Share News

పోలీసుస్టేషన్‌ ఆవరణలోనే.. వైసీపీ అరాచకం

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:08 AM

అది కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌ ఆవరణ. పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు. వారి ఎదుటే అధికారపార్టీ నాయకులు రెచ్చిపోయారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. అంతకుముందు మంత్రి సీదిరి సమక్షంలోనే అంగన్‌వాడీ కార్యకర్తపైనా దాడికి తెగబడ్డారు. ఇదేమని ప్రశ్నించిన ఆమె భర్త, కుమారుడిపైనా దౌర్జన్యం చేశారు. పైగా తమపైనే వారు దాడిచేసినట్లు పోలీసుకు ఫిర్యాదు చేశారు.

పోలీసుస్టేషన్‌ ఆవరణలోనే.. వైసీపీ అరాచకం
పోలీసుస్టేషన్‌ ఆవరణలో కొట్లాటకు దిగిన వైసీపీ నాయకులను చెదరగొడుతున్న పోలీసులు, మాట్లాడుతున్న గౌతు శిరీష, పక్కన బాధితురాలు అంగన్‌వాడీ కార్యకర్త అప్పలనర్సమ్మ

- ఇద్దరు టీడీపీ కార్యకర్తలను రక్తమోడేలా కొట్టిన వైనం

- అంతకుముందు అంగన్‌వాడీ కార్యకర్తపైనా దాడి

- ప్రశ్నించిన ఆమె భర్త, కుమారుడుపై కూడా దౌర్జన్యం

- పోలీసుస్టేషన్‌కు వచ్చిన టీడీపీ నాయకురాలు శిరీష

- బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

- మూడురోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్న పోలీసులు

పలాస/రూరల్‌, మార్చి 11:

అది కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌ ఆవరణ. పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు. వారి ఎదుటే అధికారపార్టీ నాయకులు రెచ్చిపోయారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. అంతకుముందు మంత్రి సీదిరి సమక్షంలోనే అంగన్‌వాడీ కార్యకర్తపైనా దాడికి తెగబడ్డారు. ఇదేమని ప్రశ్నించిన ఆమె భర్త, కుమారుడిపైనా దౌర్జన్యం చేశారు. పైగా తమపైనే వారు దాడిచేసినట్లు పోలీసుకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకుల దాష్టీకంపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. పోలీసుస్టేషన్‌లోనే భద్రత లేకపోతే శాంతిభద్రతల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు.

.......................

పలాస మండలం బంటుకొత్తూరుకి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త రాగోలు అప్పలనర్సమ్మను ఐదేళ్లుగా స్థానిక వైసీపీ నాయకులు వేధింపులకు గురి చేస్తున్నారు. భర్త నీలకంఠ టీడీపీ బీసీ కార్యదర్శి కావడమే ఆమె చేసిన నేరం. కొద్దిరోజుల కిందట అంగన్‌వాడీ కేంద్రాన్ని స్థానిక వైసీపీ నేతలు సందర్శించారు. ఆ సమయంలో సొంత పనిపై బయటకువెళ్లిన అప్పలనర్సమ్మ కేంద్రంలో లేరు. దీంతో ఆమెపై వైసీపీ నాయకులు ఫిర్యాదు చేయగా.. విచారణ చేయకుండా అధికారులు నోటీసులు జారీచేశారు. దీనిని ఆమె తప్పుపట్టారు. ఈ క్రమంలో సోమవారం మంత్రి సీదిరి అప్పలరాజుతో సచివాలయ భవనాన్ని వైసీపీ నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అంగన్‌వాడీ కార్యకర్త అప్పలనర్సమ్మ రాగా.. రికార్డులు తీసుకురావాలని వైసీపీ నేతలు ఆదేశించారు. ఈ మేరకు రికార్డులు తెచ్చిన అప్పలనర్సమ్మపై వైసీపీ నాయకులు దాడి చేసి.. అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో ఆమె వైసీపీ నాయకులకు, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముగ్గురు వైసీపీ నాయకులు దాడి చేయడంతో.. ఇదేమి అన్యాయమని ప్రశ్నించిన అప్పలనర్సమ్మ భర్త నీలకంఠ, సాయికిరణ్‌పై కూడా దాడి చేశారు. దీంతో వారంతా పోలీసుస్టేషన్‌కు వచ్చి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు.

- ఇదిలా ఉండగా తమపైనే అంగన్‌వాడి కార్యకర్త కుటుంబం దాడికి దిగిందని బంటుకొత్తూరు సర్పంచ్‌ పిట్ట షణ్ముఖరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనకు సంఘీభావంగా పలాస మండలం, మునిసిపాలిటీకి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకుని టీడీపీ నేతలు కూడా పోలీసుస్టేషన్‌కు చేరుకోవడంతో ఇరువర్గాలూ బయటకు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు. సమస్య సద్దుమణుగుతున్న సమయంలో సాయికిరణ్‌పై వైసీపీ కార్యకర్తలు కర్రలు, క్రికెట్‌ బ్యాట్‌తో పోలీసుల ఎదురుగానే దాడికి దిగడంతో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. మంచినీటి కోసం బయటకు వెళ్లిన చైతన్య అనే టీడీపీ కార్యకర్తపై కూడా వైసీపీ నాయకులు దాడికి దిగడంతో పోలీసులు వారందరినీ వెళ్లిపోవాలని ఆదేశించారు. పోలీసుస్టేషన్‌ వద్దే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. అలాగే స్టేషన్‌ వద్ద కవరేజ్‌కు వెళ్లిన విలేకరులపై పోలీసులు, వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. దీనిపై విలేకరులు సర్దిచెబుతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం.

బాధితులకు అండగా ఉంటాం

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌కు చేరుకుని బాధితులను ఓదార్చారు. బాధితులకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని ఆమె కూడా కన్నీటి పర్యంతమయ్యారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఐ విజయానంద్‌ను కలిసి బాధితులకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అనంతరం విలేకరులతో శిరీష మాట్లాడుతూ.. ‘వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా దాడులు చేసి భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. ఎంపీపీ తండ్రి.. ఎంపీపీ సీటులో కూర్చొని అధికారులకు, పోలీసులకు మేనేజ్‌ చేస్తున్నారు. అధికారదర్పాన్ని ప్రదర్శిస్తూ టీడీపీ నాయకులపై రౌడీయిజం చేస్తున్నారు’ అని ఆరోపించారు. ‘గ్రామంలో ఉద్రిక్తత తలెత్తకుండా రక్షణ కల్పించాలని పోలీసులను కోరాం. మూడురోజుల్లో టీడీపీ కార్యకర్తలతో పాటు అంగన్‌వాడీ కార్యకర్త కుటుంబానికి పోలీసులు న్యాయం చేస్తామన్నారు. లేదంటే పోలీసుస్టేషన్‌ వద్దే ఆందోళన చేస్తామ’ని గౌతు శిరీష స్పష్టం చేశారు. పోరాటం తప్పదని హెచ్చరించారు. ఆమె వెంట రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్‌, లొడగల కామేశ్వరరావుయాదవ్‌, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగరాజు, యవ్వారి మోహనరావు, సప్ప నవీన్‌, ఎ.రామకృష్ణ, సూరాడ మోహనరావు ఉన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:08 AM