Share News

ఎన్నికల సన్నద్ధతపై అభ్యంతరాలుంటే చెప్పండి

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:07 AM

జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై ఏవైనా అభ్యంతరాలుంటే నేరుగా జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో అనుబంధ ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, రానున్న ఎన్నికల సన్నద్ధతపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో 37వ వారపు సమీక్ష నిర్వహించారు.

ఎన్నికల సన్నద్ధతపై అభ్యంతరాలుంటే చెప్పండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

- రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్‌ సూచన

కలెక్టరేట్‌, మార్చి 11: జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై ఏవైనా అభ్యంతరాలుంటే నేరుగా జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో అనుబంధ ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, రానున్న ఎన్నికల సన్నద్ధతపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో 37వ వారపు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ‘ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నాం. రెండు నెలల్లో 2,82,688 ఓటరు గుర్తింపు కార్డులను ముద్రణకు పంపాం. వీటిలో 1,83,907 కార్డులను పోస్టల్‌ శాఖ ద్వారా పంపిణీ చేశాం. మిగిలినవి త్వరగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఎచ్చెర్ల శివానీ ఇంజనీరింగ్‌ కాలేజీని ఓట్ల లెక్కింపు కేంద్రంగా ఎంపిక చేశాం. పోలింగ్‌కు సంబంధించి ఇప్పటికే సిబ్బందికి పలు దశల్లో శిక్షణ పూర్తయింది. ఎన్నికల సమయంలో నగదు, మద్యం పంపిణీ చేసేవారిపై, నియమాలను ఉల్లంఘించేవారిపై కఠినచర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ప్రత్యేకంగా 18004256625 కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామ’ని తెలిపారు. గడిచిన వారం రోజుల్లో ఓటర్ల జాబితా మార్పులు చేర్పులుపై 2,295 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, టెక్కలి సబ్‌కలెక్టర్‌ నూరుల్‌కమర్‌, డీఆర్వో ఎం.గణపతిరావు, ఆర్డీవోలు రంగయ్య, భరత్‌నాయక్‌తోపాటు రాజకీయ పార్టీల నేతలు పీఎంజే బాబు(టీడీపీ), రౌతు శంకరరావు(వైసీపీ), సురేష్‌సింగ్‌ బాబు(బీజేపీ), మల్లిబాబు(కాంగ్రెస్‌), సోమేశ్వరరావు(బిఎస్పీ), తిరుపతిరావు(సీపీఐ) పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 12:07 AM