Share News

కూటమిపైనే ఆశలు

ABN , Publish Date - May 19 , 2024 | 12:32 AM

ఆర్టీసీలో ప్రయాణం.. సురక్షితం అన్నది ఒకప్పటి మాట. జగన్‌ సర్కారు హయాంలో మాత్రం ఆర్టీసీ అంటేనే ప్రమాదకరం, ఆర్థికభారంగా మారిపోయింది. గత ఐదేళ్లు ఆర్టీసీ.. వైసీపీ సొంత సంస్థగా వ్యవహరించింది. సీఎం జగన్‌ జిల్లాల పర్యటనకు వస్తే చాలు.. ఆయా రీజయన్‌ పరిధిలో ఆర్టీసీ ప్రజారవాణ నిలిచిపోవాల్సిందే.

కూటమిపైనే ఆశలు
టెక్కలిలో అప్రోచ్‌ రోడ్డు డివైడర్‌ పైకి ఎక్కి ఇరుక్కుపోయిన బస్సు

- ఐదేళ్లుగా ఆర్టీసీ చార్జీల బాదుడు

- విసుగెత్తిపోయిన ప్రయాణికులు

- బస్సులను పార్టీ కార్యక్రమాలకు వాడుకున్న వైసీపీ

- ఆ సమయంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

- అయినా తీరు మార్చుకోని అధికారపార్టీ

- చార్జీలు పెంచినా మెరుగైన సేవల్లో వైఫల్యం

- ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుందని అనుమానం

- బెంబేలెత్తిపోతున్న వైసీపీ నాయకులు

(రణస్థలం)

- గత నెల 24న సీఎం జగన్‌ టెక్కలిలో సిద్ధం సభ నిర్వహించారు. ఈ సభకు వజ్రపుకొత్తూరు మండలం బెండిసీతాపురం నుంచి జనాన్ని తీసుకువచ్చిన వాల్తేరు డిపో బస్సు అప్రోచ్‌రోడ్డు డివైడర్‌ ఎక్కి ఇరుక్కుపోయింది. దీంతో బస్సులో ఉన్న జనం ఉలిక్కిపడ్డారు. నెమ్మదిగా ఆగిన బస్సు నుంచి కిందకు దిగి ఊపిరి పీల్చుకున్నారు.

.......................

- గత నెల 24న టెక్కలిలో సీఎం సభకు ఆర్టీసీ బస్సులన్నీ తరలించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పలాస-కాశీబుగ్గ కాంప్లెక్స్‌లో గురువారం వేకువ జామున 4.30 గంటల నుంచి బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షించగా.. ఏడు గంటలైనా రాలేదు. దీంతో ఒడిశా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను ఆశ్రయించారు.

.......................

- ఈ నెల 7న ఇచ్ఛాపురంలో సీఎం జగన్‌ రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షో ప్రారంభం కాకముందే.. ఉదయం 10గంటల నుంచే ఆర్టీసీ బస్సులను ఇచ్ఛాపురం కాంప్లెక్స్‌లో నిలిపేశారు. సోంపేట, ఒడిశా నుంచి వచ్చిన బస్సులు కూడా టౌన్‌లోకి రాకుండా అడ్డుకున్నారు. సోంపేట నుంచి వచ్చే బస్సులను హైవే మీదుగా తరలించడంతో.. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద దిగి కాలినడకన ఇళ్లకు చేరుకున్నారు.

.........................

