, ప్రశాంతంగా ముగిశాయి. శ్రీకాకుళంలోని ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ ఎన్నికలను వంశధార ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరు పర్యవేక్షించారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, సాగునీటి ప్రాజెక్టుల సంఘాలకు చైర్మన్‌, వైస్‌చైర్మన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బి.ఆర్‌.వంశధార ప్రాజెక్టుకు చైర్మన్‌గా నైరాకు చెందిన అరవల రవీంద్రబాబు, వైస్‌ చైర్మన్‌గా ఎల్‌.ఎన్‌.పేట మండలానికి చెందిన ఆనందరావు ఎంపికయ్యారు. అలాగే టీపీఆర్‌ నారాయణపురం ప్రాజెక్టు చైర్మన్‌గా సనపల ఢిల్లేశ్వరరావు, వైస్‌ చైర్మన్‌గా పొన్నాడకు చెందిన పంచిరెడ్డి కృష్ణారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌.. ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు. రైతులకు సకాలంలో నీరందించేందుకు కృషి చేయాలని వారు సూచించారు. కాలువల ఆధునికీకరణకు చర్యలు తీసుకోవాలని, అందుకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కింజరాపు హరివరప్రసాద్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, పలువురు నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.

కాలువల అభివృద్ధే లక్ష్యం

ఆమదాలవలస: జిల్లాలోని నాగావళి, వంశధార నదుల పరిధిలో సాగునీటి కాలువల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన ప్రాజెక్టుల చైర్మన్లు అరవల రవీంద్రబాబు, సనపల ఢిల్లీశ్వరరావు తెలిపారు. తమను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కృషి చేసిన కూటమి నేతలకు, రైతులకు కృతజ్ఞతలు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు కూన రవికుమార్‌, గొండు శంకర్‌తోపాటు ఎమ్మెల్యేలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Dec 22 , 2024 | 12:19 AM