Share News

కేంద్ర కేబినెట్‌లోకి.. సిక్కోలు సింహం

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:52 PM

సిక్కోలు సింహంగా.. జిల్లావాసులు, అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడును కేంద్రమంత్రి పదవి వరించింది. ఆదివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రామ్మోహన్‌నాయుడు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎర్రన్న వారసత్వాన్ని అందుకుని.. రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌నాయుడు దశాబ్దకాలంలో కేంద్రమంత్రి హోదాకు ఎదగడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర కేబినెట్‌లోకి.. సిక్కోలు సింహం

- కేంద్రమంత్రిగా కింజరాపు రామ్మోహన్‌నాయుడు

- ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయ రంగంలోకి ప్రవేశం

- వరుసగా మూడుసార్లు ఎంపీగా విజయకేతనం

- దశాబ్దకాలంలోనే కేంద్రమంతి హోదా

- పార్టీ శ్రేణులు, అభిమానుల్లో హర్షం

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం/టెక్కలి)

కింజరాపు రామ్మోహన్‌నాయుడు.. రాజకీయాల్లో యూత్‌ ఐకాన్‌. ఈ 36ఏళ్ల యువకుడు పార్లమెంట్‌లో జీరో అవర్‌లో కానీ, ప్రశ్నావళిలో కానీ ఏ అంశం గురించి మాట్లాడినా ఓ సంచలనమే. పార్లమెంట్‌లో రామ్మోహన్‌నాయుడు గళం విప్పారంటే.. అందరిచూపు ఆయన వైపే. జాతీయ, అంతర్జాతీయ అంశాలు, రాష్ట్రానికి చెందిన హక్కులు, ప్రభుత్వ వైఫల్యాలు.. ఇలా అన్నింటాపైనా పార్లమెంట్‌లో ప్రస్తావిస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఇప్పటివరకూ ఓటమి ఎరుగని నాయకుడిగా దూసుకుపోతున్నారు. జిల్లావాసులు పార్టీలకు అతీతంగా మూడుసార్లు ఎంపీగా ఆయన గెలిపించారు. హ్యాట్రిక్‌ సాధించిన రామ్మోహన్‌ను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా గుర్తిస్తూ.. మంత్రి పదవి కట్టబెట్టడంతో పార్టీ శ్రేణులు, అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవు తున్నాయి.

.......................

సిక్కోలు సింహంగా.. జిల్లావాసులు, అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడును కేంద్రమంత్రి పదవి వరించింది. ఆదివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రామ్మోహన్‌నాయుడు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎర్రన్న వారసత్వాన్ని అందుకుని.. రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌నాయుడు దశాబ్దకాలంలో కేంద్రమంత్రి హోదాకు ఎదగడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- టీడీపీ సీనియర్‌ నాయకుడు తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు 2012 నవంబరు 2న రణస్థలంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో ఎర్రన్న వారసుడిగా రామ్మోహన్‌నాయుడు రాజకీయ ప్రయాణం మొదలైంది. 2013లో జిల్లా అంతటా సైకిల్‌యాత్ర చేపట్టి నిస్తేజంలో ఉన్న కార్యకర్తలను, నాయకులను ఉత్సాహవంతులను చేశారు. ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకుని.. వారికి భరోసా కల్పించారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్‌కు టీడీపీ అభ్యర్థిగా మొదటిసారి పోటీచేసి 1,27,692 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్లమెంట్‌లో జిల్లా ప్రజలతోపాటు తెలుగు రాష్ట్రాల సమస్యలను ప్రస్తావిస్తూ.. అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. 2019లో 6,653 ఓట్లు మెజార్టీ సాధించారు. శ్రీకాకుళం పార్లమెంట్‌ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ఐదు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అయినప్పటికీ క్రాస్‌ ఓటింగ్‌ ద్వారా ఎంపీ రామ్మోహన్‌నాయుడు రెండోసారి గెలవడం చర్చనీయాంశమైంది. తాజాగా ఈసారి ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి.. 3,14,107 ఓట్ల మెజార్టీతో హాట్రిక్‌ విజయం దక్కించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు బాబాయి.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రోత్సాహంతో రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్‌లో ఓ ఐకాన్‌గా గుర్తింపు పొందిన రామన్న.. ఈ పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ వెనుదిరిగి చూడలేదు. పార్టీలకు అతీతంగా.. ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటూ.. అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఎంపీగా హ్యాట్రిక్‌ విజయం సాధించడంతో.. చంద్రబాబు సూచన మేరకు రామ్మోహన్‌నాయుడుకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది.

