Share News

organ donation: మరణిస్తూ.. పునర్జన్మనిచ్చి..

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:53 PM

organ donation జిల్లా ప్రజలు అవయ వదానానికి ముందుకు వస్తున్నారు. కొంతమంది మరణిస్తూ.. కుటుంబ సభ్యుల అంగీకారంతో చేసిన అవయవదానం.. ఎంతోమందికి పునర్జన్మనిస్తోంది. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది.

organ donation: మరణిస్తూ.. పునర్జన్మనిచ్చి..
అవయవదాత మృతదేహానికి వైద్యులు, అధికారుల నివాళి

  • మరణిస్తూ.. పునర్జన్మనిచ్చి..

  • జిల్లాలో పెరుగుతున్న అవయవదాతలు

  • స్వచ్ఛందంగా ముందుకొస్తున్న బాధిత కుటుంబ సభ్యులు

  • ‘జీవన్‌దాన్‌’ ద్వారా అవయవాల తరలింపు

  • ఎంతోమంది జీవితాల్లో వెలుగులు

  • రణస్థలం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):

  • ఈ నెల 26న మందసకు చెందిన కొంకి జోగారావు అనే విద్యుత్‌ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే శ్రీకాకుళంలో ఆస్పత్రికి తరలించగా ఆయన బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు వైద్యులు గుర్తించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించగా, వారు అవయవదానానికి ఒప్పుకున్నారు. దీంతో జోగారావు శరీరంలో అవయవాలను సేకరించారు. అతని గుండెను చెన్నై ఎంజీఎంకు, ఒక కిడ్నీని వైజాగ్‌ మెడికవర్‌కు, మరో కిడ్నీని విశాఖపట్నం కిమ్స్‌కు, ఊపిరితిత్తులు హైదరాబాద్‌ కిమ్స్‌కు గ్రీన్‌చానల్‌ ద్వారా తరలించారు. పుట్టెడు దుఃఖంలోనూ కుమారుడి అవయవదానానికి అంగీకరించిన.. జోగారావు తండ్రి మలేశ్వరరావును, కుటుంబ సభ్యులను అధికారులు అభినందించారు.

  • ఈ ఏడాది మే 16న గార మండలం కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన పుష్ప సుశీల, మే 17న శ్రీకాకుళం నగరానికి చెందిన తోట శ్రీనివాసరావు వేర్వేరు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. వారిని కుటుంబ సభ్యులు రాగోలులోని జెమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు నిర్ధారించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదా నానికి ఒప్పించారు. సుశీల, శ్రీనివాసరావు మృతదేహాల నుంచి మూత్రపిండం, కాలేయాన్ని సేకరించి విశాఖ తరలించారు.

  • ఈ ఏడాది ఆగస్టు 17న లావేరు మండలం అదపాక గ్రామానికి చెందిన దుక్క భాస్కరరావు అనే పెయింటర్‌, అక్టోబరు 22న సోంపేటకు చెందిన జగదీష్‌ అనే యువకుడు ప్రమాదాలకు గురై బ్రెయిన్‌ డెడ్‌ అయ్యారు. అవయవదానంపై వారి తల్లిదండ్రులకు వైద్యులు అవగాహన కల్పించారు. అవయవదానం గొప్పతనాన్ని వివరించారు. దీంతోవారు అంగీకరించడంతో భాస్కరరావు, జగదీష్‌ మృతదేహాల నుంచి నేత్రాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం వంటివి సేకరించి గ్రీన్‌ చానల్‌ ద్వారా విశాఖ, చెన్నైకి తరలించారు. వాటిని మరికొందరికి అమర్చారు.

  • గత ఏడాది ఏప్రిల్‌ 13న సోంపేటలో మల్లారెడ్డి కిరణ్‌చంద్‌ అనే బాలుడు పదో తరగతి పరీక్షలు రాస్తూ కేంద్రంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు హుటాహుటిన రాగోలులో జెమ్స్‌కు తరలించారు. అదే నెల 16న ఆయన బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో కుటుంబసభ్యుల సమ్మతి మేరకు వైద్యులు బాలుడి అవయవాలను సేకరించి గ్రీన్‌చానల్‌ ద్వారా వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. దీంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు ఆ బాలుడు.

