తవ్వేస్తున్నారు
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:42 PM
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి ఐదో వార్డు తాళభద్రలోని శ్మశానం పక్కన ఉన్న చెరువులో మట్టి, కంకర అక్రమ తవ్వకాలు జోరందుకున్నాయి. నెల రోజుల నుంచి ఇక్కడ మట్టిని అక్రమార్కులు తవ్వేస్తున్నారు.

తవ్వేస్తున్నారు
- తాళభద్ర చెరువులో మట్టి అక్రమ తరలింపు
- పట్టించుకోని అధికారులు
పలాస, జూలై 28: పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి ఐదో వార్డు తాళభద్రలోని శ్మశానం పక్కన ఉన్న చెరువులో మట్టి, కంకర అక్రమ తవ్వకాలు జోరందుకున్నాయి. నెల రోజుల నుంచి ఇక్కడ మట్టిని అక్రమార్కులు తవ్వేస్తున్నారు. ఇటుక బట్టీలు, భవన నిర్మాణాలకు సంబంధించిన పునాదుల్లో వేసేందుకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ మట్టిలోడుకు రూ.700 వరకూ వసూళ్లు చేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. గ్రామ సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న చెరువులో మట్టి తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత సిబ్బంది చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వైసీపీ పాలనలో చెరువులు, కాలువలు, కొండలు ఏవీ విడిచిపెట్టకుండా.. అనుమతులు లేకుండానే అక్రమ తవ్వకాలు చేపట్టారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటి తవ్వకాలు ఆగిపోతాయని అంతా భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా అధికారుల సెలవు దినాలు, పదోన్నతిలో బిజీగా ఉన్న సమయాలను అక్రమార్కులు తెలుసుకొని యథేశ్ఛగా మట్టిని తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. కొద్ది రోజుల కిందట స్థానిక పెంటిభద్ర రోడ్డులో ఉన్న కుంకుమసాగరం చెరువులో కూడా ఇలాగే తవ్వకాలు చేపట్టారు. ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రాగా.. అధికారులు వాటిపై విచారణ జరపడంతో తవ్వకాలు కొంతమేరకు ఆగాయి. ప్రస్తుతం తాళభద్ర చెరువులో తవ్వకాలు చేపడుతున్నా.. అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మునిసిపల్, రెవెన్యూ, మైన్స్ అధికారుల అనుమతులు లేకపోయినా.. అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై వీఆర్వో కె.ఖగేశ్వరరావు వద్ద ప్రస్తావించగా.. ఇప్పటికే చెరువు తవ్వకాలపై ప్రభుత్వానికి తెలిపామన్నారు. రైల్వే పరిధిలో కొంత భాగం తవ్వడంతో రైల్వే పోలీసులు సైతం కేసు నమోదు చేశారని తెలిపారు.
ఆదివారమైతే.. చాలు..
మెళియాపుట్టి : మెళియాపుట్టి మండల కేంద్రానికి సమీపంలోని.. ప్రభుత్వానికి సంబంధించిన కొండపై అధికంగా కంకర తరలిస్తున్నా పట్టించుకునే నాథులు లేరు. ఆదివారం అయితే చాలు.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలు సెలవు కావడంతో అధికారులు ఎవరూ అందుబాటులో ఉండరనే ఉద్దేశంతో యథేచ్ఛగా కంకర తవ్వకాలు చేపడుతున్నారు. వేకువజాము నుంచీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి.. ట్రాక్టర్ల ద్వారా వసుంధర, కొసమాలలో కొత్తగా వేస్తున్న లేఅవుట్‌లకు కంకరను తరలిస్తున్నారు. రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ అక్రమ తవ్వకాలు చేపడుతున్నా.. పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది టీడీపీ నేతల పేర్లు చెప్పి.. అక్రమ దందా సాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే అధికారులు కూడా చూసీచూడనట్టు వదిలేస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో వచ్చిన తహసీల్దార్ జానకమ్మ శుక్రవారం రిలీవ్ అయ్యారు. కొత్త తహసీల్దార్ ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో దిగువస్థాయి రెవెన్యూ అధికారులు కంకర మాఫియాతో లాలూచీ పడి.. అక్రమాలకు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించి.. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.