Share News

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే

ABN , Publish Date - Feb 17 , 2024 | 11:52 PM

‘సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై ఉద్యోగవర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇంకా మా సహనాన్ని పరీక్షించాలనుకుంటే ఉద్యమించక తప్పదు’ అని ఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం స్పష్టం చేశారు.

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే
మాట్లాడుతున్న హనుమంతు సాయిరాం

- ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 17 : ‘సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై ఉద్యోగవర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇంకా మా సహనాన్ని పరీక్షించాలనుకుంటే ఉద్యమించక తప్పదు’ అని ఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్‌ సమీపంలో పూలే పార్కు వద్ద ఎన్జీవో శ్రీకాకుళం పట్టణ శాఖ నిర్వహించిన ధర్నా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను ఐదేళ్లుగా ఖాతాలో జమ చేయలేదు. పీఆర్సీలో కూడా ఉద్యోగులకు అన్యాయం చేసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు 25వేల కోట్లకు పైమాటే. ఉద్యోగులు లోన్‌ పెట్టుకున్నా.. సమయానికి డబ్బులు అందడం లేదన్నారు. బీమా డబ్బులు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల జీపీఎఫ్‌ కూడా చెల్లించకపోవడం దారుణం. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఆరు నెలలకు కొత్త డీఏ ప్రకటించగా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం పాత డీఏలు కూడా చెల్లించకపోవడం శోచనీయం. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. లేదంటే ఆందోళన బాట పడతామ’ని హెచ్చరించారు. జేఏసీ నాయకులు కిషోర్‌కుమార్‌, టెంక చలపతిరావు, పార్వతీశం, ఆదినారాయణ హాజరై మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎన్జీవో ప్రతినిధులు బొత్స శ్రీను, పూజారి జానకిరామ్‌, గోవింద్‌ శశిభూషణరావు, ఏ.వెంకటరమణ, బీవీ రమణ, రోజాకుమారి, మమత, లక్ష్మి, మధు, కె.లక్ష్మణరావు, డి.అప్పన్న పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 11:52 PM