- పార్లమెంట్‌లో ముందుగా ప్రకటించినట్టుగానే..

గతేడాది పార్లమెంట్‌లో రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు ప్రస్తావించేందుకు కొన్ని నిముషాలు సమయం కావాలని స్పీకర్‌ను కోరారు. చాలా తక్కువ సమయం ఇవ్వడంతో.. వచ్చేదఫా టీడీపీ నుంచి అధికమంది పార్లమెంట్‌ సభ్యులుగా బంపర్‌మెజార్టీతో వస్తారని.. అప్పుడు అడిగినంత సమయం ఇస్తారని కూడా స్పీకర్‌తో రామ్మోహన్‌నాయుడు అన్నారు. అలా అన్నట్లుగానే ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది.

- అన్ని భాషలపై పట్టు...

రామ్మోహన్‌నాయుడు యూఎస్‌ఏలో పుర్డ్యూ యూనివర్శిటీలో బీ-టెక్‌ పూర్తిచేశారు. న్యూయార్క్‌లో ఐలాండ్‌ యూనివర్శిటీలో ఎంబీఏ చదివారు. తండ్రి మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తనకు లభించిన ఎంపీ పదవిని సద్వినియోగం చేసుకుని జిల్లా ప్రజలవాణిని.. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించి వీలైనంత వరకు పరిష్కారానికి కృషిచేశారు. అన్ని భాషలపై అనర్గళంగా పార్లమెంట్‌లో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

- జిల్లా నుంచి మూడో వ్యక్తి..

జిల్లాకు సంబంధించి కేంద్ర మంత్రి పదవి పొందినవారిలో రామ్మోహన్‌నాయుడు మూడో వ్యక్తి. 1996లో నేషనల్‌ ఫ్రంట్‌ సర్కార్‌లో టీడీపీ భాగస్వామ్యం కావడంతో.. జిల్లాకు మొదటిసారిగా కింజరాపు ఎర్రన్నాయుడుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవి దక్కింది. ఆతర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కిల్లి కృపారాణికి కేంద్రమంత్రి పదవి లభించింది. తాజాగా ఎన్డీయే సర్కార్‌లో టీడీపీ భాగస్వామ్యం కావడంతో.. ఎర్రన్న కుమారుడు రామ్మోహన్‌నాయుడుకు కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కింది. ఇదిలా ఉండగా.. ఎన్డీయే.. టీడీపీ భాగస్వామ్యంతో ఉత్తరాంధ్రకు అత్యంత ప్రాధాన్యం లభిస్తూనే ఉంది. గతంలో ఎర్రన్నకు కేంద్ర మంత్రి పదవి లభించింది. తర్వాత 2014లో విజయనగరం నుంచి అశోక్‌గజపతిరాజుకు కేంద్రమంత్రిగా అవకాశం దక్కింది. తాజాగా రామ్మోహన్‌నాయుడు కూడా కేంద్రమంత్రి హోదా దక్కడంతో సిక్కోలుతోపాటు ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందనుందని పలువురు భావిస్తున్నారు.

ఈ పదవి నా ఒక్కరిది కాదు.. రాష్ట్ర ప్రజలది

కేంద్రమంత్రిగా అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఆనందానికి కారణం నా తండ్రి స్వర్గీయ ఎర్రన్నాయుడు ఆశీర్వాదమే. నాన్న చనిపోయిన తరువాత నన్ను అక్కున చేర్చుకొని వెన్నుతట్టిన అధినాయకుడు చంద్రబాబునాయుడు, లోకేష్‌ అన్న, పవన్‌కల్యాణ్‌, ప్రధాని మోదీ, బాబాయి అచ్చెన్నాయుడు ప్రోత్సాహం మరువలేనిది. నా తల్లి, నా భార్య త్యాగాలు మూడుసార్లు నన్ను గెలిపించేందుకు కారణమయ్యాయి. నన్ను ఆదరించిన జిల్లా ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసికట్టుగా ఈ ఎన్నికల్లో పనిచేసి హిస్టారికల్‌ విక్టరీ అందజేశారు. చంద్రబాబు, మోదీ నేతృత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పదవి నా ఒక్కరిది కాదు.. రాష్ట్ర ప్రజలది. ప్రజలకు ఇచ్చిన హామీలు.. మేనిఫెస్టో అమలుచేస్తూ శక్తివంచన లేకుండా కృషిచేస్తాం. దేశంలో నెంబర్‌-1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతాం.

కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, కేంద్రమంత్రి

Updated Date - Jun 09 , 2024 | 11:52 PM