Share News

వేతనాలివ్వకపోతే.. సమ్మెకు సిద్ధం

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:04 AM

గ్రామీణ నీటిసరఫరా విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు వేతన కష్టాలు వెంటాడుతున్నాయి. 25 నెలలుగా జీతాలు అందక.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల కోసం అడిగితే అధికారులు ఆగ్రహవేశాలు వెలిబుచ్చుతున్నారని, మరోవైపు కాంట్రాక్టర్లు.. ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని చెబుతూ తమ పొట్ట కొడుతున్నారని వాపోతున్నారు.

వేతనాలివ్వకపోతే.. సమ్మెకు సిద్ధం
బొరివంక పథకం వద్ద కార్మికుల నిరసన

- గ్రామీణ నీటిసరఫరా విభాగం కార్మికులకు సక్రమంగా అందని జీతాలు

- ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన

(కవిటి)

గ్రామీణ నీటిసరఫరా విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు వేతన కష్టాలు వెంటాడుతున్నాయి. 25 నెలలుగా జీతాలు అందక.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల కోసం అడిగితే అధికారులు ఆగ్రహవేశాలు వెలిబుచ్చుతున్నారని, మరోవైపు కాంట్రాక్టర్లు.. ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని చెబుతూ తమ పొట్ట కొడుతున్నారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కవిటి మండలం బొరివంకలో కార్మికులు నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము సమ్మెకు సిద్ధమని స్పష్టం చేశారు.

ఇదీ పరిస్థితి

జిల్లాలో గ్రామీణ తాగునీటి సరఫరా పథకం కింద వివిధ గ్రామాల్లోని పంపుహౌస్‌ల్లో సుమారు 350 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తారు. వీరికి ప్రతి మూడు.. లేదా ఆరు నెలలకోసారి ఆర్‌డబ్ల్యుఎస్‌ విభాగం అధికారుల జీతాలను అందజేసేవారు. కాగా.. ప్రస్తుతం సక్రమంగా జీతాలు అందడం లేదు. ప్రభుత్వం ఈ పథకాల నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టులకు అప్పగించింది. దీంతో వారి దయాదాక్షిణ్యాల మీద కార్మికుల జీవితాలు ఆధారపడ్డాయి. జీతాలు ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల ఆరు నెలల నుంచి 25 నెలల వరకు బకాయిలు ఉన్నాయి. ఇచ్ఛాపురం సబ్‌డివిజన్‌ పరిధిలో సుమారు 80 మందికి రెండేళ్లకుపైగా వేతనాలు అందడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలను అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో గురువారం బొరివంకలో తాగునీటి పథకం వద్ద ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ‘జీతాల కోసం గతేడాది నవంబరులో కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా కనీస స్పందన లేదు. కాంట్రాక్టర్‌తో పరిష్కరించుకోవాలి తప్ప.. స్పందనకు ఎందుకు వస్తున్నారని కొంతమంది అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార’ని యూనియన్‌ అధ్యక్షుడు కె.నీలాచలం, జాయింట్‌ సెక్రటరీ బి.జోగారావు, జి.శ్రీనివాసరావు, వైకుంఠరావు, బి.అప్పలరాజు తెలిపారు. మళ్లీ గత నెలలో స్పందనలో ఫిర్యాదు చేయగా జిల్లాలో బిల్లులు పెండింగ్‌ లేవని అధికారులు చెబుతున్నారన్నారు. తమ జీతాల విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేతనాలు అందజేయకపోతే సమ్మె బాట పడతామని తెలిపారు.

Updated Date - Mar 08 , 2024 | 12:05 AM