Share News

బియ్యం కదలట్లే!

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:06 AM

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు వేగవంతంగా సాగాలంటే మిల్లర్లు మరపట్టిన బియ్యాన్ని ప్రభుత్వం వెంట వెంటనే తీసుకొని గిడ్డంగులకు తరలించాలి. దీనివల్ల ఆ మిల్లులకు మళ్లీ ధాన్యాన్ని పంపించేందుకు వీలుంటుంది.

బియ్యం కదలట్లే!
నరసన్నపేట సివిల్‌సప్లయ్‌ గోదాం వద్ద బియ్యం బస్తాలు

- మిల్లుల వద్ద భారీగా నిల్వలు

- ‘వన్‌ స్టాగ్‌’తో అన్‌లోడింగ్‌లో జాప్యం

- గిడ్డంగుల బయటే బస్తాలు

- మందగిస్తున్న ధాన్యం కొనుగోలు

(నరసన్నపేట)

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు వేగవంతంగా సాగాలంటే మిల్లర్లు మరపట్టిన బియ్యాన్ని ప్రభుత్వం వెంట వెంటనే తీసుకొని గిడ్డంగులకు తరలించాలి. దీనివల్ల ఆ మిల్లులకు మళ్లీ ధాన్యాన్ని పంపించేందుకు వీలుంటుంది. కానీ, జిల్లాలో ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. సివిల్‌ సప్లయ్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బియ్యం నిల్వలు మిల్లుల్లో పేరుకుపోతున్నాయి. మరోక వైపు బ్యాంకు గ్యారెంటీ (బీజీ)లు లేక ధాన్యం కొనుగోలు కూడా మందగిస్తున్నాయి. జిల్లాలో 260 రైస్‌మిల్లులు ఉన్నాయి. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బ్యాంకు గ్యారెంటీ(బీజీ)లు ఇచ్చిన మిల్లులకు పంపిస్తుంది. అనంతరం కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) విధానంలో క్వింటా ధాన్యానికి 67 కేజీల బియ్యం మిల్లర్ల నుంచి తీసుకుంటుంది. మిల్లర్లు మరపెట్టిన బియ్యం సేకరించి సివిల్‌ సప్లయ్‌ గిడ్డంగుల్లో నిల్వ చేయాలి. కానీ, జిల్లాలో చాలా మిల్లుల నుంచి బియ్యం తరలింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మిల్లుల వద్ద బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. మిల్లర్లు పంపించిన బియ్యం మూడు రోజుల వరకు గిడ్డంగుల వద్ద అన్‌లోడింగ్‌ కావడం లేదు. దీనివల్ల డామరేజ్‌ పేరిట వాహనాల అద్దె తడిసిమోపుడు అవుతుందని మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు.

వన్‌స్టాగ్‌ విధానంతో జాప్యం

సివిల్‌ సప్లయ్‌ గిడ్డంగుల్లో వన్‌ స్టాగ్‌ విధానంతో బియ్యం అన్‌లోడింగ్‌లో తీవ్ర జాప్యమవుతోంది. గతంలో మిల్లర్లు ఇచ్చిన బియ్యం బస్తాలను అంతా కలిపి ఒకే స్టాగ్‌ (నిట్టవేయడం)లో ఉంచేవారు. దీంతో మిల్లుల నుంచి లారీల ద్వారా గిడ్డంగులకు వచ్చిన బియ్యం నాణ్యతను క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు పరిశీలించి అన్‌లోడింగ్‌కు అవకాశం ఇచ్చేవారు. గతేడాది నుంచి మిల్లులకు కేటాయించిన గిడ్డంగుల్లో ఒక్కొక్క మిల్లుకు ఒక్కోక్క స్టాగ్‌ కేటాయించారు. స్టాగ్‌లో ఆరు ఏసీక్‌లు బియ్యం(సుమారు 3వేల క్వింటాలు) నిట్టకడతారు. దీనివల్ల మూడు నుంచి నాలుగు రోజుల వరకు లారీల్లోని బియ్యం అన్‌లోడింగ్‌ కావడం లేదు. మరోవైపు మిల్లర్లు ఆన్‌లైన్‌లో ట్రక్కు వివరాల నమోదు చేసే సమయంలో సాంకేతికపరంగా లోపాలు ఏర్పడుతున్నాయి.

సిబ్బంది కొరత

జిల్లాలో నరసన్నపేట, నారాయణవలస, నైర, రావిపాడు, సోంపేట, ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస తదితర ప్రాంతాల్లో ఉన్న వేర్‌హౌస్‌ గిడ్డంగులకు ప్రభుత్వం కస్టమ్స్‌ బియ్యం తరలిస్తుంది. నరసన్నపేట గిడ్డంగి వద్ద సిబ్బంది కొరత ఉంది. మేనేజర్‌ పోస్టు ఖాళీగా ఉండగా వాటి బాధ్యతను ఆర్‌ఎంవో నిర్వహిస్తున్నారు. మరోవైపు నాణ్యతను పరిశీలించే క్వాలీటీ కంట్రోల్‌ అధికారులకు రెండేసే ప్రాంతాలకు డ్యూటీలు వేస్తున్నారు. దీనివల్ల గిడ్డంగుల వద్ద బియ్యం అన్‌లోడింగ్‌ మరింత ఆలస్యమవుతోంది. కొన్ని గిడ్డంగుల్లో ఆరుబయటే బియ్యం బస్తాలు ఉన్నాయి.

జాప్యం లేకుండా సేకరిస్తున్నాం

మిల్లుల నుంచి బియ్యం సేకరించేందుకు వే బిల్లులను వెంటనే ఇస్తున్నాం. ఇప్పటికే 11 మంది క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు అందుబాటులో ఉన్నారు. బియ్యం తరలింపును మరింత వేగవంతం చేసేందుకు అదనంగా సిబ్బందిని నియమిస్తాం. నాణ్యతలో రాజీపడడం లేదు. క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు ప్రలోభాలకు లోనైతే విధుల నుంచి తొలగిస్తాం. సీఎంఆర్‌ విధానంలో ఇప్పటివరకు 25 శాతం మేరకు బియ్యం సేకరించాం.

- కె.శ్రీనివాసరావు, డీఎం, సివిల్‌సప్లయ్‌ శాఖ

Updated Date - Jan 09 , 2024 | 12:06 AM