Share News

తవ్వేసి.. తరలించి..

ABN , Publish Date - Sep 11 , 2024 | 11:32 PM

మహేంద్రతనయా నది ఇసుకాసురులకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా 20 ఏళ్లుగా ఈ నదిలో ఇసుక తవ్వకాలను ప్రభుత్వం నిషేధించింది. కాగా.. గత వైసీపీ ప్రభుత్వం ఇసుక ధరలను అమాంతం పెంచేసింది. దీంతో అక్రమార్కుల కన్ను మహేంద్రతనయా నదిపై పడింది.

తవ్వేసి.. తరలించి..
చినకోష్ట వద్ద ఇసుక సేకరిస్తున్న కూలీలు.. (ఇన్‌సెట్‌లో)భోగాపురం వద్ద మహేంద్ర తనయాలో ఇసుక లోడింగ్‌

- మహేంద్రతనయ నుంచి ఇసుక అక్రమ రవాణా

- తాగునీటి పథకాలకు పొంచి ఉన్న ముప్పు

- అయినా పట్టించుకోని అధికారులు

(హరిపురం)

మహేంద్రతనయా నది ఇసుకాసురులకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా 20 ఏళ్లుగా ఈ నదిలో ఇసుక తవ్వకాలను ప్రభుత్వం నిషేధించింది. కాగా.. గత వైసీపీ ప్రభుత్వం ఇసుక ధరలను అమాంతం పెంచేసింది. దీంతో అక్రమార్కుల కన్ను మహేంద్రతనయా నదిపై పడింది. స్థానిక నాయకుల ప్రోద్భలం, కొంతమంది అధికారుల సహకారంతో గత ఐదేళ్లూ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. ఇప్పటికీ అక్రమ తవ్వకాలు కొనసాగుతుండడం చర్చనీయాంశమవుతోంది.

- మందస, సోంపేట మండలాల పరిధిలో విస్తరించి ఉన్న మహేంద్రతనయా నది నుంచి సాయంత్రం నుంచి రాత్రివేళల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రెవెన్యూ, పోలీస్‌ శాఖల్లో కొంతమంది అధికారులకు మామూళ్లు ముట్టజెప్పడంతో ఇసుక అక్రమ దందాకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. మందస, సోంపేట మండలాల పరిధిలో చినకోష్ట, పెదకోష్ట, బాతుపురం, భోగాపురం, పొత్తంగి, సిరిపురం, బుషాపద్ర, దొంగలమారికానా, శాసనం, గౌడుగురండి, బారువా. మూలపొలం, టి.శాసనం తదితర ప్రాంతాల నుంచి అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. చిన్నకోష్ట, గౌడగురండి, భోగాపురం వంటి గ్రామాల్లో.. గ్రామ సంఘాలు ఏర్పాటు చేసి ట్రాక్టర్‌కు రూ.400 నుంచి 500 వరకు వసూళ్లు చేస్తున్నారు. ఆయా గ్రామ సంఘాలు, ట్రాక్టర్ల యజమానుల నుంచి అధికారులకు మామూళ్లు అందుతుండడంతో వీటివైపు కనీసం కన్నెత్తి చూడడంలేదు.

- ప్రభుత్వ నిర్మాణాలకు..

ఐటీడీఏ పరిధిలోని మందస, సోంపేట, మెళియాపుట్టి, పలాస వంటి పలు మండలాల్లో సుమారు రూ.40కోట్లతో పాఠశాల భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటన్నింటికీ మహేంద్రతనయా నది ఇసుకనే వినియోగిస్తున్నారు. ఈ విషయం ఇక్కడి అన్ని స్థాయిల్లోని అధికారులకు తెలిసినా కిమ్మనడంలేదు. మహేంద్రతనయా నది ఇసుకతో గతంలో ప్రభుత్వానికి ఏటా కోట్లాది రూపాయాల ఆదాయం వచ్చేది. ఇక్కడ ఇసుక వేలంను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం రద్దు చేసింది. దీనినే అదునుగా తీసుకున్న అక్రమార్కులు స్థానిక నాయకుల దన్నుతోనే ఇసుక దందాను సాగిస్తూ.. రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు.

- రోజుకు 150 ట్రాక్టర్లుకు పైనే..

మహేంద్రతనయా నదినుంచి రోజుకు 150 నుంచి 200 ట్రాక్టర్లు వరకు ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఒక్కో ట్రాక్టరుకు రెండు క్యూబిక్‌ మీటర్లు ఇసుక లోడ్‌చేసినా కనీసం ధర రూ.1550 అవుతోంది. కాగా.. కేవలం రూ.400 చెల్లించి గృహ నిర్మాణదారునికి లోడు రూ.4000 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు ఒక్కొక్కరూ కనీసం రెండులోడ్లు వేసి.. ఖర్చులు పోనూ రూ.6వేలకుపైగా సంపాదిస్తున్నారు. దీంతో ప్రభుత్వాదాయానికి గండిపడడమే కాకుండా సుమారు రూ.40కోట్లతో నిర్మించిన ఉద్దానం ప్రాజెక్టు, మరో రూ.20కోట్లుతో నిర్మించిన 19 చిన్న రక్షితనీటి పఽథకాల మనుగుడకే ముప్పు వాటిల్లే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే సముద్ర నీరు ఉద్దానం మంచినీటి బావుల్లోకి వెళ్లి రెండు బావులు మూసివేశారు. మరో రెండు రక్షితనీటి పథకాలు మూలన పడ్టాయి. ఈ ఇసుక అక్రమ రవాణా ఇలాగే కొనసాగితే మంచినీటి పథకాలకు ముప్పు వాటిల్లడంతోపాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని సుమారు 130గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి మంచినీటికే ముప్పు ఏర్పడనుంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.

Updated Date - Sep 11 , 2024 | 11:32 PM