Share News

రాజీనామా చేయకపోతే.. సచివాలయం గేటు తాకలేరు

ABN , Publish Date - Apr 12 , 2024 | 11:55 PM

ఎన్నికల వేళ.. రాజీనామా చేయాలంటూ వలంటీర్లపై వైసీపీ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే వలంటీర్లుకు నెలకు రూ.10వేలు జీతం ఇస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామంది వలంటీర్లు రాజీనామా చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు.

రాజీనామా చేయకపోతే.. సచివాలయం గేటు తాకలేరు

- వలంటీర్లకు వైసీపీ నేతల హెచ్చరిక

మెళియాపుట్టి, ఏప్రిల్‌ 12: ఎన్నికల వేళ.. రాజీనామా చేయాలంటూ వలంటీర్లపై వైసీపీ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే వలంటీర్లుకు నెలకు రూ.10వేలు జీతం ఇస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామంది వలంటీర్లు రాజీనామా చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. కాగా కొంతమంది వైసీపీ నేతలు వారిని బెదిరించి రాజీనామాలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మెళియాపుట్టి మండలంలోని వైసీపీ ముఖ్యనాయకుడు ఒకరు వాట్సాప్‌లో వలంటీర్లకు హెచ్చరిక మాదిరి సందేశాన్ని పంపారు. ‘‘ముఖ్యమంతి జగనన్న.. స్థానిక ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి వలంటీర్లును సొంత మనుషుల్లా చూసుకుని ఒక గొప్ప అవకాశం కల్పించారు. మీరు కృతజ్ఞతలు చూపించటానికి ఇంత కంటే గొప్ప అవకాశం రాదు. దయచేసి రేపటి లోగా రాజీనామా చేయాలి. లేదంటే మీ అందర్నీ టీడీపీ కోవర్టుల్లా చూస్తాం. పైగా రేపు మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందరు చెప్పినా.. కనీసం సచివాలయం గేట్‌ కూడా తాకలేరు. అర్ధం చేసుకొని అర్థం చేసుకుని మీరంతా స్వచ్ఛందంగా రాజీనామా చేయండి’ అని ఆ మేసేజ్‌ ద్వారా వలంటీర్లకు స్పష్టం చేశారు. అయినా కొంతమంది వలంటీర్లు స్పందించకపోవడంతో వైసీపీ నేతలు పునరాలోచనలో పడుతున్నారు.

Updated Date - Apr 12 , 2024 | 11:55 PM