  • ...ఇలా జిల్లా ప్రజలు అవయ వదానానికి ముందుకు వస్తున్నారు. కొంతమంది మరణిస్తూ.. కుటుంబ సభ్యుల అంగీకారంతో చేసిన అవయవదానం.. ఎంతోమందికి పునర్జన్మనిస్తోంది. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. కొంతమంది ప్రమాదాల బారిన పడిన సమయాల్లో బ్రెయిన్‌డెడ్‌కు గురవుతున్నారు. అటువంటి వారి అవయవాలను కుటుంబ సభ్యుల సమ్మతితో దానం చేస్తే.. ఎంతోమందికి ప్రాణదాతగా నిలవచ్చు. ఒక వ్యక్తి అయవదానంతో ఎనిమిది మంది బతుకుల్లో వెలుగులు నింపవచ్చు. అవయవాలన్నీ సరిగ్గా ఉంటేనే అది సాధ్యపడుతుంది. బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి నుంచి కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, కవటాలు, పేగులు, క్లోమం, కార్నియా వంటివి సేకరించి మరొకరికి అమర్చవచ్చు. జీవించి ఉన్న వ్యక్తుల నుంచి మూత్రపిండాలు, ఎముకలోని మూలుగు, కాలేయంలోని కొంత భాగం దానం చేయవచ్చు. జీవన్‌దాన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వమే గ్రీన్‌చానల్‌ ద్వారా అవయవాలను తరలించే ఏర్పాటు చేస్తోంది. అందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు అధికారులు, వైద్యులు కృషి చేయాల్సి ఉంది.

  • ప్రత్యేక చట్టాలు..

    అవయవదానానికి సంబంధించి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాయి. 1994లో తొలిసారిగా మనదేశంలో అవయవ, కణాల మార్పిడి చట్టాన్ని తీసుకొచ్చారు. 2011లో దానికి సవరణలు చేశారు. అవయవాల సేకరణ, తరలింపు, కేటాయింపు వంటిని జాతీయస్థాయిలో జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్‌ఓటీటీవో) పర్యవేక్షిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జీవన్‌ దాన్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ వంటి సంస్థలు బాధ్యతలను చూస్తున్నాయి. దశాబ్దాలుగా మెరుగైన సేవలందిస్తున్నాయి.

  • పెరిగిన అవగాహన కార్యక్రమాలు

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అవయవదాతల కుటుంబాలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. అవయవదాత అంత్యక్రియలకు కలెక్టర్‌ లేదా ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. అంత్యక్రియ ఖర్చులకు రూ.10వేలు కూడా అందిస్తోంది. అవయవాల తరలింపునకు వీలుగా గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని మార్గాలను సైతం ఎంపిక చేసింది. జిల్లాలో అవయవదానంపై విస్తృత అవగాహన పెరగాల్సి ఉంది. మరణం తరువాత అవయవదానం చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు అంతా ముందుకొస్తే ప్రజల్లో కూడా అవగాహన పెరిగే అవకాశముంది. జిల్లాలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ అవయవదానంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూ ఒప్పంద పత్రాలను సేకరిస్తోంది.

  • ప్రభుత్వం సహకరిస్తోంది

    రాష్ట్ర వ్యాప్తంగా అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం దీనికి ఎంతగానో సహకరిస్తోంది. సరికొత్త మార్గదర్శకాలు సైతం జారీచేసింది. ప్రజల్లో కూడా చైతన్యం పెరుగుతోంది. రాష్ట్రంలో 4వేల మందికి పైగా అవయవాలు అవసరం ఉంది. జిల్లాలో ఇటీవల అవయవదానానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ముందుకు రావడం శుభ పరిణామం

    - డాక్టర్‌ కె.రాంబాబు, జీవన్‌దాన్‌ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌

Updated Date - Dec 29 , 2024 | 11:53 PM