Share News

సమస్యలను పరిష్కరించకపోతే ఉపేక్షించం

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:44 PM

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆయా వర్గాలు ఉపేక్షించేది లేదని ఎన్జీవో రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు స్పష్టం చేశారు. జేఏసీ పిలుపు మేరకు మంగళవారం శ్రీకాకుళంలోని కలెక్టరేట్‌ సమీపంలో జ్యోతిబాపూలే పార్కు వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేసి ధర్నా చేశారు.

సమస్యలను పరిష్కరించకపోతే ఉపేక్షించం
శ్రీకాకుళంలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల ధర్నా

- ఎన్జీవో రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 20: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆయా వర్గాలు ఉపేక్షించేది లేదని ఎన్జీవో రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు స్పష్టం చేశారు. జేఏసీ పిలుపు మేరకు మంగళవారం శ్రీకాకుళంలోని కలెక్టరేట్‌ సమీపంలో జ్యోతిబాపూలే పార్కు వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేసి ధర్నా చేశారు. పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని, సమస్యలు పరిష్కరిస్తుందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నాలుగునరేళ్లుగా ఎదురుచూసి విసిగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. పెండింగ్‌లో ఉన్న 11వ పీఆర్సీ బకాయిలు రూ.23,500 కోట్లు వెంటనే చెల్లించాలి. గత జూలై నాటికే 12వ పీఆర్సీ సమయం పూర్తయింది. ఇప్పటికే ఆలస్యమైన కారణంగా 30శాతం మద్యంతర భృతి చెల్లించాలి. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల’ని డిమాండ్‌ చేశారు. జేఏసీ జిల్లా చైర్మన్‌ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో 104 సంఘాల పక్షాన జేఏసీ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పాల్గొంటున్నారని తెలిపారు. నూతన పీఆర్సీని అమలు చేయాలని, ధరలకు అనుగుణంగా ఐఆర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 27 చలో విజయవాడ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ఉద్యోగుల వ్యతిరేకతను తేలికగా తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సంపతిరావు కిషోర్‌కుమార్‌, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు కె.భానుమూర్తి, ప్రధాన కార్యదర్శి టెంక చలపతిరావు, ఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి.రమణ, డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కృష్ణారావు, అనిల్‌కుమార్‌, బీపీఏ ప్రతాప్‌కుమార్‌, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు డి.పార్వతీశం, బొడ్డేపల్లి మోహనరావు, ఆర్‌.నారాయణమూర్తి, బి.శ్రీరామ్మూర్తి, జి.గిరిధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:44 PM