Share News

పీఏసీఎస్‌లకు గుదిబండ

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:31 AM

ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాలకు గోదాముల నిర్మాణం తలకు మించిన భారమవుతోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆయా సంఘాలు అప్పులో ఊబిలో పడుతున్నాయి.

పీఏసీఎస్‌లకు గుదిబండ
మెళియాపుట్టిలో నిర్మిస్తున్న గోదాం

- గోదాముల నిర్మాణ భారంతో సతమతం

- ఆదాయ మార్గాలు లేక సొసైటీలకు కష్టకాలం

(మెళియాపుట్టి)

ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాలకు గోదాముల నిర్మాణం తలకు మించిన భారమవుతోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆయా సంఘాలు అప్పులో ఊబిలో పడుతున్నాయి. రైతుల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలతోపాటు వాటికి అనుబంధంగా గోదాముల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. వీటి బాధ్యత పీఏసీఎస్‌లకు అప్పగించింది. ఈ నేపథ్యంలో నిధుల కోసం ఆయా సంఘాలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) నుంచి రుణాలు తీసుకున్నాయి. తొలిదశలో నిర్మాణాలు పూర్తికాకపోవడం.. ఆదాయ మార్గాలు లేకపోవడంతో రుణాలు ఎలా చెల్లించాలో తెలియక పీఏసీఎస్‌ సంఘాల పరిధిలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న పీఏసీఎస్‌లపై గోదాల నిర్మాణం గుదిబండగా మారిందని వాపోతున్నారు. రుణాల స్థానంలో ప్రభుత్వమే నిధులు విడుదల చేయాలని గతేడాది రైతులు ఆందోళన చేశారు. కానీ, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వారంతా అయోమయం చెందుతున్నారు.

జిల్లాలో 24 గోదాముల నిర్మాణానికి రూ.40 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. ఒక్కొక్కటీ సుమారు 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మిస్తున్నారు. ఈ భవనాలు గతేడాది డిసెంబరు నాటికే పూర్తి కావాల్సి ఉండగా.. ప్రస్తుతం చాలా చోట్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పీఏసీఎస్‌ల్లో అధికారుల జీతభత్యాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కో గోదాము నిర్మాణానికి రూ.40లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇందులో పీఏసీఎస్‌ తక్షణమే రూ.4లక్షలు భరించాలి. మిగిలిన 36 లక్షలు డీసీసీబీ ద్వారా రుణాలు తీసుకుని కాంట్రాక్టర్‌కు ఇవ్వాలి. ఈ రుణాలు ఏడాదికి రూ.4.88లక్షలు అసలు, వడ్డీ రూ.1.28 లక్షలు చొప్పున డీసీసీబీ చెల్లించాలి. పీఏసీఎస్‌లు అప్పు చేసి నిర్మించిన ఈ గోదాముల్లో పంట ఉత్పత్తులు, ఎరువులు నిల్వ చేసుకోవడం అద్దె రూపంలో రూ.లక్షల ఆదాయం వస్తుందని, వాటి ద్వారా రుణాలు తీర్చుకోవచ్చని అధికారులు సూచించారు. కాగా ఈ గోదాములు ఊరికి దూరంగా, రవాణా సదుపాయం లేని కొండల ప్రాంతాల్లో నిర్మిస్తుండడంతో ఎవరూ అద్దెకు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ధాన్యం సీజన్‌ కూడా పూర్తయిపోవడంతో రైతులు నిల్వలు చేసుకునే అవకాశాలు లేవు. దీంతో ప్రస్తుతం ఆదాయ మార్గాలు లేక అప్పులు ఊబిలో కూరుకుపోతున్నామని సహకార సంఘాల రైతులు వాపోతున్నారు.

పనులు కొనసాగుతున్నాయి

డీసీసీబీ రుణంతో గోదాములు నిర్మిస్తున్నాం. ఇంకా పనులు పూర్తికాకపోవడంతో అద్దెలకు ఇవ్వటం లేదు. నిర్మాణం పూర్తయిన తర్వాత రైతులకు అద్దెకు గోదాములు ఇస్తాం.

- కలమట వాసునాయుడు, సీఈవో, కొసమాళ పీఏసీఎస్‌, మెళియాపుట్టి

Updated Date - Feb 17 , 2024 | 12:31 AM