Share News

మచ్చలేని వ్యక్తిత్వం.. ముక్కుసూటి తనం

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:37 PM

గౌతు శ్యామసుందర శివాజీ ఈ పేరు చెప్పగానే ఉద్దానం ప్రాంతం గుర్తొస్తుంది. తండ్రి లచ్చన్న వారసత్వం పునికిపుచ్చుకున్నారు. మచ్చలేని వ్యక్తిత్వం.. ముక్కుసూటి తనానికి మారు పేరుగా నిలిచారు. పబ్లిక్‌ సమావేశాల్లోనైనా..అధినాయకుడివద్దనైనా...ఒకటే తీరుగా వ్యవహరించేవారు. శివాజీ పనైయితే రాష్ట్రంలోని ఏ మంత్రైనా, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారైనా ఒకే చెప్పేవారు. ఎందుకంటే ఆయన శైలి అటువంటిది. దీని వల్లే ఆయన్ను పలాస, సోంపేట నియోజకవర్గాల ప్రజలు ఆరుసార్లు అసెంబ్లీకి పంపించారు.

మచ్చలేని వ్యక్తిత్వం.. ముక్కుసూటి తనం
ఎన్టీరామారావుతో శివాజీ, ఆయన అనుచరులు(ఫైల్‌) :

పలాస: గౌతు శ్యామసుందర శివాజీ ఈ పేరు చెప్పగానే ఉద్దానం ప్రాంతం గుర్తొస్తుంది. తండ్రి లచ్చన్న వారసత్వం పునికిపుచ్చుకున్నారు. మచ్చలేని వ్యక్తిత్వం.. ముక్కుసూటి తనానికి మారు పేరుగా నిలిచారు. పబ్లిక్‌ సమావేశాల్లోనైనా..అధినాయకుడివద్దనైనా...ఒకటే తీరుగా వ్యవహరించేవారు. శివాజీ పనైయితే రాష్ట్రంలోని ఏ మంత్రైనా, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారైనా ఒకే చెప్పేవారు. ఎందుకంటే ఆయన శైలి అటువంటిది. దీని వల్లే ఆయన్ను పలాస, సోంపేట నియోజకవర్గాల ప్రజలు ఆరుసార్లు అసెంబ్లీకి పంపించారు.

కార్యకర్తల మాటే వేదవాక్కు..

ఎమ్మెల్యేగా పిలవడం కంటే గౌతు లచ్చన్న కుమారుడిగా పిలిస్తేనే శివాజీ సంబరపడిపోతారు. ముక్కుసూటి తనం, పనిలో నిబద్ధత, ఇచ్చిన మాటకు జవదాటని వ్యక్తిత్వం, కార్యకర్తల మాటే వేదవాక్కు, ప్రజల్లో నమ్మదగిన మనిషిగా శివాజీ మంచి గుర్తింపుపొందారు. తండ్రి వారసత్వం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఓటమి ఎరగకుండా సోంపేట నియోజకవర్గంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సోంపేట రద్దైన తర్వాత ఏర్పడిన పలాస నియోజకవర్గంలో 2009 లో ఓటమి పాలయ్యారు. మళ్లీ తర్వాత ఎన్నికల్లో అక్కడి నుంచి గెలుపొందారు.

శివాజీ ప్రస్థానం..

టీడీపీ ఏర్పాటు చేసిన తర్వాత 1984లో పార్టీలో చేరారు. తొలిసారిగా 1985లో ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. 1989, 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో వరుసగా విజ యం సాధించారు. 2019 రాజకీయాలను విరమించుకున్నట్లు ప్రకటించడంతో ఆయన వారసత్వాన్ని పెద్ద కుమార్తె గౌతు శిరీష కొనసాగిస్తున్నారు. ఫ శివాజీకి ఎన్టీయార్‌ 1989లో టిక్కెట్‌ నిరాకరించడంతో ఆయన తనతోడు-నీడగా పిలిచే కింజరాపు ఎర్రన్నాయుడుతో కలిసి ఇద్దరూ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఈ విజయం ఆయనకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చాటి చెప్పిందని సాక్ష్యాత్తు ఎన్టీఆర్‌ ప్రకటించడం విశేషం. తర్వాత ఎన్నికల్లో ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించారు.

ఫ ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్ల నుంచి దూకుడుగా ఉండేవారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌కు ప్రభుత్వం నిధులు విడుదలచేయకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టిని ఆకర్షించి ఆ పనుల నిర్వహణకు గెడ్డం దీక్షచేశారు. ముడు నెలలపాటు ఈ దీక్ష సాగడంతో ముఖ్యమంత్రి స్పందించి ఆఫ్‌షోర్‌కు ఏకంగా రూ.466 కోట్లు విడుదలచేశారు. అప్పట్లో జడ్పీ, ఐటీడీఏపాలకవర్గం సమావేశంలో శివాజీ అధికారపక్షమైనా స్వపక్షంలో విపక్షంగా మారి సమస్యలపై మంత్రులు, అధికారులను సైతం నిలదీసేవారు.

టీడీపీలో విలీనమైన లోక్‌దళ్‌..

రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చెరగని ముద్రవేసుకున్న స్వతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న తన పార్టీ లోక్‌దళ్‌ను టీడీపీలో 1983లో విలీనం చేశారు. ఆయనతో అప్పటి వరకు రాజకీయాల్లో పాలుపంచుకొని ఉన్న శిష్యులు సుంకరి సత్యనారాయణ(కృష్ణాజిల్లా), వడ్డే శోభనాదీశ్వరరావు, యలమంచిలి శివాజీ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, తుమ్మల చౌదరి వంటి వారు టీడీపీలో చేరి వివిధ పదవులు పొందారు. ఈ క్రమంలో లచ్చన్న పెద్ద కుమారుడు శివాజీ 34 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు.

సోంపేట వారికి కంచుకోట..

గౌతు కుటుంబానికి సోంపేట కంచుకోటలా మారింది. తొలుత లచ్చన్న ఎన్నికయ్యారు. తర్వాత 1962లో స్వతంత్ర అభ్యర్థిగా సోంపేట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తర్వాత 1967, 1978లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పాటు ఎమ్మెల్సీ కూడా బాధ్యతలు నిర్వహించారు. తండ్రీ కుమారులు లచ్చన్న, శివాజీలు దశాబ్దాల పాటు ప్రజా ప్రతినిధులుగా సోంపేటకు సేవలందించారు. లచ్చన్నకు గురువు పుల్లెల శ్యామసుందరరావు అంటే ఎంతో ఇష్టం. దీంతో తన కుమారుడికి గౌతు శ్యామసుందరశివాజీ అని పేరు పెట్టుకున్నారు. శివాజీకి శిరీష, అనురాధ కుమార్తెలు ఉండగా శిరీష ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండగా, పలాస నియోజకవర్గం నుంచిపోటీ చేస్తున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:37 PM