Share News

మా నాయకుడే గెలుస్తాడని..

ABN , Publish Date - May 17 , 2024 | 12:06 AM

ఎన్నికల ఫలితాలపై జోరుగా పందాలు సాగుతున్నాయి. మా నాయకుడు గెలుస్తాడని కూటమి శ్రేణులు.. లేదు మళ్లీ మాదే అధికారమని.. మా నాయకుడే గెలుస్తాడని వైసీపీ నేతలు, కార్యకర్తలు బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఈ సారి తమ విజయం ఖాయమని.. మెజార్టీపై టీడీపీ అభిమానులు.. గెలుపుపై వైసీపీ శ్రేణులు పందాలు వేస్తున్నారు.

మా నాయకుడే గెలుస్తాడని..

- ఎన్నికల ఫలితాలపై జోరుగా పందాలు

- మెజార్టీపై టీడీపీ.. గెలుపుపై వైసీపీ బెట్టింగ్‌లు

(టెక్కలి)

ఎన్నికల ఫలితాలపై జోరుగా పందాలు సాగుతున్నాయి. మా నాయకుడు గెలుస్తాడని కూటమి శ్రేణులు.. లేదు మళ్లీ మాదే అధికారమని.. మా నాయకుడే గెలుస్తాడని వైసీపీ నేతలు, కార్యకర్తలు బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఈ సారి తమ విజయం ఖాయమని.. మెజార్టీపై టీడీపీ అభిమానులు.. గెలుపుపై వైసీపీ శ్రేణులు పందాలు వేస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందనేది చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో రికార్డుస్థాయిలో ఈ సారి 76.81 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓటింగ్‌ శాతం పెరగడంతో.. ఈసారి అధికారపార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడినట్టు.. వైసీపీ నాయకులు కంగారు పడుతున్నారు. మరోవైపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. కొంతమంది పందాలు కాస్తున్నారు. అభ్యర్థుల గెలుపుతో పాటు రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వ ఏర్పాటు చేస్తారన్న దానిపై కూడా పందాలు జోరందుకున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి? అన్న దానిపైనే బెట్టింగ్‌లు సాగుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా టెక్కలి నియోజకవర్గంలో రూ.లక్షల్లో పందాలు వేస్తున్నారు. టెక్కలిలో టీడీపీ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పోటీ చేశారు. గత ఎన్నికల్లో.. వైసీపీ ఒక్కఛాన్స్‌ హవాలోలనూ.. అచ్చెన్నాయుడు విజయం సాధించారు. ఈ సారి కూడా విజయం ఖాయమని ధీమాతో ఉన్నారు. ఇప్పటివరకూ వైసీపీ ఇక్కడ భోణీ కొట్టలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఈ నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వేయాలని.. వైసీపీ అధినేత జగన్‌ సైతం ప్రత్యేక దృష్టి సారించారు. అచ్చెన్నపై ప్రత్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనును బరిలో దించారు. పోలింగ్‌ ముగియడంతో గెలుపెవరిది అనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో పందాలు ఊపందుకుంటున్నాయి. మంగళ, బుధవారాల్లో కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో అచ్చెన్నను పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు కలిశారు. తమ విజయానికి ఢోకా లేదని, 20వేలకుపైగా మెజార్టీ వస్తుందని అచ్చెన్న వారికి స్పష్టం చేశారు. ఇక వైసీపీ శ్రేణులు గురువారం కోటబొమ్మాళిలోని ఓ ప్రైవేటు కళాశాలలో సమావేశమయ్యారు. వెయ్యి ఓట్లుతోనైనా ఈసారి టెక్కలిలో వైసీపీ గెలుస్తుందని చెప్పుకొస్తున్నారు. అచ్చెన్నకు ఓటు వేసేందుకు విదేశాల నుంచి వచ్చినవారు, పలువురు సీమెన్‌లు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, కొందరు వ్యాపారులు, టీడీపీ కార్యకర్తలు.. అచ్చెన్న 20వేలకుపైగా మెజార్టీ వస్తుందంటూ.. వైసీపీ శ్రేణులతో రూ.వేలు.. రూ.లక్షల్లో బెట్టింగ్‌ కాస్తున్నారు. స్వల్ప మెజార్టీతోనైనా వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు పందెంకు సై అంటున్నారు. పేర్లు బయటకు పొక్కకుండా ఉండేందుకు చాలామంది వాట్సాప్‌ కాల్స్‌లో మాట్లాడుకుంటున్నారు. మధ్యవర్తులకు రెండు పార్టీల వారు సొమ్ము చెల్లిస్తున్నారు. వీరితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రెడ్డీలు కొందరు టెక్కలిలో వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్‌ కాసినట్లు తెలుస్తుంది. వైశ్య వర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు టీడీపీ మెజార్టీ కోసం బెట్టింగ్‌ల్లో ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఫలితాలు వచ్చేవరకూ వేచిచూడాల్సిందే.

Updated Date - May 17 , 2024 | 12:06 AM