ఆర్టీసీలో ప్రయాణం.. సురక్షితం అన్నది ఒకప్పటి మాట. జగన్‌ సర్కారు హయాంలో మాత్రం ఆర్టీసీ అంటేనే ప్రమాదకరం, ఆర్థికభారంగా మారిపోయింది. గత ఐదేళ్లు ఆర్టీసీ.. వైసీపీ సొంత సంస్థగా వ్యవహరించింది. సీఎం జగన్‌ జిల్లాల పర్యటనకు వస్తే చాలు.. ఆయా రీజయన్‌ పరిధిలో ఆర్టీసీ ప్రజారవాణ నిలిచిపోవాల్సిందే. చివరకు 500 కిలోమీటర్ల దూరంలో సమావేశాలు జరిగినా ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ఇష్టారాజ్యంగా వాడేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలోనూ దాదాపు 80శాతం బస్సులను సీఎం సభకు కేటాయించడంతో.. సాధారణ ప్రయాణికులు నరకయాతన పడ్డారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి.. గమ్యస్థానాలకు చేరుకున్నారు. గత ఐదేళ్లలో టిక్కెట్ల ధరలు కూడా భారీగా పెంచేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే.. మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితమని ప్రకటించడంతో.. చాలా మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే.. ఆర్టీసీ మళ్లీ గాడిన పడుతుందని పలువురు భావిస్తున్నారు. ఈ ప్రభావం ఎన్నికల్లో పడి విజయావకాశాలను దెబ్బ తీసే ప్రమాదం ఉందని వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

- మూడుసార్లు బాదుడే

వైసీపీ ఐదేళ్ల పాలనలో మూడుసార్లు ఆర్టీసీ టిక్కెట్లు పెంచారు. 2019 నాటికి కనీస టిక్కెట్‌ ధర రూ.5 ఉండగా.. దానిని రూ.10కి పెంచారు. ఎక్స్‌ప్రెస్‌ కనీస చార్జీని రూ.20కు పెంచారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం మోపారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే.. విడిభాగాలు, ఇంధన ధరలు సాకుగా చూపి.. టికెట్‌ ధరలు పెంచేశారు. 2022 ఏప్రిల్‌ 14న రెండోసారి భారం మోపారు. 20కిలోమీటర్లకు రూ.5, 60కిలోమీటర్లకు రూ.10, 90కిలోమీటర్లకు రూ.15కు పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. రూ.27, రూ.29 టిక్కెట్‌ ధరను సైతం చిల్లర సమస్యను సాకుగా చూపుతూ రూ.30కు పెంచారు. 2022 జూలైలో మరోసారి టిక్కెట్‌ ధరను పెంచేశారు. 30కిలోమీటర్లకు రూ.5, 70కిలోమీటర్లకు రూ.10, 70నుంచి 500 కిలోమీటర్ల వరకూ రూ.20 చొప్పున ప్రయాణికులపై భారం మోపారు.

ఆర్టీసీ చార్జీల పెంపు ఇలా....

