Share News

ఆ రెండు చోట్ల.. ఎవరికో?

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:39 PM

జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. అభ్యర్థులను మార్పు చేయాలని రెండేళ్లుగా డిమాండ్‌ చేస్తున్న అసమ్మతి నేతలు ఇప్పుడు ఇప్పుడు స్వరం పెంచారు.

    ఆ రెండు చోట్ల.. ఎవరికో?

-ఇప్పటికే ఎచ్చెర్ల అభ్యర్థి మార్పు దాదాపు ఖరారు

-పాతపట్నంలో స్థానికులకే ఇవ్వాలని డిమాండ్‌

-మూడో జాబితాలో ఎవరెవరు మారునున్నారో..?

-అధికార పార్టీ నాయకుల్లో టెన్షన్‌.. టెన్షన్‌

-టీడీపీ-జనసేనకు కలిసొస్తున్న వైసీపీ తప్పిదాలు

‘ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ మాకు వద్దు.. జగన్మోహనరెడ్డి మాత్రమే ముద్దు’.. ఎచ్చెర్లలో అసమ్మతి నేతల డిమాండ్‌ ఇది.

‘స్థానికేతరులకు టికెట్‌ అస్సలు ఇవ్వొద్దు. స్థానికులకే ఇస్తే కలిసి పనిచేస్తాం’.. పాతపట్నంలో వినిపిస్తున్న డిమాండ్‌ ఇది.

ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ మూడో జాబితాను బుధవారం విడుదల చేయనున్నారు. ఈ జాబితాలో వీరి పేర్లు ఉంటాయా? అన్నది సందేహంగా ఉంది. ఇక్కడ ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారోనని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా వైసీపీ సీట్ల విషయంలో గందరగోళం.. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అంశాలు తమకు కలిసొస్తాయని టీడీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి.

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. అభ్యర్థులను మార్పు చేయాలని రెండేళ్లుగా డిమాండ్‌ చేస్తున్న అసమ్మతి నేతలు ఇప్పుడు ఇప్పుడు స్వరం పెంచారు. సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల మార్పు చేస్తూ.. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్‌.. మూడో జాబితాను కూడా బుధవారం విడుదల చేసే అవకాశముంది. ఇందులో ప్రధానంగా ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాలు ఉంటాయని ప్రచారం తీవ్రమైంది.

అక్కడ ఎంపీ.. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా..

ఎచ్చెర్ల నియోజకవర్గం విజయనగరం లోక్‌సభ పరిధిలో ఉంటుంది. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌.. మూడేళ్లుగా జడ్పీ సర్వసభ్య సమావేశాలకు.. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా ‘ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ మాకు వద్దు.. జగన్మోహనరెడ్డి మాత్రమే ముద్దు’ అంటూ జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు నుంచి నియోజకవర్గంలో సైతం నిరసనలు కొనసాగుతున్నాయి. జిల్లాస్థాయి వైసీపీ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స మాట్లాడుతూ.. ‘కిరణ్‌ వద్దు.. జగన్‌ ముద్దు’ వంటి కార్యక్రమాలు చేపట్టవద్దని.. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉండాలని ఆదేశించారు. అయినప్పటికీ నిరసనలు తగ్గలేదు. అయితే విజయనగరం ఎంపీ బెల్లానకు బొత్స అశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఎచ్చెర్ల నుంచి పోటీచేయాలన్నది తన చర్యల ద్వారానే బహిర్గతమైంది. ఇటు ప్రస్తుత ఎమ్యెల్యే గొర్లె కిరణ్‌పై ఆసమ్మతి పెరగడంతో దాదాపు అభ్యర్థి మార్పు తప్పదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్థానానికి బెల్లాన పేరు వినిపిస్తోంది. అయితే బెల్లాన.. ఈ నియోజకవర్గంలో స్థానికేతరుడుగానే ప్రజలకు పరిచయమవుతారు. ఇలాంటి పరిస్థితిల్లో అధికార పార్టీ నిర్ణయం టీడీపీకి కలసివచ్చేలాఉండబోతుంది.

పాతపట్నంలో పెరిగిన నిరసనలు..

పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి.. 2014 ఎన్నికల్లో వైసీపీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. జిల్లా పార్టీ బాధ్యతలు కూడా చూశారు. ఈమె భర్త గతంలో ఉన్నతస్థానంలో అధికారి కావడం.. జగన్‌తో సాన్నిహిత్యంతో టిక్కెట్‌ కేటాయించారు. 2019లో రెడ్డి శాంతి పాతపట్నం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆతర్వాత రెడ్డి శాంతి భర్త అనారోగ్యంతో మృతి చెందారు. ఆతర్వాత జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో సొంత కుమారుడ్ని నిలబెట్టినా అక్కడున్న వ్యతిరేకత వల్ల గెలిపించుకోలేకపోయారు. ప్రస్తుతం అభ్యర్థులను మార్పు చేస్తున్నారన్న కారణంతో అక్కడ అసమ్మతి నాయకుల నిరసనలు జోరందుకున్నాయి. స్థానికేతరులకు టికెట్‌ ఇవ్వొద్దని, స్థానికులకే ఇస్తే గెలిపిస్తామని మంగళవారం నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈవిషయాన్ని విలేకర్ల సమావేశం నిర్వహించిమరీ చెప్పేశారు. దీంతో బుధవారం విడుదలయ్యే మూడో జాబితాలో ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాల బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారో తేలనుంది. దీంతో పాటుగా... ఆమదాలవలస నియోజకవర్గంపై ఉన్న సందిగ్ధత కూడా తేలనుంది. కొద్దిరోజుల క్రితం ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు నాలుగు గ్రూపులు తాడేపల్లి వెళ్లి జగన్‌ను కలిసి స్థానిక పరిస్థితిని వివరించారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ మంగళవారం వెళ్లి సీఎంను కలిశారు. తన కుమారుడికి సీటు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. తాజా పరిస్థితుల కారణంగాను.. అధికారపార్టీ తప్పిదాల వల్ల ప్రత్యక్షంగాను.. పరోక్షంగాను టీడీపీ-జనసేనకు మరింత లాభం చేకూరేలాఉంది. దీనికితోడు ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో జిల్లాలో టీడీపీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 11:39 PM