=================================

మార్గం 2019 ప్రస్తుతం

================================

శ్రీకాకుళం-విశాఖ పల్లెవెలుగు రూ.90 రూ.105

ఆల్ర్టాడీలక్స్‌ రూ.135 రూ.175

శ్రీకాకుళం-రణస్థలం రూ.25 రూ.45

శ్రీకాకుళం-ఆమదాలవలస రూ.15 రూ.30

శ్రీకాకుళం-పలాస రూ.75 రూ.125

శ్రీకాకుళం-టెక్కలి రూ.55 రూ.85

శ్రీకాకుళం-బొబ్బిలి రూ.80 రూ.90

శ్రీకాకుళం-కొత్తూరు రూ.60 రూ.95

శ్రీకాకుళం-పాతపట్నం రూ.60 రూ.100

==================================

ఇదీ పరిస్థితి

జిల్లాలోని శీక్రాకుళం 1,2, పలాస, టెక్కలిలో ఆర్టీసీ డిపోల పరిధిలో 329 బస్సులు ఉన్నాయి. వాటిలో సంస్థకు చెందినవి 220, అద్దెవాహనాలు 87, మరో 22 అదనంగా ఉన్నాయి. 13 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులను కాలం చెల్లినవిగా పరిగణిస్తారు. ప్రస్తుతం పల్లెవెలుగు సర్వీసులన్నీ కాలం చెల్లినవే. సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఐదు లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత.. వాటిని పల్లెవెలుగులుగా వినియోగిస్తారు. ఎక్స్‌ప్రెస్‌లుగా కొత్త బస్సులను కొనుగోలు చేస్తారు. కానీ వైసీపీ పాలనలో కొత్త బస్సుల కొనుగోలు సక్రమంగా జరగలేదు. అలాగే నియామకాలు కూడా చేపట్టలేదు. నాలుగు డిపోల పరిధిలో 60 వరకూ డ్రైవర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెకానిక్‌లు సైతం అరకొరగా ఉన్నారు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. 40శాతం కాంట్రాక్ట్‌ సిబ్బందితోనే నడిపిస్తున్నట్టు ఆర్టీసీ యూనియన్‌ నేతలు చెబుతున్నారు. ఒక్కోబస్సుకు డ్రైవర్‌, కండక్టర్‌, గ్యారేజీ మెకానిక్‌, సహాయకుడు కలుపుకొని ఐదుగురు సిబ్బంది ఉండాలి. కానీ బస్సుల నిష్పత్తి చూసుకుంటే ఇద్దరు కూడా లేని పరిస్థితి. మొత్తం నాలుగు డిపోల్లో 370 మంది వరకూ పనిచేస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా ఉన్న వారిపై అదనపు పనిభారం పడుతోంది. డిపోల్లో నిపుణులైన మెకానిక్‌లు లేకపోవడం, విడి పరికరాలు సక్రమంగా సరఫరా కాకపోవడంతో బస్సు మరమ్మతులు జరగడం లేదు. దీంతో బస్సులు మొరాయిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

- తరచూ ప్రమాదాలు

జిల్లాలో ఇటీవల ఆర్టీసీ ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత ఏడాది అక్టోబరు 16న శ్రీకాకుళం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నందిగాం మండలం తురకలకోట వద్ద ప్రమాదానికి గురైంది. స్టీరింగ్‌ రాడ్డు విరిగిపోవడంతో.. రోడ్డుపక్కనే ఉన్న గోతిలోకి బస్సు ఒరిగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. అలాగే గత ఏడాది జూన్‌ 5న నరసన్నపేట సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తున్న బస్సు కోమర్తి జంక్షన్‌ వద్ద స్టీరింగ్‌ ఊడిపోయింది. బస్సు అదుపు తప్పి బోల్తాపడగా.. 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ముఖ్యంగా కాలం చెల్లిన బస్సులు అటు సిబ్బందికి, ఇటు ప్రయాణికులకు రోత పుట్టిస్తున్నాయి. కొత్తగా డిపోలకు చేరిన ఆలా్ట్ర డీలక్సులు, సూపర్‌ లగ్జరీ బస్సులు సైతం మొరాయిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక పల్లెవెలుగులు గురించి చెప్పనక్కర్లేదు. పగిలిన అద్దాలు, విరిగిన నట్లు రణగొన ధ్వనులతో ప్రయాణం సాగించాల్సి వస్తోంది. అవి ఎక్కడ ఆగిపోయి.. ప్రమాదం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది.

ఆర్టీసీ తీరు దారుణం

వైసీపీ పాలనలో ఆర్టీసీ తీరు దారుణంగా మారింది. కేవలం ప్రధాన మార్గాల్లో మాత్రమే ఆర్టీసీ సర్వీసులకు పరిమితమైంది. దీంతో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. పేరుకే ప్రజారవాణా.. కానీ.. చార్జీలు పెంచి సామాన్యుల నడ్డివిరిచారు.

- కెల్ల హేమంత్‌, రణస్థలం

.....................

ప్రభుత్వానికి ఆదాయ వనరుగా

గతంలో ఆర్టీసీ టిక్కెట్ల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేవి. ఐదేళ్లలో మూడుసార్లు భారీగా టిక్కెట్ల ధరలు పెంచడంతో.. సామాన్యులపై భారం పడుతోంది. ఆర్టీసీ.. ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారింది.

- డి.కిషోర్‌, రణస్థలం

Updated Date - May 19 , 2024 | 12:32 AM